నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతల మహా జాతర తేదీలు ఇప్పటికే ఖరారైన విషయం తెలిసిందే. మేడారం మహా జాతర 2026, జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగనుంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా జాతరకు లక్షల్లో భక్తులు తరలి రానున్న క్రమంలోనే చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక సదపాయాలపై ఇవాళ జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మేడారంలో నిర్మాణ పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మక్క, సారలమ్మ గద్దెల దగ్గరలో ఉన్న చెట్లను తొలగించవద్దని సూచించారు. పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దని తెలిపారు. నిర్మాణంలో చిన్న విమర్శలకు కూడా తావు ఇవ్వొద్దని తెలిపారు. గద్దెల సమీపంలో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి, అక్కడే నాలుగు వైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సమ్మక్క సారాలమ్మ గద్దెల ప్రాంగణం గ్రాండ్ లుక్ వచ్చేలా లైటింగ్ ఏర్పాట్లు.. ప్రధాన ఆలయం చుట్టూ పచ్చదనం అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు.



