Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంవిదేశీ అక్రమ వలసదారుల తొలగింపుపై ఈసీ వాదన అర్థరహితం

విదేశీ అక్రమ వలసదారుల తొలగింపుపై ఈసీ వాదన అర్థరహితం

- Advertisement -

పార్లమెంటరీ కమిటీ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ :
బీహార్‌తో ప్రారంభించి దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)ను చేపట్టబోతున్నట్లు ఎన్నికల సంఘం జూన్‌ 24న ఒక ప్రకటన చేసింది. అందుకు అనేక కారణాలు చూపింది. విదేశీ అక్రమ వలసదారుల పేర్లు కూడా ఓటర్ల జాబితాలలో ఉండడం వాటిలో ఒక కారణం. కానీ ఈ వాదనలో ఏ మాత్రం పస లేదని కొన్ని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. 2024లో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి ఎన్నికల సంఘం చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. భారత పౌరుల కాని వారు ఓటర్లుగా నమోదు కాకుండా అడ్డుకోవడానికి ప్రస్తుతం అమలులో ఉన్న చట్టపరమైన నిబంధనలు సరిపోతాయని ఆ సందర్భంలో ఎన్నికల కమిషన్‌ తెలియజేసింది.సిబ్బంది, ప్రజా సమస్యలు, చట్టం-న్యాయంపై ఏర్పడిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ 2023 ఆగస్ట్‌ 4న తన నివేదికలో ఓ సిఫార్సు చేసింది. భారత పౌరులు కానివారు తమ ఆధార్‌ను ఓటర్‌ ఐడీతో అనుసంధానం చేయకుండా చూడడానికి ఎన్నికల కమిషన్‌ ఒక చట్టబద్ధమైన యంత్రాంగంతో ముందుకు రావాలని సూచించింది. 2021లో ఎన్నికల చట్టాలకు సవరణలు జరిగిన తర్వాత ఎన్నికల కమిషన్‌ ఓటర్ల ఆధార్‌ నెంబర్లను సేకరించడం మొదలు పెట్టింది. 2022లో ఆ ఆధార్‌ నెంబర్లను ఓటర్ల ఫొటో గుర్తింపు కార్డులతో (ఎపిక్‌) అనుసంధానం చేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టింది. అది తమ ఆధార్‌ నెంబర్లను ఇవ్వాలా వద్దా అనే దానిపై ఓటర్లదే తుది నిర్ణయం. అంటే అది స్వచ్ఛందమే.

భారత పౌరుల కాని వారి ఎపిక్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయడంపై 2023 నివేదికలో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆధార్‌ కార్డులు కలిగి ఉన్నప్పటికీ దేశ పౌరులు కాని వారిని ఓటర్ల జాబితాలో చేర్చకుండా ఉండడానికి కేంద్ర ఎన్నికల సంఘం చట్టబద్ధమైన నిబంధనను కానీ లేదా ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని కానీ రూపొందించాలని సూచించింది. తన నివేదికపై న్యాయ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలను వివరిస్తూ బీజేపీ ఎంపీ బ్రిజ్‌ లాల్‌ నేతృత్వంలోని స్టాండింగ్‌ కమిటీ శుక్రవారం నాడు పార్లమెంటుకు నివేదిక అందజేసింది. ఆధార్‌ కార్డు ఉన్నప్పటికీ దేశ పౌరుడు కాని వ్యక్తిని ఓటరుగా నమోదు చేసేందుకు అనుమతించబోమని ఎన్నికల కమిషన్‌ గత ఏడాది జనవరి 17న కమిటీకి పంపిన సమాధానంలో స్పష్టం చేసింది. ఈసీ సమాధానంపై సంతృప్తి వ్యక్తం చేసిన కమిటీ ఆ తర్వాత ఎలాంటి సిఫార్సులు చేయలేదు. మరి అలాంటప్పుడు దేశ పౌరులు కాని వారిని ఓటర్ల జాబితాల నుంచి తొలగించేందుకు సర్‌ను చేపట్టామని ఈసీ చేస్తున్న వాదన అర్థరహితమని స్పష్టమవుతోంది. కాగా ఎన్నికలలో పోటీ చేసేందుకు కావాల్సిన వయసు (21 సంవత్సరాలు)ను తగ్గించాలంటూ కమిటీ చేసిన సిఫార్సును ప్రభుత్వం అంగీకరించలేదు. తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసే అభ్యర్థులకు విధించే శిక్షను పెంచాలన్న సూచనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.


నోటీసు లేకుండా ఓటర్‌ లిస్ట్‌ నుంచి పేరు తొలగించం : సుప్రీంకోర్టుకు తెలిపిన ఈసీ
ముందస్తు నోటీసు జారీ చేయకుండా బీహార్‌ ముసాయిదా ఓటరు జాబితా నుంచి ఏ ఓటరు పేరును తొలగించబోమని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. చట్టం ప్రకారం, ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చని వ్యక్తుల పేర్ల ప్రత్యేక జాబితాను తయారు చేయడం లేదా పంచుకోవడం అవసరం లేదని పోల్‌ ప్యానెల్‌ చెప్పింది. కారణాలను ప్రచురించాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img