‘రాజకీయ ప్రేరేపితం’ : థామస్ ఐజాక్
తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కి ఈడీ నోటీసులు జారీ చేయడంపై రాష్ట్ర మాజీ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ మండి పడ్డారు. ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితమని, తప్పుడు కేసులతో మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో ఎన్నికలకు ముందు ఈడీ క్రమం తప్పకుండా మసాలా బాండ్ అంశాన్ని తెరపైకి తెస్తోందని దుయ్యబట్టారు. 2020 స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఈ అంశాన్ని ప్రారంభించిందని అన్నారు. మసాలా బాండ్లకు అనుమతులు ఇచ్చే బాధ్యత ఆర్‌బీఐదేనని, ఆర్‌బీఐ ఆమోదంతోనే అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈడీ ప్రస్తుతం తన నివేదికను న్యూఢిల్లీలోని ఈడీ స్పెషల్ డైరెక్టర్ (అడ్జుడికేషన్) ఎదుట దాఖలు చేసిందని, ముఖ్యమంత్రి, తాను, అబ్రహంలు వివరణనివ్వాల్సి వుందని అన్నారు.
నిధులను వినియోగించి భూమిని ఎప్పుడు కొనుగోలు చేయలేదని, సేకరిం చామని అన్నారు. భూమిని సేకరించేటపుడు, కొనుగోలు చేయలేరనే షరతును కూడా ఆర్‌బీఐ తొలగించిందని అన్నారు. న్యాయవాదులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇద్దరికీ షోకాజ్ నోటీసులు
కేరళ సీఎం పినరయి విజయన్, మాజీ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డ్ (కేఐఐఎఫ్‌బీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.ఎం. అబ్రహం కూడా నోటీసులు అందుకున్నారు.
కేఐఐఎఫ్‌బీ 2019 మార్చిలో మసాలా బాండ్ ద్వారా సుమారు రూ.2,150 కోట్లు సేకరించింది. అదే ఏడాది ఏప్రిల్1న లండన్ స్టాక్ ఎక్సేంజ్‌లోని అంతర్జాతీయ సెక్యూరిటీస్ మార్కెట్‌లో వాటిని జాబితా చేసింది. బాండ్ల నుంచి సేకరించిన నిధులను భూమి కొనుగోళ్లకు వినియోగించారని, విదేశీ మారకపు నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘించారని పేర్కొంటూ ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది.
పొలిటికల్ గేమ్ : గోవిందన్
కేరళ ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు జారీచేయడంపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి.గోవిందన్ స్పందించారు. ఈ చర్యను ‘పొలిటికల్ గేమ్’గా అభివర్ణించారు. 2020 స్థానిక సంస్థల ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఈడీ నోటీసులు జారీచేసిందని అన్నారు. షోకాజ్ నోటీసులతో ఈడీ ముఖ్యమంత్రికి, ఐజాక్‌కు కాదని, కేరళ ప్రజలకు సవాలు విసిరిందన్నారు. కేఐఐఎఫ్‌బీ రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు నేతృత్వం వహించిందని అన్నారు.
కేరళ సీఎంకు ఈడీ నోటీసులు
- Advertisement -
- Advertisement -



