Friday, July 11, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎండుతోన్న మెట్ట పైర్లు

ఎండుతోన్న మెట్ట పైర్లు

- Advertisement -

– జూన్‌లో లోటు వర్షపాతం.. జులైలో జల్లులు.. కొన్నిచోట్ల వర్షాలు
– మెట్ట పంటల సాగుకు వారమే గడువు
– భారీ వర్షాల్లేక ప్రాజెక్టులకు సరిపడ చేరని నీరు
– ముదురుతున్న వరి నార్లు..దుక్కులకందని నీటి లభ్యత
వానాకాలం పంటల సాగు ఆశాజనకంగా లేదు. ముందస్తు మురిపించిన వర్షాలు సీజన్‌ వచ్చే సరికి వెనకపట్టు పట్టాయి. మే నెలలో అత్యధిక వర్షపాతం నమోదవ్వగా జూన్‌, జులైలో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. కొద్ది వర్షాలకు మెట్ట పంటల సాగు పనులు జరిగినా నీటి ఆధారికంగా సాగు చేయాల్సిన వరి విషయంలో మాత్రం ఇబ్బందే ఉంది. మరో వారం రోజులైతే మెట్ట పంటల సాగుకు అనువైన పరిస్థితి లేకుండా పోతుంది. వరి నాట్లకు కూడా ఆగస్టు రెండో వారం దాటితే వానాకాలం పంటల సాగు ప్రశ్నార్ధకం కానుంది. ఇప్పటి వరకు భారీ వర్షాలు పడకపోవడంతో చాలాచోట్ల చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. సింగూరులోకి ఎగువ నుంచి కొద్దిపాటిగా నీళ్లు వచ్చినా అవి సాగుకు సరిపోవు. మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, ఘనపూర్‌ ఆనకట్ట, నల్లవాగు వంటి ప్రాజెక్టుల్లో ఆశించిన నీటి లభ్యతలేదు.

