– ఉప్పల్ స్టేడియం వద్ద టీడీసీఏ మెరుపు ధర్నా
– శాట్జ్ మాజీ చైర్మెన్ అల్లీపురం సహా పలువురు అరెస్టు
నవతెలంగాణ-హైదరాబాద్:
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు అనుబంధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 200కు పైగా క్లబ్‌లు ఉన్నట్టుగానే తెలంగాణ ఉమ్మడి 9 జిల్లాల్లో 300 క్లబ్‌లకు కొత్తగా సభ్యత్వం ఇవ్వాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) అధ్యక్షుడు, శాట్జ్ మాజీ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. ఈ మేరకు హెచ్‌సీఏ 87వ ఏజీఎం సందర్భంగా శనివారం ఉప్పల్ స్టేడియం వద్ద టీడీసీఏ ప్రతినిధులు మెరుపు ధర్నా నిర్వహించి, తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు జరుగుతున్న అన్యాయంపై ఫ్లకార్డులు పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలిపారు. హెచ్‌సీఏ 87వ ఏజీఏం భేటిలో అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతి నిరాకరించారు. వెంకటేశ్వర్ రెడ్డి సహా టీడీసీఏ ప్రతినిధులను అరెస్టు చేసి మేడిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం స్టేషన్ బెయిల్‌పై టీడీసీఏ ప్రతినిధులను విడుదల చేశారు. ‘హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరును తక్షణమే తెలంగాణ క్రికెట్ సంఘంగా మార్చాలి. ప్రతి జిల్లాలో క్రికెట్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలి. లేదంటే గ్రేటర్ హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాలతో తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం ఏర్పాటుకు అభ్యంతరం లేదని తెలుపుతూ బీసీసీఐకి హెచ్‌సీఏ లేఖ రాయాలని’ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీడీసీఏ ప్రతినిధులు జిమ్మి బాబు, మల్లికార్జున్, శరత్, సుధీర్, మనీష్, బాబులాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లాలకు 300 క్లబ్‌లు ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -