Thursday, December 11, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఎన్నికల నిధులు-బీజేపీ

ఎన్నికల నిధులు-బీజేపీ

- Advertisement -

అలవాటైన ఆట మళ్లీ మొదలైంది. ప్రభుత్వ పరంగా కల్పించే రాయితీలకు గాను బీజేపీకి ఎన్నికల రాజకీయ విరాళాలు సేకరించుకునే ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ప్రధాని మోడీ నేతృత్వంలో 2024 ఫిబ్రవరి 29న సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం దేశీయ సెమీ కండక్టర్‌ పరిశ్రమలకు ఊతమిచ్చే పేరిట మూడు సెమీ కండక్టర్‌ యూనిట్ల నిర్మాణానికి అనుమతులిచ్చింది. ఇందులో రెండు యూనిట్ల నిర్మాణం టాటా గ్రూప్‌ కంపెనీకి దక్కింది. 2024 మేనెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. సెమీ కండక్టర్ల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు కల్పించడానికి గాను పరిశ్రమల భవనాల నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగభాగం కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇవ్వడానికి నిర్ణయమైంది. ఆ విధంగా టాటా కంపెనీకి కేంద్రప్రభుత్వం 44,203 కోట్ల రూపాయల సబ్సిడీ అందిస్తుంది. ఇందుకు ప్రతిఫలంగా టాటా కంపెనీ బీజేపీికి 758 కోట్ల రూపాయల రాజకీయ విరాళం అందజేసింది. ఈ సొమ్ము ఏయే మార్గాల ద్వారా బీజేపీికి చేరింది అనేది మీడియా బట్టబయలు చేసింది.

ఎన్నికల బాండ్ల పధకం ద్వారా బీజేపీ భారీఎత్తున అనుచిత ఆర్థిక లబ్ధి పొందింది అనేది వెలుగులోకి రావడంతో ఈ పథకం చట్టబద్ధత మీద కోర్టులో కేసులు పడ్డాయి. సుదీర్ఘంగా జరిగిన వాదోపవాదాల తర్వాత ఈ పథకం ఓటు హక్కుగల పౌరుల సమాచార హక్కును అతిక్రమించడమే అని భావించి సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధం అని తీర్పు చెప్పింది. ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు ఏయే కార్పొరేట్‌ కంపెనీలు ఎంతెంత మొత్తంలో ఎన్నికల విరాళాలు అందించాయనే వివరాలు బహిర్గతం కావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఎన్నికల బాండ్ల పథకానికి సంబంధించిన విరాళాల సమాచారం అంతా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సి వచ్చింది. ఈ సమాచారం ఆధారంగా కేంద్రప్రభుత్వం – కార్పొరేట్‌ వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఇచ్చి పుచ్చుకునే లావాదేవీలు జరిగాయని స్వతంత్ర మీడియా, సామాజిక అంశాల విశ్లేషకులు వెల్లడించారు. ఏ ప్రభుత్వ నిర్ణయాల ద్వారా ఏయే కార్పొరేట్‌ కంపెనీలు లబ్ధిపొందాయో ఆయా కంపెనీలు ఆయా ప్రభుత్వాలు నడిపే రాజకీయ పార్టీలకు రాజకీయ విరాళాలు అందజేసినట్లు స్పష్టంగా తెలియ వచ్చింది.

అందుకే రాజకీయ విరాళాలు ఇచ్చి – పుచ్చుకునే ధోరణితో సమకూరాయనే నిర్ధారణకు వచ్చారు. ఇంతకన్నా ఘోరం ఏమిటంటే ఎన్నికల విరాళాలు దండుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లను కొన్ని కార్పొరేట్‌ కంపెనీల మీదకు ఉసిగొల్పి నట్లు వెల్లడైంది. తేలుకుట్టిన దొంగ చందంగా బీజేపీప్రభుత్వం ఈ ఆరోపణల మీద విచారణకు ఆదేశించడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు టాటాగ్రూప్‌ వ్యవహారం బట్టబయలు కావడంతో ఎన్నికల బాండ్ల పధకం రద్దయినా రాజకీయ పార్టీలకు కార్పొరేట్‌ కంపెనీలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో నిధులు సమకూరుస్తున్నాయని స్పష్టమవుతున్నది. బడా కార్పొరేట్‌ కంపెనీలు వీటి మొత్తంలో నిధులు సమకూర్చిన ఎన్నికల ట్రస్ట్‌ నుండి వివిధ రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించాయని, ముఖ్యంగా బీజేపీికి భారీఎత్తున విరాళాలు అందాయని వెలుగులోకి వచ్చింది. ఇవిగాక నగదు రూపేణా, బ్యాంకు ట్రాన్స్‌ఫర్ల రూపేణా కూడా రాజకీయ విరాళాలు అందాయి.

