Friday, January 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువికసిత్‌ భారత్‌ అంటే పేదల పొట్టగొట్టడమేనా?

వికసిత్‌ భారత్‌ అంటే పేదల పొట్టగొట్టడమేనా?

- Advertisement -

అంబానీ..అదానీల కోసమే ‘నరేగా’లో మార్పులు
కార్పొరేట్లకు కారు చౌకగా కూలీలను పంపేందుకు కేంద్రం కుట్రలు
దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే
ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకోం : ప్రధాని మోడీపై ఫైర్‌
‘ఉపాధి’ని పునరుద్ధరించే వరకు పోరాడతామని ప్రతిజ్ఞ
బీజేపీ విధానాలతో దేశానికి నష్టం : టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాల్సిన అవసరముందని వ్యాఖ్య


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీల కోసమే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా)లో మార్పులు చేసిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. వారికి కారుచౌకగా కూలీలను పంపేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉధృత పోరాటాలు నిర్వహించటం ద్వారా ఈ విషయంలో ప్రధాని మోడీతో ప్రజలకు క్షమాపణలు చెప్పిస్తామని వ్యాఖ్యానించారు. వికసిత్‌ భారత్‌ అంటే పేదల పొట్టగొట్టటమేనా? అని సీఎం ప్రశ్నించారు. ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించే వరకు పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. బీజేపీ విధానాలతో దేశానికి తీవ్ర నష్టమని, అందువల్ల రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయటమే తక్షణ అవసరమని నొక్కి చెప్పారు. ఇందుకనుగుణంగా కాంగ్రెస్‌కు చెందిన ప్రతీ కార్యకర్త కంకణబద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షలు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని 80 శాతం మంది ప్రజలు ఉపాధి చట్టంలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఇంతటి కీలకమైన చట్టంలో మార్పులు చేయటం ద్వారా మోడీ ప్రభుత్వం పేదల పొట్టగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెట్టిచాకిరీని నిర్మూలించి, దేశానికి స్వాతంత్య్రం తెచ్చి, ఓటు హక్కును అందించిన చరిత్ర మహాత్మాగాంధీ, అంబేద్కర్‌లదని గుర్తుచేశారు. ఆ చరిత్రను వక్రీకరించేందుకు బీజేపీ యత్నిస్తోందని, అందులో భాగంగానే ‘ఉపాధి’ చట్టంలో మహాత్ముని పేరును తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు సాధించటం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేందుకు, తద్వారా అంబానీ, అదానీలకు దేశాన్ని అప్పగించేందుకు కాషాయ పరివారం కుయుక్తులు పన్నిందని దుయ్యబట్టారు. అయితే ప్రజలను అప్రమత్తం చేసిన తమ పార్టీ.. అలాంటి కుట్రలను అడ్డుకుందని చెప్పారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ ఓటు ప్రక్షాళన పేరుతో ‘సర్‌’ కార్యక్రమాన్ని తెచ్చి పేదలు, మైనార్టీల ఓటు హక్కును తొలగించేందుకు ప్రయత్నిస్తోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

అదే జరిగితే పేదలకు రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డుతోపాటు సంక్షేమ కార్యక్రమాలు అందకుండాపోతాయని హెచ్చరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎవరెవరు అధికారంలో ఉండాలనే దాన్ని నిర్ణయించే అధికారం తనకే ఉండాలని బీజేపీ భావిస్తోందని విమర్శించారు.’ దేశంలో వికసిత్‌ భారత్‌ ఎక్కడుంది?’ అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రశ్నించారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని రద్దు చేసి తెచ్చిన ‘వీబీజీరామ్‌జీ’ పేరులోనే గందరగోళముందని ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల వేదికగా వచ్చిన ఉపాధి హామీ చట్టం పేదల ఆత్మగౌరవాన్ని పెంచిందనీ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గతంలో మోడీ తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి రాహుల్‌ గాంధీ విజయం సాధించారనీ, దేశ రైతులకు మోడీతో క్షమాపణలు చెప్పించారని ఆయన గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల మొదటి రోజు రాష్ట్ర ఎంపీలు కేంద్రం ముందు నిరసన గళం విప్పాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

ఇంటింటి ప్రచారం
వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్‌ జెండా ఎగరాలని సీఎం ఆకాంక్షించారు. సర్పంచ్‌ ఎన్నికల్లో సమిష్టి కృషితో 66శాతం సీట్లను గెలుచుకున్నామని గుర్తు చేశారు. కార్యకర్తల కష్టార్జితంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచామని, ప్రస్తుతం ఆ కార్యకర్తలను గెలిపించుకునే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. వారి గెలుపు కోసం తాను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తానని తెలిపారు.

