– 14వ సారి సెమీఫైనల్లో అడుగు
– సెమీస్‌లో అల్కరాస్‌తో అమీతుమీకి సై
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
టెన్నిస్ ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సష్టించేందుకు అడుగు దూరంలో నిలిచిన సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ యుఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌పై నాలుగు సెట్ల క్వార్టర్‌ఫైనల్లో గెలుపొందిన జకోవిచ్ యుఎస్ ఓపెన్‌లో 14వ సారి సెమీఫైనల్లో కాలుమోపాడు. రెండో సీడ్ కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్)తో సెమీఫైనల్లో తలపడేందుకు జకోవిచ్ రంగం సిద్ధం చేసుకున్నాడు.
న్యూయార్క్ (యుఎస్‌ఏ)
నొవాక్ జకోవిచ్ (సెర్బియా) రికార్డు గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో మరో అడుగు ముందుకేశాడు. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై జకోవిచ్ 6-3, 7-5, 3-6, 6-4తో నాలుగు సెట్ల మ్యాచ్‌లో విజయం సాధించాడు. కూతురు పుట్టినరోజు టెన్నిస్ కోర్టులో రాకెట్ పట్టిన జకోవిచ్.. మెరుపు విజయంతో తీయని బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు. 10 ఏస్‌లు, నాలుగు బ్రేక్ పాయింట్లతో సత్తా చాటిన జకోవిచ్.. పాయింట్ల పరంగా 130-126తో పైచేయి సాధించాడు. నాలుగు సెట్లలో జకోవిచ్ 22 గేమ్ పాయింట్లు గెల్చుకోగా… టేలర్ ఫ్రిట్జ్ 18 గేమ్‌లు గెల్చుకున్నాడు. 12 ఏస్‌లు, ఐదు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడిన టేలర్ ఫ్రిట్జ్ రెండు బ్రేక్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా తొలి రెండు సెట్లు గెలుపొందిన జకోవచ్‌కు మూడో సెట్లో ప్రతిఘటన ఎదురైంది. మూడో సెట్‌ను నెగ్గిన టేలర్ ఫ్రిట్జ్ తర్వాతి సెట్లో ఆశించిన పోటీ ఇవ్వలేదు. దీంతో జకోవిచ్ అలవోకగా సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మెన్స్ సింగిల్స్ మరో క్వార్టర్‌ఫైనల్లో రెండో సీడ్, యంగ్ స్పెయిన్ బుల్ కార్లోస్ అల్కరాస్ సైతం సెమీస్‌లో అడుగుపెట్టాడు. చెక్ రిపబ్లిక్ ఆటగాడు, 20వ సీడ్ జిరి లేహెకాపై 6-4, 6-2, 6-4తో కార్లోస్ అల్కరాస్ విజయం సాధించాడు. కార్లోస్ అల్కరాస్ 5 ఏస్‌లు, నాలుగు బ్రేక్ పాయింట్లతో అదరగొట్టాడు. పాయింట్ల పరంగా 92-65తో అల్కరాస్ పైచేయి సాధించాడు. చెక్ ఆటగాడు తొలి సెట్లో, మూడో సెట్లో కూసింత పోరాట పటమి చూపించినా.. కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్న అల్కరాస్ ముంగిట నిలువలేకపోయాడు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ అరినా సబలెంక (బెలారస్) చెమట పట్టకుండా సెమీఫైనల్‌కు చేరుకుంది. చెక్ రిపబ్లిక్ అమ్మాయి మార్కెట వండ్రుసోవ ఫిట్‌నెస్ సమస్యతో క్వార్టర్‌ఫైనల్ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో సబలెంక కోర్టులోకి అడుగుపెట్టకుండానే సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.