Sunday, January 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి'యంగ్‌ ఇండియా' అంటే నిరుద్యోగమేనా?

‘యంగ్‌ ఇండియా’ అంటే నిరుద్యోగమేనా?

- Advertisement -

యంగ్‌ ఇండియా, యువశక్తి అనే మాటలతో సరిపెట్టకుండా, యువజన సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలనేది నేటి భారత దేశ యువత ఆకాంక్ష. మనదేశం అత్యధిక మంది యువజన జనాభా కలిగి ఉంది. ఇలాంటి యువశక్తిని దేశ నిర్మాణంలో భాగస్వాములు చేయడానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఏమిటి? ప్రపంచంలోనే అత్యధిక మంది యువత కలిగి ఉన్న దేశం అని గర్వపడాలా? యువతను విస్మరిస్తున్న తీరుకు సిగ్గుపడాలా అన్నట్లుగా ఉంది. ‘ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం.’ ఇది 2014లో మోడీ అధికారంలోకి వచ్చే ముందు చేసిన వాగ్దానం. ఈలెక్కన పదకొండేండ్ల పాలనలో 22 కోట్ల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలి. కానీ లేదే!. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు భర్తీచేసిన ఉద్యోగాలు కేవలం పది లక్షలు మాత్రమే. ఇది స్వయాన పార్లమెంటులో కేంద్రమంత్రి ప్రకటించిన లెక్కలు. కానీ, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో అరవై లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు అంచనా. వీటిని ఎందుకు భర్తీచేయడం లేదన్నది ప్రశ్న?

ప్రభుత్వం మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్ట్‌ అఫ్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, వంటి ప్రచార ఆర్భాటమే తప్ప నిరుద్యోగులకు చేసిందేమీ లేదు. కొత్త ఉద్యోగాలు సృష్టించకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి కోట్లాదిమంది నిరుద్యోగులు రోడ్డున పడ్డ పరిస్థితి. నేడు వందల పోస్టులకు వేలల్లోనూ, వేల పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు వేసుకుంటున్న తీరు దేశంలో నిరుద్యోగ పెరుగుదలకు నిదర్శనం. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాలలో తరచుగా ఇలాంటి పరిస్థితి మీడియాలో పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్నది. సీఎంఐఈ లెక్కల ప్రకారం దేశంలో ప్రతియేటా నిరుద్యోగం తీవ్రస్థాయిలో పెరుగుతుందని వెల్లడించింది. పొరుగున ఉన్న దేశాలతో పోలిస్తే మన దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ మరింత పెరుగుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నవి. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లకంటే నిరుద్యోగం మన దేశంలో ఎక్కువ. 83 శాతం ఇంజనీరింగ్‌ పట్టభద్రులకు ఉద్యోగాలు లేవని మోడీ పాలనలో నిరుద్యోగం పెరుగుదలపై హార్వార్డ్‌, పిఎల్‌ఎఫ్‌ఎస్‌, ఐఎల్‌ఓ తదితర నివేదికలు స్పష్టం చేస్తున్నవి.

సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఎకానమీ నివేదిక ప్రకారం దేశంలో 7.2 శాతం నిరుద్యోగ ఉన్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవడం, ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రయివేటు, కార్పోరేట్‌ సంస్థలకు అప్పగించడం ప్రభుత్వరంగ సంస్థలన్నీ మూతపడ్డ మూలంగా నిరుద్యోగులకు విద్య ఉద్యోగావకాశాలు దూరమయ్యాయి. అంతిమంగా యువతకు అటు ప్రభుత్వరంగాల్లో, ఇటు ప్రయివేట్‌ కంపెనీలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. ఉన్నత చదువులు చదివినా కూడా దేశంలో తమ చదువులకు తగిన ఉద్యోగాలు చేస్తున్న పట్టభద్రులు కేవలం 8.25శాతం మంది మాత్రమే ఉన్నారని ఒకసంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. యాభైశాతంపైగా పట్టభద్రులు తమ డిగ్రీలు పక్కనపెట్టి క్లర్క్‌, మిషన్‌ ఆపరేటర్స్‌, వంటి ఏడవ తరగతి స్థాయి ఉద్యోగాలు చేస్తున్నట్లు పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ మరో నివేదికలో వెల్లడించింది. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన 83శాతం మందికి ఇంకా ఉద్యోగాలు లభించడం లేదని. స్కిల్‌ డెవలప్మెంట్‌ కంపెనీ అన్‌స్టాప్‌ ఇటీవల విడుదల చేసిన టాలెంట్‌ రిపోర్టు (2025) లో వెల్లడించింది.

పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే ద్వారా 2025లో నిరుద్యోగిత పట్టణ ప్రాంతాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు తక్కువగా ఉన్నట్లు తెలిపింది. కరోనా అనంతరం ఉద్యోగాల కోసం పట్టణాల నుండి గ్రామాలకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా యువత నిరుద్యోగం ఎక్కువగా ఉంది. 15 నుండి 29 సంవత్సరాలు మధ్య వయసుకు అయిన యువతలో నిరుద్యోగ రేటు అధికంగా 13.10శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంది. వ్యవసాయంపై అధిక శాతం జనాభా ఆధారపడడం. మరోవైపు నెమ్మదిగా జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి మూలంగా పేదరికం నిరుద్యోగం పెరుగుటకు కారణాలుగా ఉన్నాయి. మన దేశంలో చేయడానికి పని లేక, ఉపాధి లేక అన్ని అర్హతలు ఉండి కొందరు, ఏ అర్హతలు లేక కొందరు నిరుద్యోగులు మారుతున్నారు. డిగ్రీలు పుచ్చుకున్న చాలామంది వద్దకు సరైన ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. దేశంలో ప్రతి సంవత్సరం పదిహేను లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ విద్యలో పట్టభద్రులు అవుతున్న వారిలో ఎనభై శాతం మందికి ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు లేవని నివేదికలు చెబుతున్నాయి.

ఉపాధి ఉద్యోగాలు లేక పెద్ద పెద్ద నగరాల్లో యువత అంతా జొమాటో, స్విగ్గి వంటి గిగ్‌వర్కర్లుగా మారి పనిచేస్తున్నారు. డెలివర్‌ బార్సుగా, క్యాబ్‌ డ్రైవర్లుగా పనులు చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. అందుకే దేశంలో విద్య, ఉపాధి, నిరుద్యోగ సమస్యలతో దేశానికి ప్రమాదకరంగా ముందుకొస్తున్న వివిధ అంశాలపై యువత స్పందించాల్సిన సందర్భమిది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా జరుపు కుంటున్నాము. ఈ సందర్భంగానైనా దేశంలో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు, విద్య, ఉపాధి, నిరుద్యోగ అంశాలపై పాలకులు చర్చించాలి. ఎప్పటిలాగే కాకుండా, కొన్ని నినాదాలు తాత్కాలిక ప్రణాళికలతో కాకుండా, స్పష్టమైన జాతీయ యువజన విధానం అమలు చేసేలా ప్రణాళికలు ప్రవేశపెట్టాలి. యువత కూడా తనకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడంతో పాటు సమాజానికి ఎదురవుతున్న సమస్యలపై నిరసన స్వరం పెంచాలి.ఆ విధంగా ఈ జాతీయ దినోత్సవాన ప్రతిఒక్కరూ ప్రతినబూనాలి.

కోట రమేష్‌
9618339490

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -