రూ.13,61,000 విలువ చేసే విద్యుత్ మోటార్లు
రూ.1,74,000 నగదు స్వాధీనం
నిందితులంతా నకిరేకల్ వాసులు
నవతెలంగాణ – కట్టంగూర్
దొంగలించిన వ్యవసాయ విద్యుత్ మోటార్లు, పైపులను ట్రాలీ ఆటోలో నకిరేకల్ నుంచి హైదరాబాదుకు తరలిస్తుండా కట్టంగూర్ పోలీసులు నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం పట్టుకున్నారు. కట్టంగూర్ పోలీసు స్టేషన్లో జిల్లా ఆడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఏఎస్పీ), డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ కొండర్రెడ్డితో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నకిరేకల్ చెందిన ఎడ్ల సురేష్, నాగిళ్ల ముత్తయ్య. గోపగాని రమేష్, ఆవుల రాజాలు, నాగిళ్ల యల్లయ్య అను ఐదుగురు ఇటీవల కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామ శివారులోని వెంకటేశ్వర డెయిరీ ఫామ్, అయిటిపాముల గ్రామ శివారులో, శాలిగౌరారం మండల పరిధిలో వ్యవసాయ బావుల వద్ద, ఫాంహౌజ్ వద్ద దొంగతనం చేసినట్లు తెలిపారు.
ఆటోలో ఉన్న వస్తువులతో పాటు నిందితుల ఇంటి వద్ద ఉన్న మిగతా వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.13,61,000 విలువ చేసే 14 విద్యుత్ మోటార్లు, 83 బోద్ పైపులు 8 బ్యాటరీలు, రాగి వైరు, మంచం, రెండు సీలింగ్ ఫ్యాన్లు, రెండు చైన్లు, ప్రిజ్ బోరీకి ఉపయోగించిన ట్రాలీ ఆటో, నగదు రూ.1,74,000 లను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్ పీ తెలిపారు. నల్లగొండ జిల్లాలో వ్యవసాయ భూములు ఫామ్ హౌజ్లలో బోరు మోటార్లు, ఇతర దొంగతనాలు జరుగుతున్న నేపధ్యంలో జిల్లా ఎస్సీ కరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని తెలిపారు. తనిఖీల్లో భాగంగా కట్టంగూరులో ని జాతీయ రహదారిపై నల్లగొండ క్రాస్ రోడ్డ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నకిరేకల్ నుంచి హైదరాబాదు వైపు వెళుతున్న ట్రాలీ ఆటో తనిఖీ చేయగా అందులో ఉన్న విద్యుత్ మోటార్లు, బ్యాటరీలు, ఐరన్ పైపులు, ఫ్రిజ్, మంచం, సీలింగ్ ఫ్యాన్లు స్వాదీనం చేసుకొని డ్రైవర్తో పాటు 5గురు నిందితులను స్టేషన్ తరలించి విచారించినట్లు తెలిపారు.
ఎడ్ల సురేష్, నాగిళ్ల ముత్తయ్య అను నేరస్తులు 3 సంవత్సరాల క్రితం తిప్పర్తి మండల పరిధిలో ఆగి ఉన్న రైలు బోగీ నుంచి 39 బ్యాటరీలను దొంగతనం చేసి రైల్వే పోలీసులు పట్టుబడి జైలుకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. పట్టుబడిన నేరస్తులు గతంలో జైలుకు వెళ్లినా తమ ప్రవర్తనలో మార్చుకొనకపోగా మరల మిగతా వారితో కలిసి ఫాంహౌజ్లు, వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మోటార్లు, ఇతర సామాగ్రి, బ్యాటరీలను దొంగతనం చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనిఖీల్లో పాల్గొని పట్టుకున్న పోలీసులను ఏఎస్పీ అభినందించారు. నిందితులను రిమాండ్ తరలించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ మునుగోటి రవిందర్, సిబ్బంది మునాస సత్యనారాయణ, దిండిగాల శ్రీనివాస్, గంట, శంకర్, దుర్గా ప్రసాద్, వెల్లెంల శంకర్. రాంమోహన్ ఉన్నారు.