Friday, November 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఐదు రాష్ట్రాల్లో ఈగల్‌ మెరుపుదాడులు

ఐదు రాష్ట్రాల్లో ఈగల్‌ మెరుపుదాడులు

- Advertisement -

50 మందికి పైగా డ్రగ్‌, సైబర్‌ నేరస్తులు అరెస్ట్‌
సహకరించిన స్థానిక పోలీసులు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర ఈగల్‌ టీం వ్యూహాత్మకంగా ఆరు రాష్ట్రాల్లో మాదక పదార్థాలు, సైబర్‌ నేరస్థుల అడ్డాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్‌తో పాటు సైబర్‌ నేరస్థులు ఉపయోగించే పరికరా లతో పాటు భారీ ఎత్తున నగదును కూడా స్వాధీనపర్చు కుంది. 50 మందికి పైగా డ్రగ్‌, సైబర్‌ నేరస్థులను అరెస్ట్‌ చేసింది. ఈగల్‌ టీం వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల దొరికిన డ్రగ్‌ మాఫియా ద్వారా సమాచారాన్ని సేకరించిన ఈగల్‌ టీం అధికారులు వివిధ రాష్ట్రాల్లో ఉన్న డ్రగ్‌, సైబర్‌ క్రైమ్‌ మాఫియా అడ్డాలపై దాడులకు వ్యూహరచన చేసింది. ఇందుకోసం రెండు వందల మందికి పైగా ఈగల్‌ టీం అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేసింది. ఈగల్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ శాండిల్య, ఇతర ఎస్పీల స్వీయ పర్యవేక్షణలో ఈగల్‌ టీం ప్రత్యేక బృందాలు గురువారం దాడులకు ఉపక్రమించాయి. ముఖ్యంగా ఢిల్లీ, నోయిడా, గ్వాలియర్‌, వైజాగ్‌, హఫీజాబాద్‌లలోని డ్రగ్‌, సైబర్‌ నేరస్థుల అడ్డాలపై ఈగల్‌ టీం బృందాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడులకు ఢిల్లీ, నోయిడా, గ్వాలియర్‌, వైజాగ్‌లకు చెందిన స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది సాయం కూడా ఈగల్‌ టీం తీసుకున్నది.

ఈ దాడుల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో నైజీరియన్‌ డ్రగ్స్‌ మాఫియా ఎదురు దాడులకు పాల్పడింది. దీంతో ఈగల్‌ టీం బృందాలు వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని నిర్బంధించాయి. అంతేగాక డ్రగ్‌, సైబర్‌ నేరస్థుల అడ్డాల నుంచి పెద్ద ఎత్తున మాదకపదార్థాలతో పాటు సైబర్‌ నేరాలకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సైబర్‌ నేరస్థులు సేకరించిన వందలాది ఆధార్‌కార్డులు, బ్యాంకు అకౌంట్లను కూడా అధికారులు స్వాధీనపర్చుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రగ్‌ మాఫియా, సైబర్‌ నేరస్థులు వాడుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి ఈగల్‌ టీం అధికారులే విస్మయం చెందారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి భారీ మొత్తంలో నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తమ్మీద ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో 50 మందికి పైగా నైజీరియన్లను అరెస్ట్‌ చేసిన అధికారులు వారిని హైదరాబాద్‌ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు అవసరమైన న్యాయపరమైన చర్యలను ఆయా రాష్ట్రాల్లో పూర్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -