Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeమానవికోపం వద్దు

కోపం వద్దు

- Advertisement -

పియ్రమైన వేణు గీతికకు… నాన్న ఎలా ఉన్నావు? రెండు వారాలైంది తల్లి నీకు ఉత్తరం రాసి. ఒంట్లో బాగుండక రాయలేపోయాను. కొంచం ఓపిక వచ్చింది. మనసు ఊరుకోదు కదా, అందుకే రాయటానికి కూర్చున్నాను. నాన్న.. ఈ రోజు నీకు కోపం, దానివల్ల ఎదుటి వారికి కలిగే బాధ గురించి చెప్తాను. మనిషికి కోపం సహజం. అయితే కొంతమంది ఎప్పుడూ కోపంగానే ఉంటారు. నోటికి ఏది వస్తే అది అంటారు. దాని వల్ల ఎదుటి మనిషికి వారి పట్ల సదభిప్రాయం ఉండదు. అటువంటి వారికి ఎవరైనా దూరంగా ఉంటారు. ఇంకొందరు ఉంటారు వారికి ఏం మాట్లాడితే కోపం వస్తుందో తెలియదు. ఇటువంటి వారిని జాగ్రత్తగా గమనిస్తూ చాలా తక్కువ మాట్లాడాలి. మరికొందరు ప్రశాంతంగానే ఉంటూ, ఏదైనా కోపం కలిగే సంఘటన జరిగితే విషయం తెలుసుకోకుండా, ఎదుటివారికి చెప్పే అవకాశం ఇవ్వకుండా అరిచేస్తారు. ఇది ఎదుటివారికి ఎంతో బాధ కలిగించే విషయం.
ఇలాంటి సంఘటనే నేను ఎదుర్కొన్నాను. ఈ మధ్య ఒక తెలిసిన పెద్దాయనతో ఒక చోటుకి వెళ్లాల్సి వచ్చింది. అంతకు ముందు రాత్రి నాకు ఆరోగ్యం బాగోక వారికి రాలేనని మెసేజ్‌ పెట్టాను. అది అతను చూసుకోకుండా, బయలుదేరే ముందు ఫోన్‌ కూడా చేయకుండా, ఇంటి దగ్గరికి వచ్చేసి అసలు నేను చెప్పేది వినకుండా అరిచేశారు. సరే పెద్దవారు ఎంతో దూరం నుంచి వచ్చారని ఆరోగ్యం బాగోకపోయినా తయారయ్యాను. నేను కిందికి వస్తున్నా అన్నా వినకుండా కోపంతో వెళ్ళిపోయారు. ఇంటి వరకు వచ్చి నేను వస్తున్నానని చెప్పినా వినకుండా వెళ్ళిపోవటం నాకు చాలా బాధకలిగించింది. అది మర్చిపోవడానికి నాకు 15 రోజులు పట్టింది.
ఇప్పుడు నేను నీకు చెప్పేదేమిటంటే, ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శించడానికి ఓ విధానం ఉంటుంది. ఏ అధికారం ఉందని, ఏ హక్కు ఉందని ఎదుటి మనిషి మీద ఇష్టం వచ్చినట్లు కోపం ప్రదర్శిస్తారు? అది చాలా తప్పు. నీకు కూడా నీ స్నేహితులపై, ఇంట్లో వాళ్లపై, తోటి ఉద్యోగులపై కోపం రావచ్చు. అయినా నియంత్రించుకోవడం తెలుసుకోవాలి. కోపాన్ని ఎప్పుడూ మన అదుపులో పెట్టుకోవాలి. ఎదుటి వారి పట్ల కోపం వచ్చినా వారికి చెప్పే విధానంలోనే చెప్పాలి. అంతే కానీ ఇష్టం వచ్చినట్లు అరవకూడదు. కోపం వల్ల అనర్ధాలు, మనస్పర్ధలు, మనుషులు దూరం అవటం, మనసు గాయపడటం తప్పితే జరిగే మంచి ఏమీ లేదు.
ఎప్పుడైనా నువ్వు చూసావా నేను ఎవరి మీదైనా కోప్పడడం? ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చినా కూడా నేను మాట్లాడకుండా ఉంటాను తప్పితే ఎవరిమీద అరవను. ఎదుటివారు చెప్పేది కూడా నేను వింటాను. విన్న తర్వాత వారు చెప్పింది నిజమా కదా, ఆ పరిస్థితి అలా వచ్చింది కదా అని అర్థం చేసుకుంటాను. ఎప్పుడూ కూడా మన కోపాన్ని ఎదుటివారిపై ప్రదర్శించకూడదు. అయితే ఇంట్లో కొన్ని విషయాల్లో కోపం ప్రదర్శించక తప్పదు. అది ఇంట్లో వాళ్లు కాబట్టి సర్దుకుపోతారు, అర్థం చేసుకుంటారు. అదే బయటి వాళ్లు మంచి వాళ్లు, వాళ్లతోటి మనకు మంచి అనుబంధం ఉన్నా వారి మనసుకు చిన్న గాయం ఏర్పడుతుంది. దాన్ని వాళ్ళు మర్చిపోలేరు. కనుక మనసుని గాయపరిచి మనుషుల్ని దూరం చేసుకునే కంటే కొద్దిసేపు మన కోపాన్ని నియంత్రించుకుంటే అంతా సుఖమే. ఉంటాను…
ప్రేమతో మీ అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img