Monday, August 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి ఎలివేటెడ్‌ కారిడార్లు

ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి ఎలివేటెడ్‌ కారిడార్లు

- Advertisement -

– రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌లో అభివృద్ధి పనుల పరిశీలన
నవతెలంగాణ-ఎల్‌బీనగర్‌/హయత్‌నగర్‌

ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు రూ.650 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కారిడార్‌ పనులను వేగవంతం చేస్తున్నామని, త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో చింతలకుంట నుంచి పెద్దఅంబర్‌పేట రేడియో స్టేషన్‌ వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ రాగుల వెంకటేశ్వర్‌ రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ ధర్మారెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి వనస్థలిపురం జంక్షన్‌ వద్ద ఆదివారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ కారిడార్‌ కింద రోడ్డు, మధ్యలో హైవే, పైభాగంలో మెట్రో రాకపోకల కోసం సదుపాయం ఉంటుందని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి గడ్కరీని ఈనెల 6న కలుస్తామని తెలిపారు. ఎంపీగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి కృషి చేశానని, ఇప్పుడు ఆర్‌అండ్‌బీ మంత్రిగా పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రెండు గంటల్లో చేరుకునేలా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని కేటీఆర్‌ చెబుతున్నారని, ఉప్పల్‌-నారపల్లి ఫ్లైఓవర్‌ ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ పదేండ్లు సెంటిమెంట్‌తో ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణ చేశారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై కేసీఆర్‌ పదేండ్లు మాట్లాడలేదని, ఇప్పుడు ఆయన బిడ్డకు బీసీ రిజర్వేషన్లతో ఏం పని అని ప్రశ్నించారు. అనంతరం రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. స్థానిక కాలనీవాసులు వందమందితో కలిసి నెల క్రితం మంత్రిని కలిశానని తెలిపారు. జనాభా పెరిగిన నేపథ్యంలో వాహన అండర్‌పాస్‌లకు బదులుగా ఫ్లైఓవర్లు అత్యవసరమని, ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గించేందుకు, కాలనీ వాసులు సురక్షితంగా రోడ్లు దాటేందుకు ఫ్లైఓవర్ల కోసం వినతిపత్రం ఇచ్చామన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం వనస్థలిపురం చౌరస్తా రోడ్డు పరిశీలనకు రావడం అభినందనీయమని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -