నవతెలంగాణ – హైదరాబాద్: నిద్రమత్తులో రోడ్డు ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. అలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. కానీ, ఓ డ్రైవర్ నిద్రమత్తులో కారును ఏకంగా ఇంటి గోడపైకి ఎక్కించాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శంభీపూర్‌లో నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ వచ్చిన డ్రైవర్ కారును ఇంటి గోడపైకి ఎక్కించాడు. ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్ధం రావడంతో ఇంటి యజమానులు నిద్రలేచి బయటకు వచ్చి చూశారు. ఇంటి బయట కనిపించిన దృశ్యం చూసి వారు నివ్వెరపోయారు.
ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో వెంటనే ప్రమాదస్థలికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును కిందకు దింపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతుండగా.. నెటిజన్లు తమదైనశైలిలో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.