ఉద్యోగ విరమణ సభలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ – వనపర్తి
పూజారి మధుసూదన్ రావు నీటి పారుదల శాఖలో కార్యనిర్వహక ఇంజనీరుగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి వనపర్తి జిల్లా రైతులకు సాగు నీరు అందించడంలో తన వంతు కృషి చేశారని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అభినందించారు. శుక్రవారం సాగునీటి పారుదల శాఖ ఈఈ పూజారి మధుసూదన్ రావు ఉద్యోగ విరమణ కార్యక్రమం వనపర్తి పట్టణంలోని యం.బి. గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మధుసూదన్ వనపర్తి జిల్లాలో ఇరిగేషన్ శాఖ కార్యనిర్వహక ఇంజనీరుగా తన విధులను ఎలాంటి ఒత్తిడులకు గురికాకుండా సమర్థవంతంగా నిర్వహించారని, రైతులకు సాగు నీరు అందించడంలో తన వంతు కృషి చేశారని కొనియాడారు. పదవి విరమణ అనంతరం వారి కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్. ఈ శేఖర్, రహీం, కార్యనిర్వహక ఇంజనీర్లు, జిల్లా అధికారులు మధుసూదన్ రావు ను సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

 
                                    