ములుగు సభకు సోనియా, రాహుల్‌, ప్రియాంక
ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్‌ తీర్మానం చేశాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. కేంద్రం చర్యలకు నిరసనగా ఈనెల 20 నుంచి 30 వరకు ప్రతీ గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసి కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఆయన సూచించారు. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బాధ్యత తీసుకుని పని చేయాలని ఆదేశించారు. ప్రతి మండలానికి ఒక ఇన్‌చార్జిని నియమించాలని సూచించారు. తాను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి అన్ని జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. ములుగులో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభకు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించనున్నట్టు ఆయన తెలిపారు.

విదేశాలను ఆకర్షించిన నరేగా : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
‘నరేగా’ విదేశీయులను సైతం ఆకర్షించి, ఆ చట్టం వివరాలను తెలుసుకునేలా చేసిందని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. అలాంటి చట్టాన్ని రద్దు చేసి తెచ్చిన వీబీ జీరామ్‌జీ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అదే విధంగా గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేయాలని డీసీసీలను ఆదేశించారు. మరోపక్క నరేగా గొప్పతనాన్ని వివరిస్తూ ప్రతి నియోజకవర్గానికి 5వేల చొప్పున కరపత్రాలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.

సామ్రాజ్యవాదంకంటే బీజేపీ ప్రమాదం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సామ్రాజ్యవాదంకంటే బీజేపీ మరింత ప్రమాదమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు, గొప్ప మార్పులు కాంగ్రెస్‌ తెచ్చిన చట్టాలతోనే వచ్చాయని ఆయన గుర్తుచేశారు. బీజేపీ ఆ చట్టాలను రద్దు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీపై లాఠీ ఎత్తేందుకు కూడా సామ్రాజ్యవాదులైన బ్రిటీష్‌ పాలకులు ఇష్టపడలేదని, కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం కలిగిన వ్యక్తులు ఆయన్ను కాల్చి చంపేశారని గుర్తుచేశారు. ఆ భావజాలం కలిగిన పాలకులు ఈ దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టంలో వ్యవసాయ సీజన్‌లో ఏడాదిలో 60 రోజుల పాటు ఉపాధి పనులకు అవకాశం లేదని, దీంతో పేదలు పట్టణాలకు వలసపోయే ప్రమాదముందని అన్నారు. యజమానులు ఎంత కూలీ ఇస్తే అంత తీసుకునే దుస్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

దక్షిణాదికి అన్యాయం
ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే పన్నులను తిరిగి ఇచ్చే విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని డిప్యూటీ సీఎం విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాలు రూ.100 పన్ను కడితే రూ.300 వాటికి కేటాయిస్తున్నదని చెప్పారు. తెలంగాణకు మాత్రం రూ.100 కడితే రూ.45 మాత్రమే కేటాయిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీజీ రామ్‌జీ చట్టం రద్దు కోసం చేసే ఉద్యమంలో రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలందరూ పాల్గొంటారని ఆయన వివరించారు.

ఉపాధితో విప్లవాత్మక మార్పులు : మంత్రి ఉత్తమ్‌
ఉపాధి చట్టం దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. అలాంటి చట్టాన్ని బీజేపీ రద్దు చేసిందని విమర్శించారు. మోడీ తెచ్చిన కొత్త చట్టం గ్రామీణ కూలీలకు మరణ శాసనం లాంటిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నరేగా చట్టంలో మార్పులను సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, మంత్రులు శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, అజహరుద్దీన్‌, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్‌, ఏఐసీసీ నాయకులు ప్రవీణ్‌ చక్రవర్తి, ప్రభుత్వ సలహాదారులు కేశవ రావు, వేం నరేందర్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, హర్కర వేణుగోపాల్‌, పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ (పీఏసీ) సభ్యులు, టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్లు, జనరల్‌ సెక్రెటరీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -