– పురోగతిలేని పునరావాసం
– వేల ఎకరాలు నీట మునక
– రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలని రైతుల డిమాండ్
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
వేసవిలోనూ దుందుబీ నది నుంచి కాల్వల ద్వారా పంట పొలాలకు నీరు మళ్లించి సాగు చేసేవాళ్లం.. ఇంటికి ఒకరుచొప్పున వచ్చి కాల్వల్లో ఇసుకను తీసి పారించేవాళ్లం. వరి, కూరగాయలు, వేరుశనగ, పప్పుశనగ వంటి పంటలు సాగు చేసుకునే వాళ్లం.. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో మా పంట పొలాలను రిజర్వాయర్‌లో ముంచుతున్నారు.. దానికి సరైన పరిహారం కూడా ఇవ్వడం లేదు.. రెండేండ్ల నుంచి పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించు కోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది.. గోకారం- ఎర్రవల్లి రిజర్వాయర్ సామర్థ్యంతో పాటు ముంపు తగ్గించి 2013 జీఓ ప్రకారం పరిహారం చెల్లించాలి.. అంటూ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చారకొండ, ఎర్రవల్లి సమీపంలో గోకారం రిజర్వాయర్ నిర్మిస్తే.. వేల ఎకరాల పంట భూములు ముంపుకు గురవుతాయి. ఏదుల రిజర్వాయరు నుంచి నీటిని మళ్లించి ఉల్పర, చారకొండ మీదుగా నల్లగొండకు నీరు వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే టన్నెల్ పనులు పూర్తయ్యాయి. కాల్వల నిర్మాణం పూర్తి కావచ్చింది. ఇక రిజర్వాయర్ మొత్తం పూర్తయితే నీటి తరలింపు ప్రారంభమవుతుంది. కానీ, గోకారం రిజర్వాయరు నిర్వాసితులకు పరిహారం ఇస్తేనే పనులు ముందుకు సాగే అవకాశం ఉంది. ప్రభుత్వం 10ఎకరాల భూమికి ఇచ్చే పరిహారంతో మరో చోట ఎకర పొలం కూడా రాదు. 1673 ఎకరాల్లో ఒక టీఎంసీ నీటి నిల్వ ఉండేలా గోకారం రిజర్వాయర్ నిర్మాణం చేయడానికి పనులు జరు గుతున్నాయి. రైతులకు పరిహారం ఇవ్వకముందే గుత్తేదారు గోకారం చెరువు నీటిని బయటకు తీయడా నికి గండి పెట్టారు. దీంతో చెరువులో నీటి నిల్వ లేకుండా బయటకు పోతోంది. అందువల్ల 570 ఎకరాల ఆయకట్టు ఎండిపో తుండగా.. 140 మత్స్యకార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రిజర్వాయర్‌లో 300 మంది రైతులకు చెందిన గోకారం శివారులో 870 ఎకరాలు, ఎర్రవెల్లికి చెందిన 593 ఎకరాలు, బైరాపూర్‌కు చెందిన 197 ఎకరాలు, జేపల్లికి 11 ఎకరాలు ముంపునకు గురవుతాయని గుర్తించారు. ఇండ్లూ మునగనున్నాయి. మరో వైపు భూసేకరణలో భాగంగా పరి హారం ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇటు భూములు అమ్ముకునే అవకాశాలులేవు. ఎవరైనా అమ్ముదా మంటే కొనుగోలు చేసేవారు ముందుకు రావడం లేదు.
ఏడాది కాలంగా ఆందోళన
గోకారం-ఎర్రవల్లి గ్రామపంచాయతీల పరిధిలో నిర్మించే ఈ రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలని కోరుతూ ఏడాది కాలంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం దిగొచ్చి పరిహారం చెల్లించడంతోపాటు ప్రాజెక్టు సామర్థ్యం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం గోకారం విషయంలో విధాన పరమైన నిర్ణయం ప్రకటించేవారకు ఆందోళన విరమించేది లేదంటున్నారు.
మేమెలా బతకాలి..
సాగు చేసుకునే భూములు పోయాయి. బతుకుదెరువు లేకుండా పోయింది. భూములు పోయినంక సాగునీరు వస్తే మాకేంది.. రాకుంటే మాకేంది. పరిహారమన్నా న్యాయంగా ఇవ్వాలని రెండేండ్లుగా కోరుతున్నాం. పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా మా బతుకులను ఆగం చేస్తున్నారు.– రైతు లక్ష్మయ్య, గోకారం- చారగొండ మండలం
2013ప్రకారం పరిహారమివ్వాలి
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న గోకారం రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలి. ముంపు నకు గురవుతున్న రైతులకు 2013 జీవో ప్రకారం పరిహారం చెల్లించాలి. బయటి మార్కెట్‌కు మూడిం తలు పరిహారమివ్వాలి. లేనిచో భూమికి భూమి ఇచ్చి ఆదుకోవాలి. పరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తే.. రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. – బాల్‌రెడ్డి, రైతు సంఘం నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు
పాలసీ ప్రకారం ముందుకెెళ్తున్నాం..
పరిహారం పెంచాలని, రిజర్వాయర్ డిజైన్ మార్చాలని రైతులు కోరుతున్నారు. వారి డిమాండ్ న్యాయమైనదే కావచ్చు కానీ, ప్రభుత్వ విధానాన్ని మేం మార్చలేము. ఏదైనా ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. మేము ఇచ్చిన డీపీఆర్ ప్రాసెస్ ప్రకారం ముందుకెళ్తున్నాం.- డీఈ జ్ఞానేశ్వర్, డిండి ప్రాజెక్టు



