మధ్యాహ్నం 3.00గం||లకు
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్
నేడు సెమీస్‌లో హర్మన్‌ప్రీత్ సేన కీలక పోరు
నవీ ముంబయి
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్ బెర్త్‌పై గురిపెట్టింది. ఫైనల్‌కు చేరే క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను గురువారం జరిగే సెమీస్‌లో ఓడిస్తేనే టైటిల్‌పై ఆశలు సజీవంగా నిలుపుకోనుంది. టోర్నీ చరిత్రలో కేవలం రెండుసార్లు మాత్రమే భారత మహిళలజట్టు ఫైనల్‌కు చేరినా.. ఆ రెండు సందర్భాల్లోనూ ఓటమిపాలై రన్నరప్‌కే పరిమితమైంది. 2025 వన్డే ప్రపంచకప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా ఆశించిన మేరకు ప్రదర్శన చేయకపోయినా నాలుగో స్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. భారత్ ఏడు పాయింట్లతో నాకౌట్ దశకు క్వాలిఫై అయింది. మూడోసారి టైటిల్ పోరుకు దూసుకెళ్లాలంటే ముందుగా ‘కంగారూ’ను జయించాలి. నేడు జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను హర్మన్‌ప్రీత్ సేన ఓడిస్తేనే అది సాధ్యం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించడం భారత్‌కు అంత తేలిక కాదు. లీగ్ దశలో కంగారూలతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 330 పరుగులు చేసినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.
ఎల్లిస్ పెర్రీ, ఆష్లీన్ గార్డ్‌నర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీలతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. వీరంతా ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా ఉన్నవాళ్లే. సూపర్ ఫామ్‌లో ఉన్న ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ భారత్‌తో సెమీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది భారత్‌కు ఉపశమనాన్ని ఇచ్చే అంశం. బౌలింగ్‌లో ప్రధానంగా అలానా కింగ్, అన్నాబెల్ సదర్లాండ్‌తో భారత్‌కు ముప్పుంది. సోఫీ మోలినెక్స్, ఆష్లీన్ గార్డ్‌నర్ కూడా బంతితో రాణిస్తే టీమిండియాకు ఇబ్బందులు తప్పవు. సెమీస్‌కు ముందు ఫామ్‌లో ఉన్న ప్రతీక రావల్ గాయంతో టోర్నీకి దూరమవడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. మంధాన, రోడ్రిగ్స్, హర్లిన్, హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ, రీచా ఘోష్ ఫామ్‌లో ఉండడం టీమిండియాకు శుభ పరిణామం. క్రాంతి గౌడ్, శ్రీచరణి, దీప్తి, రేణుకా సింగ్ బంతితో మెరిస్తే ఆసీస్‌కు చెక్ పెట్టడం ఖాయం. తొలిసారి టైటిల్‌పై కన్నేసిన టీమిండియాకు ప్రధాన అడ్డంకి సెమీస్‌లో ఆసీస్ రూపంలో ఎదురైంది. ఈ అడ్డంకిని తొలిగిస్తేనే హర్మన్‌ప్రీత్ సేన మరోసారి తుదిపోరుకు అర్హత సాధించనుంది.
ఇప్పటిదాకా 12 వన్డే ప్రపంచకప్‌లు జరగ్గా.. భారత్ నాలుగుసార్లు సెమీస్‌కు చేరింది. ప్రస్తుతం జరుగుతోన్న 13వ ఎడిషన్‌లో భారత్ మరోసారి నాకౌట్ దశకు అర్హత సాధించగలిగింది. 1997లో ఆస్ట్రేలియా, 2005లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. 2005లో కివీస్‌ని 40 పరుగుల తేడాతో మట్టికరిపించిన మిథాలి రాజ్ సేన.. తుది పోరులో ఆస్ట్రేలియా జోరు ముందు నిలవలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2017లో కప్పు గెలిచేందుకు భారత అమ్మాయిలకు మంచి అవకాశమే వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. సెమీస్‌లో భీకర ఆస్ట్రేలియాను ఓడించిన భారత్.. ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో 9 పరుగుల తేడాతో ఓడి విశ్వవిజేతగా నిలిచే ఛాన్స్‌ను మిస్ చేసుకుంది. ఇప్పుడు టైటిల్‌కు మరో రెండు అడుగుల దూరంలో నిలిచిన టీమిండియా.. సెమీస్‌లో ‘ఆస్ట్రేలియా’ గండాన్ని దాటితే.. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరుకు సిద్ధం కానుంది.
జట్లు(అంచనా) :
ఇండియా: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), మంధాన, హర్లిన్ డియోల్, రీచా ఘోష్(వికెట్ కీపర్), రోడ్రిగ్స్, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ/అమన్‌జోత్ కౌర్, క్రాంతి గాడ్, శ్రీ చరణి, రేణుక సింగ్, స్నేహ్ రాణా.
ఆస్ట్రేలియా: మెక్ గ్రాత్(కెప్టెన్), మూనీ(వికెట్ కీపర్), లిచ్‌ఫీల్డ్, ఎలైసే పెర్రీ, సథర్లాండ్, గార్డినర్, వారేహామ్, అలానా కింగ్, కిమ్ గ్రాత్, హీలీ, మోలినెక్స్/బ్రౌన్.



