– 2-2తో టీమ్ ఇండియా గురి
– విజయమే లక్ష్యంగా గిల్‌సేన
– మ|| 3.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టు
భారత్, ఇంగ్లాండ్ ఐదు టెస్టుల ‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీ అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఆఖరు టెస్టు నేటి నుంచి ది ఓవల్ స్టేడియంలో ఆరంభం కానుండగా.. 2-1తో ఆతిథ్య ఇంగ్లాండ్ ముందంజలో కొనసాగుతుంది. మాంచెస్టర్ టెస్టులో అసమాన ప్రదర్శనతో టీమ్ ఇండియా రెట్టించిన ఉత్సాహంతో విజయమే లక్ష్యంగా సమరానికి సై అంటోంది. ఆఖరు టెస్టులో భారత్ నెగ్గితేనే సిరీస్ సమం కానుంది, లేదంటే ఆతిథ్య ఇంగ్లాండ్ 2014 తర్వాత తొలిసారి భారత్‌పై టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది.
నవతెలంగాణ-లండన్
ఆద్యంతం రసవత్తరంగా సాగిన భారత్, ఇంగ్లాండ్ ‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీలో అన్ని సమీకరణాలు తెరుచుకునే ఉన్నాయి. ఆఖరు టెస్టులో కనీసం డ్రాతో ఇంగ్లాండ్ సిరీస్ అందుకోనుండగా.. గెలుపుతో భారత్ ట్రోఫీని అట్టిపెట్టుకునే అవకాశం ముంగిట నిలువనుంది. లీడ్స్ నుంచి మాంచెస్టర్ వరకు తీవ్ర భావోద్వేగాల నడుమ సాగుతున్న టెస్టు సమరం అంతిమ ఫలితం కోసం ‘ది ఓవల్’కు చేరుకుంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ లేకుండా ఇంగ్లాండ్.. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా లేకుండా భారత్ బరిలోకి దిగుతుండగా.. భారత్, ఇంగ్లాండ్ ఆఖరు టెస్టు నేటి నుంచి ది ఓవల్‌లో ఆరంభం కానుంది.
ఆ ఇద్దరు లేకుండానే
ఐదు రోజుల ఆటలో భారత బ్రహ్మాస్త్రాలు రిషబ్ పంత్, జశ్‌ప్రీత్ బుమ్రా. విలక్షణ ఆటతీరుతో టెస్టు క్రికెట్‌లో ఊహాకందని ఇన్నింగ్స్‌లు ఆడటంలో పంత్‌కు సాటి లేరు. ఏ సమయంలో బంతి అందుకున్నా.. ప్రత్యర్థి భాగస్వామ్యం విడదీయటంలో బుమ్రాను మించిన పేసర్ లేరు. ఇప్పుడు ఈ ఇద్దరూ ఆఖరు టెస్టుకు దూరం కావటం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ. కాలు పాదం ఫ్రాక్చర్ గాయంతో పంత్ దూరం కాగా.. ఫిట్‌నెస్, పని భారం నేపథ్యంలో బుమ్రా అందుబాటులో లేడు. బ్యాట్‌తో, బంతితో ఈ ఇద్దరు లేకుండా ప్రత్యర్థికి దీటైన సవాల్ విసరటం గిల్‌సేనకు అతిపెద్ద పరీక్ష. రిషబ్ పంత్ స్థానంలో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్ తుది జట్టులో నిలువనున్నారు. ఆకాశ్ దీప్ ఇంగ్లాండ్ పరిస్థితుల్లో సత్తా చాటినా.. ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ సామర్థ్యంపై అనుమానాలు పోలేదు. దీంతో బ్యాటింగ్ లైనప్‌లో పంత్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ వచ్చే సూచనలు ఉన్నాయి.
అతడు మెరిసేనా?
భారత బ్యాటింగ్ లైనప్‌లో భయమెరుగని విధ్వంసక ఆటగాడు యశస్వి జైస్వాల్. ఓపెనర్‌గా కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌లు ఆడిన యశస్వి జైస్వాల్ సిరీస్‌ను గొప్పగా మొదలెట్టాడు. తొలి టెస్టులోనే ధనాధన్ మెరుపులతో ఆకట్టుకున్నాడు. కానీ గత రెండు టెస్టుల్లో జైస్వాల్ అంచనాలను అందుకోలేదు. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ నిలకడగా రాణిస్తున్నా.. యశస్వి జైస్వాల్ నిరాశపరుస్తున్నాడు. బ్యాటింగ్ లైనప్‌లో పంత్ లేకపోవటంతో యశస్విపై బాధ్యత పెరగనుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గిల్ కొనసాగుతున్నాడు. ఆఖరు టెస్టులోనూ భారత్‌కు శుభ్‌మన్ గిల్ కీలకం. రవీంద్ర జడేజాకు వాషింగ్టన్ సుందర్ జత కలవటంతో లోయర్ ఆర్డర్‌లో భారత్‌కు పరుగుల వేట కష్టాలు తొలగిపోయాయి. స్పిన్ ఆల్‌రౌండర్ల నుంచి భారత్ మరోసారి మాంచెస్టర్ తరహా ప్రదర్శన ఆశిస్తోంది.
సిరాజ్ సారథ్యంలో..
జశ్‌ప్రీత్ బుమ్రా ఆఖరు టెస్టులో ఆడటం లేదు. బీసీసీఐ వైద్య బృందం సూచనల మేరకు బుమ్రా అందుబాటులో ఉన్నప్పటికీ.. అతడి ఫిట్‌నెస్‌ను రిస్క్‌లో పెట్టేందుకు జట్టు మేనేజ్‌మెంట్ సిద్ధంగా లేదు. ఇంగ్లాండ్‌లో మూడు టెస్టులే ఆడేందుకు వచ్చిన బుమ్రా.. ఇప్పటికే ఆ మార్క్ చేరుకున్నాడు. దీంతో అతడి గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్ పేస్ దళానికి నాయకత్వం వహించనున్నాడు. ఆకాశ్ దీప్‌తో కలిసి సిరాజ్ కొత్త బంతిని పంచుకోనున్నాడు. పంత్ లేనందున బ్యాటింగ్ డెప్త్ కోసం శార్దుల్ ఠాకూర్‌ను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. మూడో పేసర్‌గా ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కంబోజ్‌లు పోటీపడుతున్నారు. ప్రసిద్ కృష్ణ, అన్షుల్ కంబోజ్‌లు సిరీస్‌లో అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేదు. వైట్‌బాల్ ఫార్మాట్‌లో బుమ్రా స్థాయిలో రాణిస్తున్న అర్ష్‌దీప్ ది ఓవల్‌లో టెస్టు అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కెప్టెన్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్
కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. భుజం గాయానికి గురైన బెన్ స్టోక్స్ మాంచెస్టర్ టెస్టులో బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడు. నాలుగు టెస్టుల్లో 17 వికెట్లతో ఉత్తమ బౌలర్‌గా కొనసాగుతున్న బెన్ స్టోక్స్.. ది ఓవల్‌లో ఆడాలని అనుకున్నా గాయం కారణంగా బెంచ్‌కు పరిమితం కానున్నాడు. స్టోక్స్ స్థానంలో ఒలీ పోప్ ఇంగ్లాండ్ సారథ్య పగ్గాలు చేపట్టనున్నాడు. మాంచెస్టర్ టెస్టులో ఏకధాటిగా 143 ఓవర్లు సంధించి అలసిపోయిన ఇంగ్లాండ్.. ఐదో టెస్టుకు కొత్త పేసర్లను బరిలోకి దింపుతోంది. గస్ అటిక్సన్, జెమీ ఓవర్టన్, జోశ్ టంగ్‌లు పేస్ విభాగంలోకి రానున్నారు. క్రిస్ వోక్స్ వరుసగా ఐదో టెస్టు ఆడనుండగా.. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్‌లు దూరం కానున్నారు. బెన్ స్టోక్స్ స్థానంలో జాకబ్ బెతెల్ తుది జట్టులోకి రానున్నాడు. జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్ సహా జో రూట్, హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్‌లు బ్యాటింగ్ లైనప్‌లో ఇంగ్లాండ్‌కు కీలకం. పేస్ స్వర్గధామ పిచ్‌పై స్పిన్నర్ లేకుండానే ఇంగ్లాండ్ ఆడనుంది.
పిచ్, వాతావరణం
ది ఓవల్ పిచ్ సంప్రదాయంగా పేస్ స్వర్గధామం. పిచ్ నుంచి స్పిన్‌కు పెద్దగా సహకారం లభించదు. మ్యాచ్‌కు ముందు పిచ్‌పై మంచి పచ్చిక కనిపిస్తోంది. మ్యాచ్ రోజు ఏమైనా మార్పులు ఉండవచ్చు. ఐదు రోజులు వాతావరణం ఆహ్లాదకరంగానే ఉండనుంది, కానీ నేడు మధ్యాహ్నం చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఆఖరు రెండు రోజుల్లోనూ వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపనుంది.
తుది జట్లు :
భారత్ (అంచనా) : యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), శార్దుల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెతెల్, జెమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అటిక్సన్, జెమీ ఓవర్టన్, జోశ్ టంగ్.
సమం చేస్తారా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES