ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించాలి : ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో వక్తలు
వేముల రామకృష్ణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు ఆధ్వర్యంలో
నవతెలంగాణ – ముషీరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ విద్యార్థులకు మాత్రం ఫీజురీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చినంక ఖజానా ఖాళీగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి వెళ్తోందన్నారు. ఒకవైపు ఫీజు బకాయిలు చెల్లించకుండా.. ఇంకో వైపు ”ట్రస్ట్ బ్యాంకు” ఏర్పాటు చేసి దాని ద్వారా ఫీజులు చెల్లిస్తామని కొత్త నాటకానికి తెరలేపారన్నారు. ఈ ప్రతిపాదన ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదన్నారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.6000 కోట్లు వెంటనే చెల్లించాలని కోరారు. 100 బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేయాలని, 119 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని, బీసీ గురుకుల పాఠశాలల్లో 20 శాతం సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు. విద్య రాజ్యాంగబద్ధమైన హక్కు అని.. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి ఉపయోగపడే ఈ స్కీమ్‌ను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీరుగారుస్తున్నదని విమర్శించారు. అనేక పథకాలకు లక్షల కోట్ల అప్పు తెస్తున్న ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్ కోసం రూ.6000 కోట్లు అప్పు తెస్తే ఎవరు అడ్డుకుంటారని ప్రశ్నించారు. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌కు రూ.20 కూడా విడుదల చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం అమలుకు ఏటా నాలుగు శాఖల ద్వారా బడ్జెట్‌లో రూ.5000 కోట్ల బడ్జెట్ కేటాయించి కూడా ఒక్క రూపాయి విడుదల చేయకుండా ల్యాప్స్ చేశారన్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రెండు దఫాలుగా రూ.1500 కోట్లు విడుదల చేశారని, మన రాష్ట్రంలో బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వకుళాభరణం కృష్ణమోహన్, నీలా వెంకటేష్, గుజ్జ సత్యం, సుధాకర్, నందగోపాల్, రాందేవ్ మోడీ తదితర నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES