– రాయలసీమను గ్రీన్‌హబ్‌గా మారుస్తాం
– మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని పరామర్శించడమా? : సిఎం చంద్రబాబు
– డిసెంబరు 26, 27 తేదీల్లో గండికోట ఉత్సవాలు
కడప : సముద్రంలోకి వృథాగాపోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటే ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో కరువే ఉండదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాయలసీమను గ్రీన్‌హబ్‌గా మారుస్తామన్నారు. రాయలసీమను రతనాల సీమగా చేసి చూపిస్తామని తెలిపారు. డిసెంబరు 26, 27 తేదీల్లో గండికోట ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని జగన్ పరామర్శించడం దారుణమని విమర్శించారు. గురువారం ఆయన కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని గూడెంచెరువు గ్రామంలో నిర్వహించిన పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా పింఛను పంపిణీ చేశారు. గండికోట పర్యాటక ప్రాంతంలో పలు శంకుస్థాపనలు చేశారు. ముందుగా గూడెంచెరువు గ్రామంలోని చేనేత కార్మికురాలు అలివేలమ్మ ఇంటికి వెళ్లి పింఛను అందించారు. అనంతరం ఆటోలో ప్రజావేదిక సభకు వెళ్లారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ పేదల సేవలో కార్యక్రమాన్ని ఉద్యమరీతిలో చేపట్టామన్నారు. దేశంలోని 27 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడాలేని విధంగా ఎక్కువ సామాజిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని తెలిపారు. కడప జిల్లాకు గ్రీన్‌ఎనర్జీ విభాగంలో రూ.44 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కడప మహానాడులో ఇచ్చిన హామీ మేరకు కడపకు ఉక్కు పరిశ్రమ మంజూరు చేశామని, 2028 డిసెంబర్ నాటికి ఫేజ్-1 పూర్తి చేయాలని ఆదేశించామని తెలిపారు. రూ.3,800 కోట్లతో 3,900 క్యూసెక్కుల సామర్థ్యం మేరకు హంద్రీ-నీవా కెనాల్ పనులు చేప ట్టామని, కుప్పం వరకు నీటిని అందిం చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని తెలిపారు. పి-4 పథకాన్ని ప్రపంచా నికే రోల్‌మోడల్ గా మలుస్తామన్నారు. ఇప్పటికే తొమ్మిది లక్షల మందిని దత్తత తీసుకున్నామని తెలిపారు. ఈ నెల ఏడున అంతర్జాతీయ చేనేత దినోత్సవం నుంచి చేనేతల పవర్‌లూమ్‌కు 500 యూనిట్లు, మరమగ్గాలకు 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.
ప్రజలను మభ్యపెట్టాలనుకుంటే తోక కత్తిరిస్తాం
మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని జగన్ మందలించాల్సింది పోయి, రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం దారుణమని చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో తన పర్యటన సందర్భంగా వచ్చిన జనాభాను నెల్లూరు జిల్లా బంగారుపాలెం జనాభాగా జగన్ మీడియాలో చూపించుకున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టాలనుకుంటే తోకలు కత్తిరిస్తానని, ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తామంటే కుదరదని, డ్రోన్ సాక్ష్యాల ఆధారంగా పోలీసులు వస్తారని హెచ్చరించారు.
గండికోట ప్రాంతాన్ని యాంకర్ హబ్‌గా అభివృద్ధి
చారిత్రిక గండికోట ప్రాంతాన్ని యాంకర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. గండికోటలో రూ.80 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గండికోటను పర్యాటకంగా అభివద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు పర్యాటక ప్రాజెక్టులకు రూ.500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామన్నారు. అనంతరం దీవెన, నాగమ్మ కుటుంబాలను ఆదుకునేందుకు ఔత్సాహికవేత్తలకు బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి మంత్రి సవిత, ఎమ్మెల్యేలు సి.ఆదినారాయణరెడ్డి, పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్, జమ్మలమడుగు టిడిపి ఇన్‌ఛార్జి సి.భూపేష్‌రెడ్డి, వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు.ఆ తర్వాత టిడిపి కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు.
గోదావరి జలాలతో కరువు బలాదూర్
- Advertisement -
- Advertisement -