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లాలో ఈ వానాకాలంలో 7.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 3.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగవనుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 3.20 లక్షల ఎకరాల్లో అత్యధికంగా పత్తి పంట సాగైంది. మరో 30 వేల ఎకరాల్లో పత్తి సాగవ్వాల్సి ఉంది. 50 వేల ఎకరాల్లో సోయా, 47 వేల ఎకరాల్లో కంది, 8500 ఎకరాల్లో పెసర, 5 వేల ఎకరాల్లో మినుము పంటలేశారు. జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉండగా వర్షాలు పడకపోయే సరికి అక్కడక్కడ పోసిన వరి నాట్లు ముదిరిపోతున్నాయి. మెదక్‌ జిల్లాలో 50 వేల ఎకరాల్లో పత్తి, 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 40 వేల ఎకరాల్లో పత్తి సాగైంది. బోర్ల ఆధారంగా నీటి లభ్యత ఉన్న రైతులు మాత్రమే వరినార్లు పోశారు. సిద్దిపేట జిల్లాలో పత్తి, వరి, కంది, సోయా, పెసర వంటి పంటలు 7.6 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ఇప్పటి వరకు లక్ష ఎకరాల్లో పత్తి వేశారు. వరి నాట్లకు నీటి లభ్యత లేనందున ఎక్కడా నాట్లు వేయలేదు.
తేలికపాటి వర్షాలతో పచ్చబడుతున్న మెట్ట పైర్లు
రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నా ఒక్కో ప్రాంతంలో ఒక్క మోతాదులో పడుతున్నాయి. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలే కురుస్తున్నాయి. జులైలో మొదటి నుంచీ వర్షాలు కురుస్తుండటంతో పత్తి, కంది, పెసర, సోయా, మినుము వంటి మెట్ట పంటలు పచ్చబడుతున్నాయి. జూన్‌లో 20 రోజుల పాటు వర్షాలు పడలేదు. దాంతో నీటి ఎద్దడి వల్ల మెట్ట పైర్లు వాడుబట్టాయి. చాలా చోట్ల వర్షాలు పడకపోవడంతో పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. మళ్లీ రెండో సారి విత్తుకోవాల్సి వచ్చింది. జులై నుంచి కొద్దిపాటి వర్షాలు పడుతున్నాయి. రైతులు పత్తి చేలల్లో గుంటుకలు తోలుతూ అడుగు మందు, యూరియా వంటి ఎరువుల్ని చల్లుతున్నారు.
ముదురుతున్న వరి నార్లు.. నాట్లకు నీటి ఎద్దడి
సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి మూడు జిల్లాల్లో 8.3 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతుందని వ్వవసాయ శాఖ అంచనా వేసింది. మెదక్‌ జిల్లాల్లో 3.5 లక్షల ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 3.5 లక్షల ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 1.3 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతుంది. సంగారెడ్డి జిల్లాలో సింగూరు, నల్లవాగు, మెదక్‌ జిల్లాలో ఘనపూర్‌ ఆనకట్ట, ఏడుపాయలు, సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ వంటి సాగునీటి ప్రాజెక్టులున్నాయి. వీటితో పాటు వేల సంఖ్యలో చెరువులు, కుంటలు, వాగులున్నాయి. మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో చాలా చోట్ల రైతులు బోర్లు, వాగుల నీటి ఆధారంగా వరి నార్లు పోశారు. నెల రోజుల్లో నాట్లు వేయాల్సి ఉన్నా దుక్కులు దమ్ము చేసేందుకు సరిపడా నీటి లభ్యత లేకపోవడంతో నాట్లు వేయట్లేదు. ఇంకా కొన్ని చోట్ల ప్రాజెక్టుల నుంచి నీటిని వదిలాక నార్లు పోసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. భారీ వర్షాలు పడి వరదలొస్తే తప్ప జలాశయాల్లోకి నీరు వచ్చి చేరదు. ఆగస్టు రెండో వారంలోపు వరి నాట్లు వేయాలి. అదునుదాటితే వానాకాలం వరి సాగు ప్రశ్నార్ధకమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అందుకే సింగూర్‌, మల్లన్నసాగర్‌, ఇతర ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

జూన్‌లో పడాల్సింది 120.. పడింది 52 మిల్లీ మీటర్ల వర్షపాతం
ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా జూన్‌లో సాధారణ వర్షపాతం కంటే లోటు వర్షం పడింది. సంగారెడ్డి జిల్లాలో జూన్‌లో 120 మిల్లీ మీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా కేవలం 52.2 మిల్లీ మీటర్లే నమోదైంది. నెలంతా వర్షాలేకపోవడంతో పంటల సాగు అటు ఇటుగా సాగింది. మే నెలలో మాత్రం అధిక వర్షపాతం నమోదైంది. 24.0 సాధారణ వర్షపాతం కాగా ఆ నెలలో 145.1 మి.మీ వర్షపాతం పడింది. ప్రస్తుతం జులైలో 1వ తేదీ నుంచి రోజూ వర్షం పడుతున్నప్పటికీ భారీ వర్షం కురవడం లేదు.
జులై 15 వరకు మెట్ట.. ఆగస్టులో వరి సాగుకు అనువే
వానాకాలం సీజన్‌లో ఇప్పటికే మెట్టపంటలేశారు. మిగిలిన రైతులు ఈ నెల 15 వరకు సాగు చేసుకోవాలి. వరి నాట్లకు మాత్రం ఆగస్టు వరకు అవకాశముంది. నాట్లు వేసేందుకు వీలుగా వర్షాలు కురవాల్సి ఉంది. వాతావరణ పరిస్థితుల్ని బట్టి రైతులు పంటలేయాలి. సీజ న్‌ ఆలస్యమైతే స్వల్పకాల రకాల్ని సాగు చేయడం మేలు.
-హరిప్రసాద్‌, జిల్లా వ్యవసాయాధికారి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -