ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
ఈనెల 22న రాష్ట్ర స్థాయి సదస్సు
ట్యాంక్‌బండ్ వద్ద నిరసనకు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు
‘గెట్ టు గెదర్’ సమావేశం ‘ఉపాధి’ చట్టం మార్పు, విద్యుత్
సవరణ బిల్లు-2025పై ఆగ్రహం
అసెంబ్లీలో తీర్మానం చేయాలి
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఈ కోడ్‌లను అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా ఐక్య పోరాటానికి పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 12న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలన్నాయి. హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ‘గెట్ టు గెదర్’ సమావేశం జరిగింది. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, టీయూసీఐ, బీఆర్టీయూ, ఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ, ఏఐయూటీయూసీ తదితర సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21న లేబర్ కోడ్‌లను నోటిఫై చేసిందని తెలిపారు. 2020లో పార్లమెంట్ ఆమోదించినప్పటికీ, కార్మిక సంఘాల ఐక్య పోరాటాల వల్లే ఇన్నాళ్లు వాటిని అడ్డుకోగలిగామని, అదే స్ఫూర్తితో ఇప్పుడు వాటి అమలునూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజరు కుమార్ మాట్లాడుతూ.. లేబర్ కోడ్‌లు రద్దు చేసే వరకు ఐక్య ఉద్యమాలు నిర్మించాలని, ఫిబ్రవరి 12 సమ్మెలో ఐఎన్‌టీయూసీ పూర్తి భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. రైల్వే రంగంలో హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతామని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బా రామారావు చెప్పారు.
కార్మికుల చట్టాలను కాలరాస్తూ.. పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు మహమ్మద్ యూసుఫ్, ఎస్.బాల్‌రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026ను ఐక్య పోరాటాల సంవత్సరంగా ప్రకటించి ముందుకు సాగాలన్నారు. కార్మిక వర్గంలోని అసంతృప్తిని మిలిటెంట్ పోరాటాల వైపు మళ్లించాలని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కె.సూర్యం సూచించారు. టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎల్.పద్మ మాట్లాడుతూ.. వెనిజులా దేశాధ్యక్షుడిపై అమెరికా సామ్రాజ్యవాద దాడిని ఖండిస్తూ తీర్మానం చేయాలని కోరారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు అరుణ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం కార్మికులతోపాటు రైతులకూ నష్టం చేస్తున్నదని, దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను కింది స్థాయి వరకు తీసుకెళ్లాలని చెప్పారు. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా 33 జిల్లాల్లో సదస్సులు జరపాలని బీఆర్‌టీయూ నిర్ణయించిందని, పోరాటాలు తీవ్రంగా జరిగితేనే బీజేపీ విధానాలను వెనక్కి కొట్టగలమని రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్ అన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. సమ్మె జయప్రదం కోసం జనవరి 22న రాష్ట్ర స్థాయి ఉమ్మడి సదస్సు నిర్వహించడంతోపాటు లేబర్ కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీలో ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రికి అన్ని సంఘాల ద్వారా లేఖలు రాయా లన్నారు. జనవరి నెలలో ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన చేపట్టాలని, లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా 33 జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని చెప్పారు.
‘ఉపాధి’ మార్పుపై ఖండన
మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం పేరు, స్వభావాన్ని మారుస్తూ దాని స్థానంలో వీబీజీరామ్‌జీని తీసుకురావడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజలకు నష్టం చేకూర్చే విద్యుత్ సవరణ బిల్లు-2025ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. వెనిజులా దేశంపై అమెరికా సామ్రాజ్యవాద దాడిని ఖండిస్తూ, వెనిజులాకు మద్దతుగా తీర్మానం చేసింది. ఈ సమావేశంలో ఐఎన్‌టీయూసీ నాయకులు మల్లేష్ గౌడ్, కె.రవి, ఏఐటీయూసీ బి.కిషన్, ఎం.ప్రవీణ్‌కుమార్, ఐఎఫ్‌టీయూ పి.శివబాబు, అరుణ, జి.అనూరాధ, టీయూసీఐ యూ.ప్రవీణ్, మహమ్మద్ అఫ్జల్, కె.ఎస్ ప్రదీప్, సీఐటీయూ ఆఫీస్ బేరర్స్ జె.వెంకటేష్, ఎస్వీ రమ, వంగూరు రాములు, వీఎస్.రావు, కూరపాటి రమేష్, పాలడగు సుధాకర్, పి.శ్రీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సోమన్న, ఎ.సునిత తదితరులు పాల్గొన్నారు.
లేబర్‌కోడ్‌లను అమలు చేయొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



