– కీలక రంగాలపై అమెరికా సుంకాల ప్రభావం
– తీవ్రంగా నష్టపోనున్న వస్త్రాలు, దుస్తులు, ఆభరణాల పరిశ్రమలు
న్యూఢిల్లీ : భారత్ దిగుమతులపై అదనంగా పాతిక శాతం టారిఫ్ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన కీలక దేశీయ రంగాలపై ప్రభావం చూపబోతోంది. ముఖ్యంగా వస్త్రాలు, దుస్తులు, ఆభరణాల పరిశ్రమలు దెబ్బతినే అవకాశం ఉంది. ట్రంప్ సుంకాల కారణంగా తీవ్రమైన ఆర్థిక పరిణామాలు తలెత్తుతాయని నిపుణులు అంచనా వేశారు. అనేక బిలియన్ డాలర్ల మేరకు నష్టం వాటిల్లుతుందని, లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోందన్న కారణంతో భారత్‌పై అమెరికా అదనంగా పాతిక శాతం సుంకాన్ని జరిమానాగా విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మొత్తంమీద భారత్ దిగుమతులపై అమెరికా యాభై శాతం సుంకాన్ని విధిస్తుంది.
ట్రంప్ ప్రకటనతో వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలు, రత్నాలు-ఆభరణాలు వంటి రంగాలు ఎక్కువగా నష్టపోతాయి. ఎందుకంటే మన దేశం నుంచి అమెరికా మార్కెట్లకు ఇవే ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. మన దేశంలో వస్త్ర పరిశ్రమ నలభై ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ పరిశ్రమపై విధించిన సుంకాన్ని ట్రంప్ తక్షణమే ఉపసంహరించుకోని పక్షంలో భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని, లక్షలాది ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. భారత్‌కు ప్రధాన పోటీదారులైన బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలపై అమెరికా తక్కువ టారిఫ్ విధించింది. ఈ పరిణామం సహజంగానే వస్త్ర పరిశ్రమపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.
వస్త్ర పరిశ్రమపై…
‘వస్త్ర పరిశ్రమపై ట్రంప్ సుంకాల ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. భారత వస్త్రాలు, దుస్తుల ఎగుమతులకు అమెరికాయే ఏకైక అతి పెద్ద మార్కెట్. మన దేశం నుంచి జరుగుతున్న వస్త్రాలు, దుస్తుల మొత్తం ఎగుమతులలో 28 శాతం అమెరికాకే వెళుతున్నాయి’ అని భారతీయ వస్త్ర పరిశ్రమ సమాఖ్య (సీఐటీఐ) ప్రధాన కార్యదర్శి చంద్రిమా ఛటర్జీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి 10.8 బిలియన్ డాలర్ల విలువైన వస్త్రాలు అమెరికాకు ఎగుమతి అయ్యాయి.
ట్రంప్ సుంకాల దెబ్బకు జూన్‌లో ఎగుమతులు పడిపోయాయి. ప్రస్తుతం కొందరు ఆర్డర్లు రద్దు చేస్తుండగా మరికొందరు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. మొత్తంగా చూస్తే వస్త్ర పరిశ్రమ 2.5-3 బిలియన్ డాలర్ల మేరకు నష్టపోయే అవకాశం ఉంది. ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన లక్షలాది మంది ఉపాధి కోల్పోతారు.
దుస్తుల రంగంపై…
ఇక ఆర్డర్లపై తయారు చేసిన దుస్తులు కూడా ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇచ్చిన ఆర్డర్లను కూడా రద్దు చేసుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 5.2 బిలియన్ డాలర్ల విలువైన దుస్తులను అమెరికాకు ఎగుమతి చేశారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో 1.6 బిలియన్ డాలర్ల విలువైన దుస్తులు ఎగుమతి అయ్యాయి. అదనపు సుంకాన్ని తొలగించని పక్షంలో దుస్తుల పరిశ్రమ 2.5-3 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని కోల్పోతుంది. సరఫరాలు నిలిచిపోవడం, ఆర్డర్లు రద్దవడం, వ్యాపారంలో నష్టాలు…వీటన్నింటి కారణంగా ఫ్యాక్టరీలలో పనిలేకుండా పోయింది. వస్త్రాలు, దుస్తుల రంగంలో లక్షలాది మంది జీవనోపాధికి గండం ఏర్పడింది. ఈ రంగానికి అనుబంధంగా ఉండే పరిశ్రమలు కూడా దెబ్బతింటున్నాయి. అనుబంధ పరిశ్రమల్లో సుమారు మూడు కోట్ల మంది పనిచేస్తున్నారని అంచనా. సుంకాల కారణంగా కనీసం పాతిక శాతం ఉద్యోగాలు ప్రమాదంలో పడబోతున్నాయి.
ఈ దేశాల నుంచే పోటీ
అమెరికాకు వస్త్రాలు, దుస్తులను ఎగుమతి చేస్తున్న దేశాల్లో ప్రస్తుతం చైనాదే మొదటి స్థానం. వియత్నాం, భారత్, బంగ్లాదేశ్ నుంచి కూడా ఎగుమతులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్, వియత్నాం నుంచి జరుగుతున్న దిగుమతులపై అమెరికా 20 శాతం టారిఫ్ విధిస్తోంది. ఇండోనేషియా, కాంబోడియా నుంచి వస్తున్న వస్తువులపై 19 శాతం చొప్పున సుంకాలు విధిస్తోంది. ఆభరణాల రంగంలో మనతో పోటీ పడుతున్న తుర్కియేపై అమెరికా 15 శాతం టారిఫ్ విధిస్తుండగా థాయిలాండ్‌పై 19 శాతం విధిస్తోంది.
ముందే మేల్కొన్న ఆభరణాల తయారీదారులు
ఇదిలావుండగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఆభరణాల ఉత్పత్తిదారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఆరు నెలలుగా వారు అమెరికా కాకుండా ఇతర దేశాల మార్కెట్లపై దృష్టి సారించారు. గత సంవత్సరం ఈ రంగంలో 80 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ఇందులో 35 బిలియన్ డాలర్ల వ్యాపారం ఎగుమతుల ద్వారా జరిగింది. ఈ ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు పది శాతం. ట్రంప్ విధించిన అదనపు టారిఫ్‌ను ఉపసంహరించని పక్షంలో కొనుగో లుదారులు భారత్ వెలుపల ఉన్న మార్కెట్ల వైపు చూస్తారు. అయితే దేశీయ వ్యాపారులు కూడా జపాన్, యూరప్, బ్రిటన్ వంటి ఇతర దేశాల మార్కెట్ల వైపు చూడవచ్చు.
ఆర్థికంగా కుదేలు… ఉద్యోగాలకు ఎసరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES