నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో మరో రెండేళ్ల గడువు ఉండగానే జగదీప్ ధన్ ఖడ్ ఉప రాష్ట్రపతికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తదుపరి ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోర్ జాబితా సిద్ధం అయినట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఈసీ (EC) ఓ ట్వీట్ చేసింది.
దీని ప్రకారం ఉప రాష్ట్రపతి -2025 ఎన్నిక కోసం సంబంధిత సభలు రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఆధారంగా అక్షరక్రమానుసారం ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేసినట్లు ఎన్నికల సంఘం అసిస్టెండ్ డైరెక్టర్ అపూర్వ కుమార్ సిగ్ పేర్కొన్నారు. నోటిఫికేషన్ తేదీ వెలువడిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కౌంటర్ లో ఈ ఎలక్టోరల్ కాలేజీ జాబితా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీ అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.