నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక దినేష్ గ్రాండ్ లాడ్జిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి, ఐదేళ్ల కుమార్తె మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళితే.. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన గోపి, భోపాల్లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య శంకర కుమారి అదే ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఐదేళ్ల మౌనిక, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. నిన్న రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేటకు వచ్చిన ఈ కుటుంబం, స్థానిక లాడ్జిలో గది తీసుకుంది.
అయితే, వీరు గదిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శంకర్ కుమారి, పెద్ద కుమార్తె మౌనిక (5) అక్కడికక్కడే మరణించారు. గోపి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను నరసరావుపేటలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడేళ్ల చిన్నారి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు మత్తు ఇంజెక్షన్లు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని, ఈ దారుణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వైద్య వృత్తిలో ఉన్న దంపతులు తమ పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది.


