నవతెలంగాణ-హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీలంక అతలాకుతలమయ్యింది. ఈ దిత్వా తుపాను కారణంగా ఆకస్మిక వరదలు వచ్చి, కొండచరియలు విరిగిపడడంతో 56 మంది మరణించినట్లు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో 21 మంది గల్లంతయినట్లు తెలిపారు. వరద ధాటికి 600కి పైగా ఇండ్లు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కొట్టుకుపోయాయి. అనేక రహదారులు, పొలాలు జల దిగ్బంధమయ్యాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను వెలికితీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పరిస్థితి మరింత విషమంగా మారడంతో, శ్రీలంక ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మూసివేసింది. అలాగే రైలు సేవలు నిలిపివేయడం జరిగింది. భద్రతా బలగాలు, విపత్తు నిర్వహణ బృందాలు సహాయ చర్యలు అందిస్తున్నారు. ఈ సమయంలో, వాతావరణ విభాగం మరింత భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.



