వరి ధాన్యం సేకరణకు మిల్లర్ల అనాసక్తి
నవతెలంగాణ – మల్హర్ రావు
రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత మిల్లర్లు సన్నాల సేకరణకే మొగ్గు చూపుతున్నారు. మిల్లర్లు దొడ్డు రకం ధాన్యం తీసుకుంటే బియ్యం ఎఫ్ఫ్సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. వాటిని ఇతర రాష్ట్రాలకు పంపిస్తారు. వారు నిబంధనలు కచ్చితంగా పాటిస్తుండటంతో నాణ్యతలో ఎలాంటి లోపాలున్నా..అధికారులు సీరియస్ గా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం సీఎస్ సీకి అప్పగించే సన్నబియ్యం రీసైక్లింగ్ చేసుకోవచ్చు..సీఎంఆర్ పాస్ చేయడంలో టెక్నికల్ అసిస్టెంట్లు చూసీచూడనట్లు కానిచ్చేస్తుండటంతో మిల్లర్లు సన్నరకం వరి ధాన్యం దించుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఈ విషయంలో అధికారులు సైతం మిల్లర్లకు సహకరిస్తున్నారనే వదంతులు ఉన్నాయి. మండలంలో పిఏసిఎస్ ద్వారా 13, డిసిఎంఎస్ ద్వారా 3 మొత్తం 16 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించగా..ఇప్పటి వరకు 13 మాత్రమే ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు సన్నరకం 2200 క్వింటాల్ల కొనుగోలు చేస్తే.. దొడ్డురకం ఒక క్వింటాల్ కూడా సేకరించకపోవడం గమనార్హం.మండలంలో మొత్తం 15,500 ఎకరాల్లో వరి సాగు కాగా అందులో దొడ్డు రకం వెయ్యి ఎకరాల్లో సాగు చేసినట్లుగా తెలుస్తోంది.



