నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్ (Nepal) లో సాధారణ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. సాధారణ ప్రజలతోపాటు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా పనిచేస్తున్న సుశీల కర్కి (Sushila Karki) ఓటు వేశారు.
నేపాల్ పార్లమెంట్‌లో మొత్తం 275 స్థానాలున్నాయి. దిగువ సభ అయిన ‘ప్రతినిధుల సభ’లో 165 స్థానాలుండగా, వీరిని ఎన్నికల ద్వారా ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మిగతా 110 మంది ఎంపీలను రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తమకు లభించిన ఓట్ల శాతం ఆధారంగా నామినేట్ చేస్తాయి.నేపాల్ ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం దేశంలో 1.90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2022 నవంబర్‌లో జరిగిన పార్లమెంల్ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం 10 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు. వీరంతా చాలావరకు యువతే కావడం విశేషం.
జెన్ జీ ఆందోళనలతో నేపాల్ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. వారి ఆందోళనలతో సుశీల కర్కీ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు. రేపు(గురువారం) దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.


