పియ్రమైన వేణు గీతికకు
నీతో ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీ ఆఫీస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు చాలా బాగా జరిగాయి. నీపై అధికారులను పరిచయం చేసావు, వాళ్ళందరూ వృత్తి పట్ల నీకున్న చిత్తశుద్ధి, నిజాయితీ గురించి చెప్తుంటే చాలా సంతోషం వేసింది. కష్టపడి పనిచేస్తే ఆ ఫలితం ఎక్కడికి పోదు నాన్న. సరే ఈ రోజు మోసాలలో జరుగుతున్న ఇంకొక విషయం గురించి చెప్తాను. ఇలాంటిది మా చిన్నప్పటి నుండి ఉన్నదే. అదేంటంటే బంగారు, వెండి నగలకు మెరుగుపెడతాము, మీ కళ్ల ముందే మెరుగు పెట్టి ఇస్తాము అంటారు. నిజమే వాళ్ళు మన ఎదురు గానే మన నగలకు మెరుగుపెడతారు. కానీ కనురెప్ప మూసి తెరిచేటంతలో అవి మాయమైపోతాయి. మా చిన్నప్పుడు నాయనమ్మ చెప్తూ ఉండేది, వీళ్ళను నమ్మకూడదు, బంగారం మాయం చేస్తారని. అందుకే తనే స్వయంగా కుంకుడు రసంలో నానబెట్టి బ్రష్‌తో శుభ్రం చేసుకునేది. అలాగే మీ నాయనమ్మ కూడా చేసేవారు.
ఇంకొక సంఘటన ఏమిటంటే ఒకతను స్వామీజీ వేషంలో బాగా నమ్మించాడు. నీ దగ్గర ఉన్న బంగారం నేను రెండింతలు చేస్తాను మీ ఇంట్లోనే మీ ఎదురుగానే చేస్తాను అని చెప్తే, నమ్మి ఇంటికి తీసుకొచ్చి పూజలు, హోమాలు అంటూ మొదలుపెట్టి దంపతులను కూర్చోబెట్టి చూడండి అంటూ ఏదో ఒక ఉంగరం లాంటిది అక్కడ పెట్టండి అంటే వాళ్ళు పెట్టారట ఏవో మంత్రాలు చదివి కళ్ళు మూసుకోండి అని, కొద్దీ సేపటి తర్వాత తెరవండి అంటే అక్కడ ఇంకొక బంగారపు ఉంగరం కనిపించింది. దాంతో వాళ్ళు గుడ్డిగా నమ్మి అతనికి ఇంట్లోనే మూడురోజుల ఆశ్రయం ఇచ్చి చెప్పిన వన్నీ చేశారు. ఇంట్లో ఉన్న బంగారం, వెండి అన్ని తెచ్చి అక్కడ పెట్టారు. అవన్నీ మూట కట్టి పక్కన పెట్టి మీరు పడుకోండి రేపటి కల్లా అన్నీ డబల్ అవుతాయంటే నమ్మారు. తీరా అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక అవి తీసుకుని పారిపోయాడు.
అత్యాశ నష్టం తెచ్చిపెడుతుంది. ఈ మధ్య పేపర్లో చదివాను.. ఒక బంగారం షాప్ అతను కొన్నేండ్లుగా నగల వ్యాపారం చేస్తున్నాడు. ఆ ఊరి వాళ్లు ఎక్కువమంది అతని దగ్గరే కొంటారు. బంగారం ధర బాగా పెరగబోతోందని, ముందే బిస్కెట్ల రూపంలో కొనుక్కోండి అని సలహా ఇచ్చాడు. బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి చాలా మంది బంగారం బిస్కెట్స్ కొన్నారు. కొన్న తర్వాత ‘నేను నగ చేయించి అమ్మి పెడతాను, మీకు లాభం వుంటుంది’ అని చెప్తే అందరూ వాళ్ళు కొన్న బంగారం బిస్కెట్స్ నగలు చేయించడానికి ఇచ్చారట. ఇలా కొన్న వాళ్ళందరూ అతని దగ్గర పెట్టేసరికి, ఒకరోజు రెండో కంటి వాడికి తెలీకుండా 40 కోట్లకు పైగా బంగారంతో మనిషి మాయమైపోయాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఎక్కడ నమ్మకం వుంటుందో, అక్కడే మోసం చేయడం చాలా తేలిక. అందుకే అతి నమ్మకం వద్దు. ఉంటాను నాన్న. మళ్ళీ మన యాత్రా ప్రయాణం దగ్గరకు వస్తోంది.
ప్రేమతో అమ్మ
పాలపర్తి సంధ్యారాణి


