- Advertisement -
- – మద్యం మత్తులో లారీని నడిపిన డ్రైవర్
– గ్రామాల్లో తెగిన విద్యుత్తు మెయిన్, సర్వీస్ వైర్లు
– ఇళ్లు ప్రహరి, విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిన లారీ
– తప్పిన పెను ప్రమాదం
నవతెలంగాణ-గంగాధర
మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ భారీ గూడ్స్ లారీని వేగంగా నడిపి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ పల్లెల్లో బీభత్సాన్ని సృష్టించిన తీరు ఇది. పోలీసులు, గ్రామస్తులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గంగాధర మండలం ఆచంపల్లి మీదుగా గర్శకుర్తి గ్రామంలోకి లారీ ప్రవేశించింది. భారీ పొడవు, ఎత్తు గల గూడ్స్ లారీని డ్రైవర్ చిత్తుగా మద్యం సేవించి అతీవేగంగా నడిపినట్టు తెలుస్తుంది. దీంతో రోడ్డుకు ఇరువైపుల ఉన్న విద్యుత్ మెయిన్, ఇళ్లకు తీసిన సర్వీసు వైర్లు రోడ్డు పొడవున అనేక చోట్ల తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, గ్రామంలోకి ప్రవేశించి వేగంగా వెళ్లిన లారీ ఇళ్లు ప్రహరి గోడ, ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. దీంతో స్తంభం విరిగిపోగా విద్యుత్ మెయిన్ వైర్ల తెగి పడ్డాయి. ఇంటి ప్రహరి గోడ కూలిపోగా, విరిగిన విద్యుత్ స్తంభం, కూలిన గోడల మధ్య లారీ ఇరుక్కుపోయి నిలిచింది.
మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ లారీని వేగంగా నడపడంతో భయాందోళనకు గురైయ్యామని గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ మెయిన్ వైర్లు, ఇళ్ల సర్వీసు వైర్లు అనేక చోట్ల తెగి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జరిగిన సంఘటనతో హుటా హుటీన గ్రామంలోకి చేరిన విద్యుత్ అధికారులు, సిబ్బంది అనేక చోట్ల తెగిన విద్యుత్ వైర్లు, సర్వీసు వైర్లు, విరిగిన స్తంభాన్ని పరిశీలిస్తూ సరి చేసే పనిలో నిమగ్నం అయ్యారు. మత్తులో ఉన్న డ్రైవర్ ఇష్టానుసారంగా నడుపుతూ వేగంగా గ్రామంలోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు వాపోయారు. వేగంగా వచ్చే లారీని చూస్తూ ప్రజలు తప్పుకోవడంతో పెను ముప్పును తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు స్వల్పంగా గాయపడ్డాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన గంగాధర ఎస్సై వంశీకృష్ణ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. భారీ సైజ్ తో ఉన్న లారీ ఎక్కడికి వచ్చింది, ఎటు వెళ్తుందనే విషయాన్ని పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు.
- Advertisement -