ఈ విరాళాలను ఆయాపార్టీలు తమ పార్టీ ఆడిట్‌ నివేదికలో పేర్కొన్నాయి. బీజేపీ 2018 -2023 మధ్యనున్న ఆరేండ్ల కాలానికి సమర్పించిన ఆడిట్‌ నివేదికలను పరిశీలిస్తే ఎన్నికల బాండ్లు, ఎన్నికల ట్రస్టు, ఇతర విరాళాలు -ఈ మూడు మార్గాల ద్వారా సమకూరిన విరాళాల మొత్తం చూస్తే కండ్లు చెదిరిపోతాయి. ఈ పార్టీ కోశాగారం అనూహ్యంగా నిధులతో నిండి పొంగిపొర్లిపోతా ఉంది. ఈ విషయంలో బీజేపీ మిగిలిన రాజకీయ పార్టీలు అందుకోలేనంత స్థాయికి ఎదిగింది. పార్లమెంట్‌లో 85 శాతం మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పన్నెండు రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల పధకం తాలూకా 96 శాతం నిధులు అందినట్లు తెలియవస్తుంది. ఎన్నికల ట్రస్ట్‌ ద్వారా ఇతర విరాళాల రూపేణా కూడా అందిన నిధుల్లో అత్యధిక మొత్తాలు ఈ పన్నెండు రాజకీయ పార్టీలకే దక్కాయని భావించవచ్చు. లెక్కలూ డొక్కలూ అన్నీ తేల్చి చూస్తే ఒక్క బీజేపీనే 58 శాతం ఎన్నికల/ రాజకీయ విరాళాలు దక్కించుకుని మిగిలిన అన్ని రాజకీయ పార్టీలకు దక్కిన విరాళాల మొత్తం అంతా కలిపినా అందుకోలేనంత ఎత్తున నిలబడింది.

రాజకీయ పార్టీలకు కార్పొరేట్‌ కంపెనీలు విరాళాలు సమర్పించే ప్రక్రియ మనుగడలో ఉన్నంత కాలం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం వ్యవహారం నడుస్తూనే ఉంటుంది. ఈ మార్గాన బీజేపీ పోగేసుకున్న నిధులతో సంతరించుకున్న అర్ధబలాన్ని చూస్తే రాజ్యాంగంలోను, ప్రజాప్రాతినిధ్య చట్టంలోను పేర్కొన్న సమాన అవకాశాల ప్రాతిపదికన ఎన్నికల్లో పాల్గొనే అవకాశం అన్ని రాజకీయ పార్టీలకు కల్పించాలనే సూత్రం గాలికి ఎగిరిపోయే పేల పిండిలా తేలిపోతుంది. ఇలా పోగేసుకున్న నిధులతో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఎలా చెరబట్టిందో మన కండ్ల ముందే కనబడుతుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల కొనుగోళ్ల ద్వారా ప్రజా తీర్పును పరిహాసం చేసే రీతిలో ఓడిన చోట్ల కూడా ప్రభుత్వాలు నెలకొల్పుతున్నది. మీడియాలో కార్పొరేట్‌ గుత్తాధిపత్యం నెలకొని ఉండడంలో ఇటువంటి కీలకమైన అంశాలను ప్రజల దృష్టికి రాకుండా మరుగున పరుస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. కాబట్టి తక్షణమే ఎన్నికల సంస్కరణలు చేపట్టాలి. ప్రత్యేకించి రాజకీయ పార్టీలకు అందే విరాళాల మీద మేలైన, పారదర్శక విధానం రూపొందించాలి.
(‘పీపుల్స్‌ డెమోక్రసీ’ 2025 డిసెంబర్‌ 7 సంచిక నుండి)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -