Friday, June 20, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఒంటరితనమనే రుగ్మత బారిన పడవద్దు !

ఒంటరితనమనే రుగ్మత బారిన పడవద్దు !

- Advertisement -

ఒంటరితనం ఓ మానసిక భావోద్వేగ ప్రక్రియ. కొందరికి ఒంటరితనం లేదా ఏకాంతం ఓ అద్భుత అవకాశంగా నిలిస్తే చాలామందికి ఒంటరితనం ఓ అవాంఛనీయ అనారోగ్యకర సమస్యగా నిలుస్తున్నది. దాదాపు 50 శాతం జనాభా అంతర్ముఖులుగా ఒంటరితనాన్ని కోరుకుంటారు.. అనారోగ్యాల బారిన పడతారు. మితి మీరిన ఒంటరితనం ప్రమాదకరంగా మారి చివరికి ప్రాణాంతకం కూడా అవుతుంది. ఒంటరితనాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తే అది వ్యక్తి సంపూర్ణ శ్రేయస్సుకు ఉపకరిస్తుంది. ఒంటరితనానికి, ఏకాంతవాసానికి తేడా ఉన్నది. ఒంటరితనం అనేది ఒక భావోద్వేగ ప్రతికూల స్థితి. తాను ఇతరులతో కనెక్ట్‌ కావాలని కోరుకున్నప్పటికీ, వారి చుట్టు ఎవరూ లేరని భావించడాన్ని ఒంటరితనం అనవచ్చు. ఏకాంతం అనేది ఒక వ్యక్తి కావాలని ఒంటరిగా ఉండడం, తమ చుట్టు పక్కలకు దూరంగా ఉంటూ ఆలోచనలు చేయడం అని అర్థం చేసుకోవాలి. ఏకాంతం అనేది ఒక ఆశావహ ప్రయోజనకర మానసిక స్థితి.
ఒంటరితనం అవగాహన వారోత్సవాలు
ఒంటరితనం అనేది రుగ్మతగా మారితే అత్యంత ప్రమాదకరం అవుతుందని, దాని పట్ల ప్రజలకు కనీస పరిజ్ఞానం అందించడానికి ప్రతి ఏటా జూన్‌ 09 నుంచి 15 వరకు ”ఒంటరితనం అవగాహన వారోత్సవాలు లేదా లోన్లీనెస్‌ అవేర్‌నెస్‌ వీక్‌”గా జరుపుతున్నారు. 2025 ఒంటరితనం అవగాహన వారం ఇతివత్తంగా ”ఒంటరితనాన్ని ఐక్యతతో ఎదుర్కొందాం” అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తారు. సహజమైన మానవ భావోద్వేగ ఒంటరితనం పట్ల ప్రజల్లో కళంకంగా భావించబడుతున్న వేళ దానిని అధిగమించడానికి పౌర సమాజం కూడా కషి చేయాలి. ఒంటరితనం పట్ల నిర్భయంగా, బహిరంగంగా చర్చలు చేయాలి. ఒంటరితనం వలయంలో చిక్కిన అభాగ్యులతో మాట్లాడుతూ వారితో మానవ సంబంధాలు, సంభాషణలు పెరిగే విధంగా చూద్దాం.
ఒంటరితనం దుష్ప్రభావాలు
నిశ్శబ్ద రుగ్మతగా సమాజంలో వ్యాపిస్తున్న ఒంటరితనాన్ని ఒక దురాచారంగా లేదా ప్రతిష్టకు మచ్చగా నిలుస్తున్నవేళ దాని పట్ల అవగాహన కల్పించడం జరగాలి. దీర్ఘకాలం పాటు ఒంటరితనాన్ని అనుభవించిన వారిలో మతిమరుపు, హదయనాళ అనారోగ్య సమస్యలు, స్ట్రోక్‌, నిరాశ, ఆందోళన, అకాల మరణాలు, అలసట, ఆత్మన్యూనత భావం, మానసిక ఒత్తిడి లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒంటరితనం ఫలితంగా శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక ప్రతికూలతలతో పాటు మానవ సంబంధాల సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
ఒంటరితనాన్ని ఓడించడం ఎలా ?
ఒంటరితనాన్ని ఓడించి చురుకుగా, సరదాగా సమాజంతో మమేకం అవుతూ జీవితాన్ని ఆస్వాదించడానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉండడం, చొరవ తీసుకొని ఇతరులతో మాట్లాడడం, మన అభిరుచులకు తగిన బంధువులు/ మిత్రులతో ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ వేదికల్లో గడపడం, మనకు ఇష్టమైన పనులను చేసి ఆనందాన్ని పొందడం, మన భావాలను దగ్గరి వారితో పంచుకోవడం/పరిష్కార మార్గాలను తెలుసుకోవడం, ఒంటరిగా, ముభావంగా ఉండే వారికి దగ్గర కావడం లాంటి చర్యలు ఒంటరితనమనే రుగ్మతను దూరం చేస్తాయి. ఒంటరితనాన్ని పరిమితం చేస్తూ, పౌర సమాజంతో దగ్గరవుతూ, సంతోష సాగరంలో మునుగుతూ, జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటూ, ఎంపిక చేసుకున్న లక్ష్యాలను అధిగమిస్తూ, అందరి మన్ననలు పొందుతూ, చలాకీగా ప్రవర్తిస్తూ ఆయురారోగ్యాలతో జీవితాంతం ఆనందంగా ఉందాం, ఆనందాన్ని పంచుదాం.
(09 – 15 జూన్‌ ”ఒంటరితనం అవగాహన వారోత్సవాలు” సందర్భంగా)
డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
9949700037

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -