Thursday, July 31, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅడవిలోకి రానివ్వరు..ఊర్లో ఉండనివ్వరు

అడవిలోకి రానివ్వరు..ఊర్లో ఉండనివ్వరు

- Advertisement -

జీవాలను మేపే తావేదీ..?
అడవి జంతువుల గడ్డిని గొర్రెలు తింటాయంటున్న ఫారెస్టు అధికారులు
అరిగోస పడుతున్న గొర్రెల కాపరులు
ప్రభుత్వం దృష్టిసారించాలంటున్న సంఘం నేతలు

రియల్‌ ఎస్టేట్‌ దినదినాభివృద్ధిలో గుట్టలు, తుమ్మలు మాయమయ్యాయి.. భూములు ప్లాట్లయ్యాయి.. ఖాళీ జాగా కరువైంది.. మూగజీవాలకు మేత కరువైంది.. పంటపొలాల్లో మేస్తున్నాయని గ్రామస్తులు.. అడవికి తోలుకుపోదామంటే అటవీ అధికారులు రానివ్వడం లేదు. దాంతో వర్షాకాలం గొర్రెల కాపరుల కష్టాలు అన్ని ఇన్నీ కావు. గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా మేపుదామంటే.. హరితహారం చెట్లు ఉన్నాయని వారిని అధికారులు దూరంగా వెళ్లగొడుతున్నారు. దీంతో చేసేది లేక రోడ్డును వదిలి డొంక దారిన నల్లమల అడవిలోకి వెళ్లేందుకు కాపరులు సాహసం చేస్తున్నారు. అయినా ఫారెస్టు అధికారులు వేధింపులు ఆగడం లేదని గొర్రెల కాపరులు ఆవేదన చెందుతున్నారు.
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
జీఓ 599 ప్రకారం సాగుకు యోగ్యం కాని గుట్టలు, కాల్వలు, ప్రభుత్వ బీడు భూములను గొర్రెలు మేపడానికి ఇవ్వాల్సి ఉంది. కాలువలు, చెరువుల వెంట ఉన్న తుమ్మ చెట్లు, గుట్టల మీద గొర్రెలను మేసేందుకు 1016 జీఓ ద్వారా అవకాశం వచ్చింది. అయినా ఈ రెండు జీఓలు ఎక్కడా అమలు కావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది గొర్రెల కాపరులు ఉంటారు. 10 లక్షల కుటుంబాలకు గొర్రెలే జీవనాధారంగా బతుకుతుంటారు. 38వేల గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలున్నాయి. ఏటా మహబూబ్‌నగర్‌ జిల్లాలో వర్షాకాలం గొర్రెలను కాపరులు నల్లమల అడవికి తోలుకుపోయి నాలుగు నెలల అనంతరం ఖరీఫ్‌ పంటలు చేతికి వచ్చిన తర్వాత గ్రామాలకు వస్తుంటారు. తెలంగాణలో 60 లక్షల ఎకరాల అటవీ భూములు ఉంటే అందులో 10 లక్షల ఎకరాలు గొర్రెలను మేపడానికి కేటాయించాలని ఎప్పటి నుంచో కాపరులు కోరుతున్నారు.

ఆరు నెలలు అవస్థలు
చినుకు పడిందంటే ఖరీఫ్‌ సాగు పనులు మొదలవుతాయి. అప్పటి నుంచి గొర్రెల కాపరులకు కష్టాలు మొదలవుతాయి. గొర్రెలు దొడ్డి నుంచి బయటకొచ్చి పంట పొలాలకెళ్లే పరిస్థితి ఉండదు. ఒక కర్ర మేసినా.. రైతులు కాపరులపై దాడికి పాల్పడుతుంటారు. గ్రామాల లో ఎక్కడా బీడు భూములు కనిపించవు. ప్రయివేటు భూముల్లోకి రానివ్వరు. అడవిలో వన్యమృగాలు, కుక్కల దాడి ఒకవంతు అయితే.. ఫారెస్టు అధికారుల వేధింపులు ఎక్కువే. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌, మక్తల్‌, మరికల్‌, నారాయణపేట, కోస్గి, దేవరకద్ర నాగర్‌కర్నూల్‌ నుంచి ప్రతిఏటా సుమారు 10 వేల గొర్రెలు నల్లమల అడవికి పోతుంటాయి. ముఖ్యంగా మున్ననూరు, వటవర్లపల్లి, పదర, అమ్రబాద్‌, వంకేశ్వరం వంటి ప్రాంతాల దగ్గర ఉండే దట్టమైన అడవిలో గొర్రెలను మేపుతుంటారు. రహదారి వెంట అయితే అటవీ అధికారులు చూస్తారని డొంక దారిన కాపరులు అడవిలోకి వెళ్తారు. అయినా, ఫారెస్టు అధికారులు అడ్డుకుని గొర్రెల మందలను తిరిగి మైదాన ప్రాంతాలకు తరలిస్తుంటారు.

రోగాలు వస్తే వైద్యం అందదు
గడ్డి కోసం గొర్రెలను వలస తోలుకెళ్తే.. వెళ్లిన చోట పశువైద్యశాలలు ఉన్నా మందులు ఉండవు. మీరు ఎక్కడ ఉంటారో అక్కడే వైద్యం చేయించుకోవాలని వారికి వైద్యులు చెబుతున్నారు. నట్టల మందు, గొట్టెల వాపు వంటి రోగాలకు గతంలో వాక్సిన్‌ ఇచ్చే వారు.. ఇప్పుడు గోలీలు ఇస్తే.. అవి గొర్రెలు తినడం లేదంటున్నారు కాపరులు. గ్రాసం కోసం ఎక్కడికి వెళ్లినా అక్కడ వైద్యం చేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కాపరుల సంఘం నాయకులు కోరుతున్నారు.

ఫారెస్టులో మేపడానికి అవకాశం ఇవ్వాలి : కృష్ణ, ఐతోల్‌ గొర్రెల కాపరులు, నాగర్‌కర్నూల్‌ జిల్లా
కరిచే పామును.. కొట్టే దొంగలను సైతం ఎదిరించి బతుకుతున్నా.. కానీ ఫారెస్టు అధికారుల ఆగడాల నుంచి తప్పించుకోలేకపోతున్నాం.. అడవికి పోతే ఇబ్బందులు పెడుతున్నారు. ఫారెస్టులో గొర్రెలను మేపడానికి అవకాశం ఇవ్వాలి.

కాపరులకు రక్షణ కల్పించాలి : అజయ్‌కుమార్‌ యాదవ్‌, గొర్రెల కాపరుల సంఘం నాయకులు
గొర్రెల గ్రాసం కోసం కాపరులు ఇబ్బందులు పడుతున్నారు. వలస వెళ్లిన సమయంలో గొర్రెలకు రోగం వస్తే.. వైద్యం అందక చనిపోతున్నాయి. ఎక్కడ మేతకు పోతే అక్కడే వైద్యం అందిం చాలి. కాపరులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షల బీమా సౌకర్యం ఉండాలి. గ్రామాల్లోనే గ్రాసం కోసం 10 ఎకరాలు కేటాయించాలి. 50 ఏండ్లు దాటిన కాపరులకు పింఛన్‌ ఇవ్వాలి.

అడవిలోకి అనుమతివ్వాలి : కిల్లె గోపాల్‌, గొర్రెలు మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ప్రతి ఏటా వందలాది గొర్రెల గుంపులు మేత కోసం నల్లమల నుంచి నాగార్జునసాగర్‌ వైపు వెళ్తాయి. ఖరీఫ్‌లో విత్తనాలు వేయడం వల్ల మేత దొరకని పరిస్థితుల్లో గొర్రెల కాపరులు అడవిని ఆశ్రయిస్తారు. ఊర్లో ఉంటే రైతుల నుంచి, అడవికి వెళితే అటవీ అధికారుల దాడులు జరుగుతున్నాయి. గొర్రెలు అడవిలోకి వెళ్లడం వల్ల ఎలాంటి నష్టమూ ఉండదు. అటవీ అధికారులు మానవతా దృక్పథంతో గొర్రెల కాపరుల సమస్యను అర్థం చేసుకోవాలి. గొర్రెలు, మేకల పెంపకదారుల సమస్యలపై మంత్రి వాకిట శ్రీహరి చొరవ తీసుకోవాలి.

టైగర్‌ రిజర్వ్‌ కావడం వల్లే..
నల్లమల్ల అటవీ ప్రాంతం టైగర్‌ రిజర్వ్‌ కావడం వల్లనే గొర్రెలను రానివ్వడం లేదు. దేశవ్యాప్తంగా 24 అటవీ ప్రాంతాలున్నాయి. అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఐదు శాతం రిజర్వ్‌ ఫారెస్ట్‌గా కేటాయించారు. పులుల సంరక్షణ కోసం కేటాయించిన ఈ ప్రాంతంలో జనసంచారం, గొర్రెలు మేపడం వంటివి చేయరాదు. అడవి జంతువులు తినే గడ్డిని గొర్రెలు తింటాయి. దీంతో అడవి జంతువులకు మేతల్లేకుండా పోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గైరాన్‌ పోరంపోగు భూముల్లో మేపుకోవాలి. నల్లమల్ల రిజర్వ్‌ ఫారెస్ట్‌లో పులుల రక్షణ కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.
– ప్రసాద్‌ రెడ్డి, వనపర్తి డీఎఫ్‌ఓ

మా బతుకులు ఆగం చేస్తున్నారు
ప్రతి ఏటా గొర్రెలను తీసుకొని నల్లమల అడవికి వెళ్తాం. ఈసారి అటవీ అధికారులు గొర్రెలను రానివ్వడం లేదు. ఇప్పటికే మావాళ్లు పోయి తిరిగి వస్తున్నారు. గడ్డి తప్ప ఇతర ఆకులను ముట్టని గొర్రెలపై అధికారుల దాడులు ఆపాలి.
– నిరంజన్‌ మక్తల్‌, నారాయణపేట జిల్లా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -