Wednesday, March 25, 2026
E-PAPER
Homeజాతీయం'ఎన్నికల రాష్ట్రాల' ఉన్నతాధికారులతో ఈసీ సమీక్షా సమావేశం

‘ఎన్నికల రాష్ట్రాల’ ఉన్నతాధికారులతో ఈసీ సమీక్షా సమావేశం

- Advertisement -

న్యూఢిల్లీ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, వాటి సరిహద్దు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆయా రాష్ట్రాల అడ్మినిస్ట్రేటివ్‌, పోలీస్‌ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధతను బలోపేతం చేసే ప్రయత్నాలపై ప్రముఖంగా ఇసిఐ చర్చించింది. వివిధ శాఖల మధ్య సమన్వయం మెరుగుపర్చడం, చట్ట విరుద్ధ కార్యక్రమాలను అరికట్టడం, ఎన్నికలు సజావుగా, సురక్షితంగా, హింసారహితంగా, ప్రలోభాలు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడ్డం వంటి అంశాలపైనా చర్చించారు. అలాగే, మంగళవారం మల్టీడిపార్ట్‌మెంటల్‌ కమిటీ ఆన్‌ ఎలక్షన్‌ ఇంటెలిజెన్స్‌ (ఎండీసీఈఐ)తో కూడా ఎన్నికల కమిషన్‌ సమావేశం నిర్వహించింది. ఈసీఐ షెడ్యూల్‌ ప్రకారం మరికొన్ని రోజుల్లోనే తొలిదశ అంటే ఏప్రిల్‌ 9న అసోం, కేరళ, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సోమవారంతో నామినేషన్‌ గడువు కూడా ముగిసింది.

ప్రేమల్లత విజయకాంత్‌ పార్టీకి 10 స్థానాలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమల్లత విజయకాంత్‌ నేతృత్వంలోని దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) పార్టీకి 10 స్థానాలను డీఎంకే కేటాయించింది. తమిళనాడులో డిఎంకె నేతృత్వంలోని సెక్యులర్‌ ప్రొగ్రెసివ్‌ అలయన్స్‌ (ఎస్‌పీఏ)లో డీఎండీకే ఒక భాగంగా ఉంది. తమిళనాడులో ఏప్రిల్‌ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
మరోవైపు రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమికి అన్నాడీఎంకే నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నాడీఎంకే మ్యానిఫెస్టో విడుదల చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) కింద ఉచిత బియ్యంతో పాటు కేజీ చక్కెర, పప్పుధాన్యాలను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చింది. రేషన్‌కార్డు ఉన్న మహిళలకు ఉచితంగా రిఫ్రిజిరేటర్లు పంపిణీ చేయడం, విద్యుత్‌ చార్జీలను తగ్గించడం, వైద్య ప్రవేశాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌ను 7.5 శాతం నుంచి 10.5 శాతానికి పెంచడం వంటి హామీలు అన్నాడీఎంకే తన మ్యానిఫెస్టోలో ప్రధానంగా ఉన్నాయి. అలాగే, పార్టీ ప్రధాన కార్యదర్శి ఇకె పళనిస్వామి ఇటీవల ప్రకటించిన 16 వాగ్దానాలకు ఇవి అదనం.

కేరళలో 2.71 కోట్ల మంది ఓటర్లు
ఏప్రిల్‌ 9న జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికలకు 2,71,42,952 మంది ఓటర్లు ఉన్నారు. ఈ విషయాన్ని కేరళ ప్రధాన ఎన్నికల అధికారి రథన్‌ యు.కెల్కర్‌ మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఫిబ్రవరిలో సర్‌ ముగిసిన తరువాత ఓటర్ల జాబితాకు అదనంగా మరికొన్ని పేర్లు జతచేసినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం జాబితాలో 1,39,21,86 మంది మహిళలు, 1,32,20,811 మంది పురుషులు, 273 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని చెప్పారు.

ఒంటరి పోరుకు వీసీకే సిద్ధం
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి విదుతలై చిరుతైగళ్‌ కచ్చి (వీసీకే) నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని విసికె వ్యవస్థాపకులు టి తిరుమావళవన్‌ మంగళవారం ప్రకటించారు. ఒస్సూడు, నెట్టప్పాక్కం, ఉళవార్కరై నియోజకవర్గాల్లో వీసీకే పోటీ చేస్తుందని తెలిపారు.

కేరళలో బీజేపీ చీఫ్‌ రాజీవ్‌ చంద్రశేఖర్‌ నామినేషన్‌కు ఈసీ ఆమోదం
వివాదం తలెత్తినా కేరళలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాజీవ్‌ చంద్రశేఖర్‌ నామినేషన్‌ను ఎన్నికల కమిషన్‌ ఆమోదించింది. కేరళలోని నేమోమ్‌ నియోజకవర్గం నుంచి రాజీవ్‌ చంద్రశేఖర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే నామినేషన్‌ సందర్భంగా రాజీవ్‌ చంద్రశేఖర్‌ తన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను వెల్లడించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విషయంపై సీపీఐ(ఎం), కాంగ్రెస్‌ వంటి పార్టీలు ఫిర్యాదు చేశాయి. చంద్రశేఖర్‌ నామినేషన్‌ను తిరస్కరించాలని కోరాయి. అయినా సరే.. చంద్రశేఖర్‌ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి ఆమోదించారు. ఈ విషయాన్ని చంద్రశేఖర్‌ తరపున న్యాయవాది మీడియాకు తెలిపారు.

అసోంలో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ
అసోంలో హాప్లాంగ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి వేసిన నామినేషన్‌ను ఎన్నికల కమిషన్‌ తిరస్కరించింది. అస్సాంలో సోమవారంతో నామినేషన్ల ప్రక్రియకు గడువు ముగిసింది. ఈ తరువాత జరిగిన పరిశీలనలో ఈ నామినేషన్‌ను తిరస్కరించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. అలాగే, ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ బరిలో ఉన్న జలుక్‌బరి నియోజకవర్గంలోనూ, ధుకువాఖానా నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు బిదిషా నియోగ్‌, ఆనంద నారా దాఖలు చేసిన ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను రద్దు చేసినట్టు ఈసీ అధికారులు తెలిపారు. అయితే వీరికి చెందిన మరొక సెట్‌ను ఆమోదించడంతో వీరు పోటీలో కొనసాగుతారని అధికారులు వెల్లడించారు.

అసోంలో బీజేపీ పోటీలోనే లేదు : బఘేల్‌
అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీలోనే లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, ఛత్తీస్‌గడ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ తెలిపారు. ఈ ఎన్నికలను నిజమైన కాంగ్రెస్‌, నకిలీ కాంగ్రెస్‌ మధ్య పోటీగా బఘేల్‌ వర్ణించారు. నకిలీ కాంగ్రెస్‌కు ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ్‌ గోగోరు నేతృత్వంలోని నిజమైన కాంగ్రెస్‌కే ప్రజలు ఓటు వేస్తారని బఘేల్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఈసారి అసోంలో పోటీ కాంగ్రెస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ మధ్య కాదు. నిజమైన కాంగ్రెస్‌, నకిలీ కాంగ్రెస్‌ మధ్య పోటీ’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -