Saturday, September 13, 2025
E-PAPER

వి’భజన’

- Advertisement -

సెప్టెంబరు పదకొండున మోహన్‌ భగవత్‌ 75వ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ రాసిన వ్యాసం ఒక వ్యక్తిగత స్తుతిగా ప్రారంభమై, చివరికి ఒక రాజకీయ గీతికగా ముగిసింది. ఇందులో ఆయన భగవత్‌ను ”కరుణార్ద్ర నేత”గా, ‘వసుధైక కుటుంబం’ అనే భావనతో ప్రేరణ పొంది, సామాజిక మార్పు, శాంతి, సామరస్యం, సోదర భావమనే స్ఫూర్తిని బలోపేతం చేయడమే లక్ష్యంగా, తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుడిగా చిత్రీకరించారు. అయితే.. ఈ వ్యాసంలో మోడీ మోహన్‌భగవత్‌పై కురిపించిన అపారమైన ప్రశంసలకు సమాం తరంగా నిశ్శబ్దంగా దాచిన రాజకీయ వాస్తవాలనేకం కనిపిస్తాయి. వ్యాసం చదివితే అది పైకి ఒక ప్రశంసా గేయంగా అనిపిస్తుంది. అదే సమయంలో మోహన్‌ భగవత్‌ నేతృత్వంలో ఆరెస్సెస్‌ సాగిస్తున్న విభజన, విద్వేష రాజకీయాలను దాచిపెట్టే ప్రయత్నమూ కనిపిస్తుంది.

భగవత్‌ జీవితాన్ని ”వసుధైక కుటుంబం” అనే భావనకు ప్రతీకగా పేర్కొన్నారు మోడీజీ. కానీ వాస్తవం ఏమిటి? మోహన్‌ భగవత్‌ ఆధ్వర్యంలో ఆరెస్సెస్‌-బీజేపీ జంట నడిపిన రాజకీయాలు దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు ఏనాడూ చేయలేదు. పైగా వర్గాలుగా, మతాలుగా, కులాలుగా విభజించడానికే పనిచేశాయి. ”వసుధైక కుటుంబం” అని గొంతెత్తి చెప్పే ఈ పెద్దమనుషుల ఆచరణలో ‘భారతీయులంతా ఒకటే కుటుంబం’ అన్న సూత్రం ఎక్కడా ఎప్పుడూ కనబడదు. వీరి హయాంలో ‘హిందూ ఏకత్వం’ పేరిట మైనార్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా మలచే అజెండా మునుపెన్నడూ లేనంత ఉధృతంగా ముందుకు నెట్టబడింది. మెజారీటీల్లో అసహనం, మైనార్టీల్లో అభద్రత ఒక జీవనవిధానంగా స్థిరపరిచే ప్రమాదకరమైన పరిణామాలు ఊపందుకున్నాయి. మతహింసకు సంఫ్‌ు పరివార్‌ నుంచి అప్రకటిత ప్రోత్సాహం స్పష్టమైపోయింది. కొందరికి నిర్దాక్షిణ్యంగా తలుపులు మూసేస్తూ ”అందరిదీ ఒకే కుటుంబం” అనడం వీరికి మాత్రమే చెల్లిన విద్య! ఈ కాలంలో ముస్లింలపై లవ్‌జిహాద్‌, గోవధ పేరుతో కొట్టిపారేయలేని హింస కొనసాగింది. క్రైస్తవ మతస్తులపై, వారి చర్చిలపై, మిషనరీలపై ఉన్మాద దాడులు పెరిగాయి. ప్రతి సంఘటన తర్వాత ప్రభుత్వం, ఆరెస్సెస్‌ నేతలు వాటిని ఖండించడానికి బదులు మౌనం వహించడం లేదా దోషులను రక్షించడం ఓ ధోరణిగా మారిపోయింది. భగవత్‌ ఆలోచనల్లో సంవిధానం కంటే ‘మనుస్మృతి’కి దగ్గరగా ఉన్న విలువలే ప్రతిఫలించాయి. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) లాంటి నిర్ణయాలు ప్రత్యక్షంగా మైనార్టీలే లక్ష్యంగా సమాజంలో అనుమానాల గోడలు నిర్మించాయి. కశ్మీర్‌లో ప్రత్యేక హోదా రద్దుచేసి ప్రజాస్వామ్యాన్ని పక్కనబెట్టడం, మత పరమైన రాజకీయాలను గట్టిగా నిలబెట్టడం కూడా ఈ హయాంలోనే జరిగింది. ఒకవైపు ”అఖండ భారత్‌” అనే నినాదం, మరోవైపు సమాజాన్ని ఖండ ఖండాలుగా విభజించే క్రూర ప్రవర్తన! ఫలితంగా దేశం శాంతి, సామరస్యాలతో అభివృద్ధి దిశగా ఐక్యంగా నడవాల్సిన సమయంలో భయభ్రాంతులు, అసహనం, అనుమానాలు పెరిగే వాతావరణం నెలకొంది.

