Friday, January 9, 2026
E-PAPER
Homeకరీంనగర్బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి

- Advertisement -

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఆపరేషన్ స్మైల్ పోస్టర్ల ఆవిష్కరణ
లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఆయా శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మైల్ – 2026 సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 01 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ స్మైల్ – 2026 కార్యక్రమాన్ని నిర్వహించనున్న సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జనవరి, జూలై నెలల్లో *ఆపరేషన్ స్మైల్* కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో 18 ఏండ్లలోపు పిల్లలు భిక్షాటన, వివిధ పనుల్లో ఉండకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా కనిపిస్తే వెంటనే సమీప విద్యాలయాల్లో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో అడ్మిషన్ ఇప్పించాలని పేర్కొన్నారు. ఎక్కడా బాల కార్మికులు కనిపించకూడదని తెలిపారు. బడీడు పిల్లలు కచ్చితంగా బడిలోనే ఉండాలని స్పష్టం చేశారు. పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు
లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలను నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై దివ్యాంగులతో కలిసి బ్రెయిలీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, పంపిణీ చేశారు. పలువురు దివ్యాంగులను ఇంచార్జి కలెక్టర్ సన్మానించారు. లూయిస్ బ్రెయిలీ అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఆర్డీఓ గీత, చైల్డ్ ప్రొటెక్షన్ చైర్మెన్ చంద్రయ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి రజిత, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -