టాస్క్‌ఫోర్స్ టీమ్‌లతో నిఘా పెట్టండి : అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం అనుమతి లేని హెచ్‌టీ పత్తి విత్తనాలను రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలనీ, టాస్క్‌ఫోర్స్ టీమ్‌లతో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రంలో అనధికార, అనుమతిలేని పత్తి విత్తనాల ప్యాకెట్ల అమ్మకాలను అరికట్టాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాయలంలో వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపు 52 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉందని, దీన్ని ఆసరా చేసుకుని దళారులు హెచ్‌టీ, కల్తీ విత్తనాలను రాష్ట్రంలోకి దొడ్డిదారిలో తెచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నెల నుంచే సరిహద్దు ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి పత్తి విత్తనాల అక్రమ రవాణాలను అరికట్టే విధంగా నిఘా ఏర్పాట్లు చేయాలనీ, కో-మార్కెటింగ్ కు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
హెచ్‌టీ, బీడీ-3 పత్తి రకాన్ని అమెరికాకు చెందిన మోన్సాంటో కంపెనీ కనుగొన్నప్పటికీ ఫీల్డ్ ట్రయల్స్‌లో అది ఫెయిల్ అయ్యిందనీ, దానివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందనే కారణంతో ఆ రకం పత్తి విత్తనాలకు కేంద్రం అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. కొందరు దళారులు తమ ప్రయోజనాల కోసం రైతులకు హెచ్‌టీ పత్తి విత్తనాలను అనధికారకంగా కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 20 అధీకృత పత్తి విత్తన కంపెనీలు విత్తనోత్పత్తి చేస్తుండగా ప్రభుత్వం సర్టిఫైడ్ చేసిన మరో 40 వివిధ కంపెనీలు రాష్ట్రానికి పత్తి విత్తన ప్యాకెట్లను సరఫరా చేస్తున్నాయన్నారు. గతేడాది ఆ కంపెనీల ద్వారా సరఫరా అయిన 1.10 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారని చెప్పారు. కొందరు దళారులు కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన హెచ్‌టీ విత్తనాలతో పాటు కల్తీ విత్తనాలను మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని రైతులకు అమ్ముతున్నట్టు గుర్తించామని చెప్పారు. ఆ పత్తి విత్తనాలను రైతులు కొనకుండా అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. అధిక దిగుబడి వస్తుందనే ప్రచారాన్ని నమ్మి ఆ విత్తనాలను కొనవద్దనీ, పర్యావరణానికి హాని కలిగించవద్దని రైతులను కోరారు.