భగవత్‌ మృదుభాషణం, సంగీతాభిరుచి, పుస్తకపఠనం వంటి వ్యక్తిగత లక్షణాలను మోడీ రమణీయంగా వర్ణించారు. చదివితే ఒక సాహిత్య కథనంలా అనిపిస్తుంది. కానీ ఈ కాలంలో పెరిగిన మతవాదధోరణి, విభజనాత్మక వాతావరణం మోడీ వర్ణనలకు విశ్వసనీయతను అందిస్తాయా? ”స్వచ్ఛ భారత్‌”, ”బేటీ బచావో” వంటి ప్రభుత్వ పథకాలతో భగవత్‌ అనుసంధానం చూపిస్తూ ఆరెస్సెస్‌ను ప్రజల శ్రేయోభిలాషిగా చిత్రించారు మోడీ. కానీ ఆ సంస్థ పట్ల దళిత, మైనారిటీ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకున్న భయాలు, వారి జీవితంపై నిత్యకృత్యమైన హింసాత్మక సంఘటనల మాటేమిటీ? మోడీ ప్రశంసల అద్దంలో ప్రతిబింబం మాత్రమే కనబడుతోంది, గాయాలు మొత్తం దాచబడ్డాయి. వ్యాసంలో ఎమర్జెన్సీ ప్రస్తావన ఉంది. ”ఆ సమయంలో భగవత్‌ పోరాటం చేశారు” అని రాశారు. కానీ నిజమేమిటీ? ఆ సమయంలో ఆరెస్సెస్‌ చేసిన రాజీ ప్రయత్నాలు, మౌనవైఖరి, లొంగుబాటును చరిత్ర ఎత్తిచూపుతూనే ఉంది కదా. అందువల్ల వసుధైౖక కుటుంబమనే భావన సంఫ్‌ుపరివార్‌కు ఏ మాత్రం గిట్టదనేది ఆచరణలో తేలుతున్న నిజం. భగవత్‌ హయాంలో ఆరెస్సెస్‌-బీజేపీ సాగిన మార్గం దేశం మొత్తాన్ని విభజన దిశగా నడిపింది. ఒక జాతి, ఒక మతం ఆధిపత్యం కోసం మిగతా వర్గాలను అణచివేయడమే విధానంగా నిలిచింది. ”వసుధైక కుటుంబం” అనే సూత్రం మాటల్లో మాత్రమే మిగిలి, వాస్తవంలో అది ‘విభజన, మతహింస, అసహనం’ అనే కల్మషంతో మలినమై పోయింది. ఈ వ్యాసం ఒక సాదాసీదా ప్రశంస కాదు. ఇది సంఫ్‌ు-సర్కార్‌ అనుబంధానికి ఓ సంకేతం. రాబోయే ఎన్నికలు, ఆరెస్సెస్‌ శతాబ్ది వేడుకల నేపథ్యంలో ఇది మోడీ ఇచ్చిన ఒక స్పష్టమైన రాజకీయ హామీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -