Saturday, December 20, 2025
E-PAPER
Homeజాతీయంపార్లమెంట్‌లో ఎనిమిది బిల్లులు ఆమోదం

పార్లమెంట్‌లో ఎనిమిది బిల్లులు ఆమోదం

- Advertisement -

లోక్‌సభ 110 శాతం, రాజ్యసభ 121 శాతం ఉత్పాదకత
ముగిసిన తోలి విడత సమావేశాలు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఎనిమిది బిల్లు ఆమోదించారు. డిసెంబర్‌ 1న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. 15 రోజుల పార్లమెంట్‌ కార్యకలాపాలు జరిగాయి. ఈ సమావేశాల్లో పది బిల్లులు ప్రవేశపెట్టారు. లోక్‌సభ, రాజ్యసభల్లో చెరో ఎనిమిది బిల్లులు ఆమోదించారు. అందులో ఒక బిల్లును జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపగా, ఒక బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి పంపారు. లోక్‌సభలో 110 శాతం కార్యకలాపాలు జరగగా, రాజ్యసభలో 121 శాతం కార్యకలాపాలు జరిగాయి. జాతీయ గీతం ”వందేమాతరం” 150వ వార్షికోత్సవంపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ జరిగింది. లోక్‌సభలో 65 మంది సభ్యులు 11.32 గంటల పాటు చర్చించారు. రాజ్యసభలో 81 మంది సభ్యులు 12.49 గంటల పాటు చర్చించారు.

అలాగే ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో 62 మంది 12.59 గంటల పాటు చర్చించగా, రాజ్యసభలో 57 మంది సభ్యులు 10.37 గంటల పాటు చర్చించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ”వీబీ-జీ రామ్‌ జీ” బిల్లు, పౌర అణుశక్తి రంగాన్ని ప్రయివేటీకరించే ‘సస్టైనబుల్‌ హార్నెస్సింగ్‌ అండ్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఎనర్జీ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా’ (శాంతి బిల్లు) బిల్లు, బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐలు అనుమతించే ”సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష (బీమా చట్టాల సవరణ)” బిల్లు వంటి కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదించుకుంది. ఆయా కీలక బిల్లులను విస్తృత పరిశీలన కోసం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ), సెలెక్ట్‌ కమిటీ, పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి పంపాలనే ప్రతిపక్షాల అభ్యర్థనలను, సూచనలను కనీసం పట్టించుకోకుండా పార్లమెంటరీ సాంప్రదాయాలకు తిలోదకాలిచ్చే విధంగా వ్యవహరించింది.

అర్థరాత్రి ప్రతిపక్ష సభ్యుల బైటాయింపు
ఉపాధిని నిర్వీర్యం చేసే బిల్లు ఆమోదంపై వాకౌట్‌

పార్లమెంట్‌లో అర్థరాత్రి ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. గ్రామీణ పేదల జీవనోపాధిలో కీలకపాత్ర పోషిస్తోన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే వీబీ-జీ రామ్‌ జీ బిల్లును ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి పక్ష సభ్యులు పార్లమెంట్‌లో బైటాయించారు. గురువారం లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, ఆగమేఘాలతో రాజ్యసభలో ఆమోదం కోసం కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చర్చను ప్రారంభించారు. దీంతో బిల్లుపై చర్చ అర్థరాత్రి వరకు జరిగింది. అయితే ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లుపై విస్తృత పరిశీలన అవసరమని, దీన్ని జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ లేదా సెలెక్ట్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేశాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష దోరణి పదర్శించి, ప్రతిపక్షాల అభ్యర్థనను తిరస్కరిం చింది. ప్రభుత్వం మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకుంటున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు సభను వాకౌట్‌ చేసి, ప్రవేశద్వారం వద్ద బైటాయించారు. రాత్రంతా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణంలోనే ఆందోళనను కొనసాగించారు.

గాంధీ, ఠాగూర్‌ ఫోటోలు ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాల హౌరెత్తించారు. ప్రస్తుత ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించడంపై ప్రతిపక్ష సభ్యులు మండిపడ్డారు. కొత్త బిల్లు రైతులు, గ్రామీణ పేదల వ్యతిరేకమని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించడంపై దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు. మోడీ సర్కారు బుల్డోజ్‌ చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ”బుల్డోజర్‌ వ్యూహాలను” అవలంభిస్తోందని, తగినంత సంప్రదింపులు లేకుండానే ఈ బిల్లును ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. ప్రస్తుత ఉపాధి హామీ చట్టాన్ని మార్చడం గ్రామీణ పేదలపై దాడి చేయడమేనని అన్నారు. ఈ చర్య మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వారసత్వాలను అవమానించిందని విమర్శించారు. పార్లమెంటరీ ప్రక్రియలను, ప్రజాస్వామ్య సంప్రదింపులను ఇలా నిర్లక్ష్యం చేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్‌ ఆవరణంలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -