Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖాళీ స్థలాలు..మురుగు కూపాలు.!

ఖాళీ స్థలాలు..మురుగు కూపాలు.!

- Advertisement -

మండలంలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం..
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల వ్యాప్తంగా స్థానిక పరిపాలనలో సమన్వయ లోపం ప్రజారోగ్యానికి పెను శాపంగా మారుతోంది. తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, రుద్రారం, కొండంపేట, ఇప్పలపల్లి, నాచారం, ఆన్సాన్పల్లి, వళ్లెంకుంట తోపాటు పలు గ్రామాల్లోని ఖాళీ స్థలాలు, కలుషితమైన పరిసరాలు దోమలకు ఆవాసంగా మారి, మలేరియా, టైఫాయిడ్ వంటి తీవ్ర జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తరచూ రోగాల బారిన పడి,ఆసువత్రుల పాలవుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు.

మొక్కుబడిగా ఫ్రైడే – డ్రైడే..

ప్రతి శుక్రవారం మండల పరిధిలోని గ్రామాల్లో నిర్వహించాల్సిన ఫ్రైడే – డ్రైడే కార్యక్రమాలు కేవలం మొక్కుబడిగా సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పారిశుద్ధ్య సమస్యలు అదుపులోకి రావడం లేదు. ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు, మురుగు నిలిచిపోవడం,పిచ్చి మొక్కలు పెరిగిపోవడం వల్ల ఆ ప్రాంతాల నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుందని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. మురుగు కారణంగా దోమల వృద్ధి విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.

నిధుల లేమి.. పట్టించుకోని కార్యదర్శులు..

గ్రామాల్లోని ఖాళీ స్థలాలపై పన్ను చెల్లించాల్సిన ఫ్లాట్ల యజమానుల వివరాలను కూడా గ్రామ కార్యదర్శులు విస్మరిస్తున్నారని ఆరోపణలున్నాయి. నివాస గృహాల మధ్య పారిశుద్ధ్య సమస్యలు తలెత్తు తున్నా, గ్రామ కార్యదర్శులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, పైపులైన్ల లీకేజీల కారణంగా కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.

ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువు…

సర్పంచ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రభు త్వం నియమించిన ప్రత్యేకాధికారులు గ్రామాల అభివృద్ధి,పారిశుధ్యాన్ని పర్యవేక్షణలో విపలమైయ్యారు.నిధుల లేమి కారణంగా ప్రత్యేకాధికారులు గ్రామాలను సందర్శించడం లేదని తెలుస్తోంది. పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరిగి, పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పింది. మండలం లోని మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరచడానికి ఎవరూ చర్యలు చేపట్టకపోవడంతో ప్రతి గ్రామం లోనూ పరిసరాలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. మొత్తంగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండలంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, పారిశుద్ధ్య లోపాన్ని సరిదిద్ది,ప్రజారోగ్యాన్ని కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -