Sunday, October 19, 2025
E-PAPER
Homeప్రత్యేకంవెలుగుల పండుగ దీపావళి

వెలుగుల పండుగ దీపావళి

- Advertisement -

దీపావళి అంటేనే వెలుగుల పండుగ. ఇంటిల్లి పాదీ ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ. ఊరు ఊరంతా దీపల వెలుగులతో నిండిపోతుంది. మిఠాయిలు, టపాసులతో పిల్లలు సందడి చేస్తుంటారు. జాతి, కుల, మత, విభేదాలు విస్మరించి అందరూ సమైక్యంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ముఖ్యమైది. దీపాల వెలుగుల్లా ప్రజలందరూ తమ జీవితాలు కూడా నిత్యం వెలుగుతూ ఉండాలని కోరుకుంటారు.
వ్యాకరణ పరంగా దీపావళి పదాన్ని విడదీస్తే దీపంఆవళి అవుతుంది. ఆవళి అంటే వరుస. దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. ప్రతి ఏడాది ఆశ్వీయుజ పూర్ణిమ తిథి నాడు అశ్వనీ నక్షత్రం ఉంటుంది. ఇదే నెల చివర నరక చతుర్దశి, అమావాస్య దీపావళి పండుగ జరుపుకుంటారు. అన్ని పండుగల మాదిరిగానే ఈ పండుగ గురించి కూడా అనేక కథలు ఉన్నాయి. అయితే చెడుపై మంచి విజయం సాధించిన సంతోషంలో జరుపుకునే పండగా దీన్ని చూస్తారు. కానీ నేటి సమాజంలో చెడు రాజ్యమేలుతూనే ఉంది. సమాజం అవినీతిమయంగా మారిపోయింది. రోజురోజుకు పెరిగిపోతున్న చెడును సమూలంగా తుడిచి వేయాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. ముఖ్యంగా మనుషులంతా సమానమే అనే భావంతో జరుపుకునే ఈ దీపావళి సందర్భంగా విభేదాలు తుడిచిపెట్టుకుపోవాలని కోరుకోవాలి.
సైన్స్‌ పరంగా చూస్తే అప్పటి వరకూ వర్షాలతో నేలంతా బురదమయం కావడం, దోమలు-ఈగల వంటి కీటకాలెక్కువై వ్యాధులు సంక్రమిస్తాయి. అందుకని టపాకాయలు, బాణాసంచా కాలుస్తారు. వాటి పొగలతో కీటకాలు చనిపోతాయని నమ్మకం. దీపావళి పండుగ పిల్లలకు ఎంతో ఇష్టం. రెండు మూడు రోజుల ముందు నుండే పిల్లలు టపాసులు కాలుస్తూ సంబరపడిపోతారు. అలాగే ఇంటి ముందు వరుసగా దీపాలను వెలిగిస్తారు. ముఖ్యంగా ఈ టపాకాయలు కాల్చే సమయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. పిల్లలకు దగ్గర ఉండి జాగ్రత్తలు చెప్తూ, వాళ్ళ చేత టపాసులు కాల్పించాలి. పేలే టపాసులను చేతిలో పెట్టుకొని కాల్చకూడదని చెప్పాలి! పేలే టపాసుల మీద సీసాలు, డబ్బాలు మూసి కాల్చకూడదు. పేలే టపాసుల కట్టను ఒక చేతిలో పట్టుకొని, ఇంకో చేతితో కాల్చకూడదు! ఒక చేతిలో ఒక టపాసు మాత్రమే కాల్చమని చెప్పాలి. ఏదైనా జరిగితే మంటలు ఆర్పేందుకు నీళ్లు పక్కకు ఉంచుకోవాలి.
కొవ్వొత్తుల వంటివి కాల్చేటప్పుడు చేతిని తలకు దూరంగా ఉంచేటట్లు చూడాలి. కాల్చిన తర్వాత కమ్మిలను దూరంగా నీటి డబ్బా ఏర్పాటు చేసుకొని దాంట్లో వేయాలి. చిచ్చుబుడ్డి వంటివి కొన్ని మొదట్లో కాలవు. కాలలేదని తలను దాని దగ్గరగా ఉంచి చూస్తే పొరపాటున పేలవచ్చు. దాంతో ప్రమాదాలు సంభవిస్తాయి. అలాగే భూ చక్రాలు విష్ణు చక్రాలు కాల్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చమని చెప్పాలి. ఆర్భాటాల కోసం పెద్ద పెద్ద శబ్దాలు తెచ్చి పేలుస్తుంటారు. శబ్ద తీవ్రత 10, 20 డిసెబుల్స్‌ దాటితే చెవులకు ప్రమాదం కాబట్టి వాటిని కాల్చకూడదు. పెద్ద శబ్దాలు చేసే బాంబుల వల్ల చిన్న పిల్లలు భయపడతారు. పశువులు కూడా బెదిరిపోతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తక్కువ శబ్దం, తక్కువ పొగను వదిలే టపాసులు కాల్చుకొని దీపావళి పండుగ సంబరాన్ని చేసుకోవాలి.
ఈ దీపావళి ఒక విధంగా మేలు చేస్తుందనే కానీ మరొక విధంగా పర్యావరణానికి హాని కలిగిస్తుంది. టపాసులు ఎక్కువ మోతాదులో కాల్చడం వల్ల దాని నుండి వచ్చే పొగతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అందుకే ఢిల్లీ వంటి చోట్ల టపాసులను పూర్తిగా నిషేధించారు ఈ పొగను పీల్చడం వల్ల గుండె సమస్యలు ఏర్పడుతున్నాయి. గుండె సమస్యలు ఉన్నవారు ఈ పొగలను పీల్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మనం ఎక్కువ గొప్పలకు వెళ్లకుండా ఉన్నంతలో తక్కువగా బాణాసంచా కాల్చుకోవాలి.
పండగ సంబరాలు జరుపుకోవాలంటే ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నప్పుడే ఆనందించగలుగుతాము అనేది గుర్తు పెట్టుకోవాలి. అయితే ఈ ఆధునిక కాలంలో ఆడపిల్లలను అవహేళన చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. మహిళలపై దాడులు, హింస పెచ్చరిల్లిపోతోంది. వారిని మానసిక వ్యధకు గురిచేస్తున్నారు. లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. సాధారణంగా మనం ప్రతి కొత్త ఏడాదికి ఒక ప్రతిజ్ఞ లేదా ఒక బాస చేసుకుంటాం. ఈ ఏడాది దీపావళి వెలుగులు కేవలం దీపాల్లోనే కాకుండా అమ్మాయిల ముఖాల్లో చూడాలనే ప్రతిజ్ఞ చేద్దాం.
ఈ దీపావళి పండుగ సందర్భంగా… హింసకు గురవుతున్న మహిళల జీవితాల్లో వెలుగులు వెలగాలని కోరుకుందాం. వారికి పునరుజ్జీవనం పట్ల అవగాహన కల్పించాలి. దగాపడిన ఆడపిల్లలకు బతికేందుకు ఏదైనా ఏర్పాటు చేయాలి! అలాగే వారికి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పరచాలి! మగ పిల్లలు అలాంటి దాడులకు పాల్పడకుండా తల్లితండ్రులు చిన్నతనం నుండే ఆడపిల్లలను గౌరవించేలా పెంచాలి. ఆడపిల్లల పట్ల ప్రేమ, అణుకువ, మర్యాద, మన్నన ఉండేలా వారిలో అవగాహన కల్పించాలి. అలాంటి సంఘటనలు జరిగినప్పుడే కాకుండా అవకాశం దొరికినప్పుడల్లా హెచ్చరించాలి. అప్పుడే తన అక్కచెల్లెండ్లనే కాకుండా బయటి ఆడపిల్లలను కూడా మర్యాదగా చూస్తారు.
పిల్లల ముందే తల్లిదండ్రులు ఇతర ఆడపిల్లలను హేళన చేస్తే అది వాళ్లు అలుసుగా తీసుకొని పరాయి ఆడపిల్లలను తక్కువ చేసి చూడడం మొదలుపెడతారు. మగ పిల్లల్లో సంస్కరణ ఇంట్లోనే జరగాలి. అప్పుడే వాళ్లు సమాజ కంటకులుగా తయారు కాకుండా మంచి ప్రవర్తనతో మెదులుతారు. అలా ఈ దీపావళి నుండే ఆడవారికి గౌరవ మర్యాదలనిచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపాలని. అప్పుడే నిజమైన దీపావళి పండుగ జరుపుకున్నట్టు.

  • రంగరాజు పద్మజ, 9989758144
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -