Wednesday, November 19, 2025
E-PAPER
Homeజాతీయంబనకచర్లకు అనుమతులివ్వొద్దు

బనకచర్లకు అనుమతులివ్వొద్దు

- Advertisement -

ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు అన్యాయం
కర్నాటకనూ ఆపండి : కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు మంత్రి ఉత్తమ్‌ విజ్ఞప్తి
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టేందుకు సిద్ధమవుతున్న పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని, ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మంగళవారం నాడిక్కడ ఆయన కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో సీడబ్ల్యూసీ ఛైర్మెన్‌తో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం మీడియాతో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడారు.

45 టీఎంసీలు వెంటనే కేటాయించండి..
‘కొంత కాలం నుంచి జల శక్తి మంత్రిత్వ శాఖలో తెలంగాణకు చెందిన అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రమంత్రిగా చొరవ చూపి వాటిని త్వరగా పరిష్కరించాలని కోరాం. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు మొత్తం 90 టీఎంసీల నీటి కేటాయింపు అడిగాం. వాటిల్లో 45 టీఎంసీల నీటిని వెంటనే పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు కేటాయిం చాలని కోరాం. ఈ సమావేశంలో కేంద్రమంత్రితో సహా సీడబ్ల్యూసీ ఛైర్మెన్‌ కూడా ఉన్నారు. వారికీ ఇదే విషయాన్ని చెప్పాం” అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

సమ్కక్క-సారక్క ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వండి
‘గోదావరి జలాల్లో సమ్కక్క-సారక్క ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను సమర్పించాం. సీడబ్ల్యూసీకి అనేక సందర్భాల్లో వారు అడిగిన వివరాలు ఇచ్చాం. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. దాని పూర్తి వివరాలు మళ్లీ సమర్పించాం. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ (కృష్ణా వాటర్‌ డిస్ప్యూట్‌ ట్రిబ్యునల్‌-2) ఏపీ-తెలంగాణ మధ్య 811 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు పంపకం చేయాలి. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి.. జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ను విజ్ఞప్తి చేసి ఈ ప్రొసీడింగ్స్‌ను వేగవంతంగా ఫైనలైజేషన్‌ చేయించాలని కోరాం’ అని ఆయన అన్నారు.

బనకచర్లకు వ్యతిరేకం
‘ పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రీ ఫీజుబులిటీ రిపోర్ట్‌ను సమర్పించింది. దాన్ని మేము వ్యతిరేకించాం. చాలా స్పష్టంగా గోదావరి వాటర్‌ డిస్ప్యూట్‌ 1980 అవార్డులో ఫ్లడ్‌ వాటర్‌ కేటాయించడానికి ఎవరికీ ఎటువంటి ఆస్కారం లేదనే విషయాన్ని అప్పుడూ చెప్పాం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టర్మినల్‌ ఫేజ్‌ మార్చి, ప్రాజెక్టు పేరు మార్చి.. తిరిగి గోదావరి ఫ్లడ్‌ వాటర్‌ స్పేర్‌పై మరొకసారి కేంద్రానికి వస్తున్న సందర్భంగా.. మేము దీనికి కూడా వ్యతిరేకం అని చెప్పాం. స్పష్టంగా, లిఖితపూర్వకంగా కేంద్రమంత్రికి వివరించాం. ఈ ప్రాజెక్టు న్యాయబద్ధమైనది కాదని తెలిపాం. ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్నాటక కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఆ రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో కేంద్రమంత్రికి తెలియజేశాం. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వొద్దని చెప్పాం’ అని మంత్రి ఉత్తమ్‌ పేర్కొన్నారు.

ఆల్మట్టి ఎత్తు పెంచొద్దు.. ఆదేశాలు ఇవ్వండి
‘ఆల్మట్టి డ్యాం 519 మీటర్ల కంటే ఎత్తు పెంచొద్దని సుప్రీంకోర్టులో స్టే ఉంది. ఈ స్టే ఉండగానే కర్నాటక ప్రభుత్వం క్యాబినెట్‌ తీర్మానం చేసి, జీవో ఇచ్చి ఎత్తు పెంచడానికి భూసేకరణ కోసం ప్రొసీడింగ్స్‌ ఇచ్చింది. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఇది చట్ట వ్యతిరేకం, కేంద్ర ప్రభుత్వంగా మీరు కూడా కర్నాటక ప్రభు త్వానికి చెప్పండని విజ్ఞప్తి చేశాం. ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచితే.. తెలంగాణకుఅన్యాయం జరుగుతుంది. అందుకే దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పాం’ అని మంత్రి వివరించారు.

ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
‘గత 22 నెలల నుంచి కేంద్ర ఫండింగ్‌ ఇరిగేషన్‌ కోసం అడిగాం. ఇప్పటివరకు ఫండింగ్‌ ఇచ్చిన ప్రాజెక్టులను మీరు పూర్తి చేయండని గతంలో నేను, సీఎం రేవంత్‌ రెడ్డి వచ్చినప్పుడు చెప్పారు. ఆ సూచన మేరకు దేవాదుల ప్రాజెక్టు మినహా.. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాం. అలాగే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేము కొన్ని ప్రాజెక్టులను లిస్టవుట్‌ చేశాం. వాటికి సీడబ్ల్యూసీ నుంచి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇప్పించాలని కోరాం. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు, నారాయణపేట-కొడంగల్‌ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌, చిన్న కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌, మోదికుంట వాగు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు అడిగాం’ అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు.

కృష్ణానది నీటిని మళ్లించొద్దు
‘రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణానది నీటిని ఎవరూ మళ్లింపు చేయొద్దు. దుర్వినియోగం చేయొద్దు. దీనిపై కేఆర్‌ఎంబీకి అధికారం ఇచ్చారు. అయితే పదేండ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత పదేపదే ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి, నేను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, కేఆర్‌ఎంబీకి నిధులు ఇచ్చి టెలిమెట్రీ స్టేషన్‌ ఇన్‌స్టాలేషన్‌లలో కొంత పురోగతిని తీసుకొచ్చాం. ఫేజ్‌-1 కింద 18 టెలిమెట్రీ స్టేషన్‌లు ఇన్‌స్టాల్‌ అయ్యాయి. ఫేజ్‌-2 కింద మరో 9 చేయాల్సి ఉంది. ఫేజ్‌-3 కింద 11 టెలిమెట్రీ స్టేషన్‌ ఇన్‌స్టాలేషన్‌ చేయాల్సి ఉంది. ఫేజ్‌-2, ఫేజ్‌-3కి సంబంధించి కేఆర్‌ఎంబీకి ఆదేశాలు ఇచ్చి వేగవంతంగా పూర్తి చేయాలని కోరాం. అప్పుడు ఏ రాష్ట్రం ఎంత కృష్ణానది నీటిని వాడుకుంటుందో స్పష్టంగా తెలుస్తుందని చెప్పాం. అంతర్రాష్ట్ర వివాదాలు తగ్గుతాయని కేంద్రమంత్రికి వివరించాం. వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌.. కేఆర్‌ఎంబీకి, ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తామని చెప్పారు’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తోపాటు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ శశాంక్‌ గోయెల్‌, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -