Sunday, October 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్లు టెర్రరిస్టులతో సమానం: సీపీ సజ్జనార్

మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్లు టెర్రరిస్టులతో సమానం: సీపీ సజ్జనార్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టులతో సమానమని సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై వారి చర్యలు ఉగ్రవాద చర్యల కన్నా ఏమాత్రం తక్కువ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 20 మంది ప్రాణాలను బలిగొన్న కర్నూలు బస్సు ప్రమాదం నిజానికి ప్రమాదం కాదని, అది ఒక తాగుబోతు బైకర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన దారుణ మారణకాండ అని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

కర్నూలు ప్రమాద ఘటన వివరాలను సజ్జనార్ పంచుకున్నారు. బి. శివ శంకర్ అనే బైకర్ మద్యం మత్తులో తన బైక్‌పై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని తెలిపారు. తెల్లవారుజామున 2:24 గంటలకు ఓ పెట్రోల్ బంకులో బైక్‌లో ఇంధనం నింపుకున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయని, సరిగ్గా 2:39 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఆయన వివరించారు. అతని బాధ్యతారాహిత్యం క్షణాల్లో ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

“మద్యం తాగి వాహనాలు నడిపేవారు ప్రతీ విషయంలోనూ టెర్రరిస్టులే. నేను నా మాటకు కట్టుబడి ఉన్నాను. వారు ప్రాణాలను, కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేస్తారు. ఇలాంటి చర్యలను ఎప్పటికీ సహించబోం,” అని సజ్జనార్ స్పష్టం చేశారు.

ఇకపై హైదరాబాద్‌లో డ్రంక్ డ్రైవింగ్‌పై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు సజ్జనార్ ప్రకటించారు. మద్యం మత్తులో పట్టుబడిన ప్రతి ఒక్కరూ చట్టం యొక్క పూర్తి పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. అమాయకుల జీవితాలను ప్రమాదంలో పడేసే వారి పట్ల ఎలాంటి కనికరం, మినహాయింపులు ఉండవని తేల్చిచెప్పారు. డ్రంక్ డ్రైవింగ్‌ను ఒక పొరపాటుగా చూడటం సమాజం మానుకోవాలని, అది జీవితాలను నాశనం చేసే నేరమని, దానికి తగ్గ శిక్ష కచ్చితంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -