అమెరికా సుప్రీంకోర్టును కోరిన ట్రంప్
వాషింగ్టన్ : జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేయడానికి తాను చేసిన ప్రయత్నం చట్టబద్ధమా కాదా అనే విషయాన్ని సమీక్షించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశ సుప్రీంకోర్టును కోరారు. జన్మహక్కు పౌరసత్వానికి ముగింపు పలకాలని అభ్యర్థించారు. తద్వారా ఓ పెద్ద రాజ్యాంగపరమైన పోరుకు ఆయన నాంది పలికారు. జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ గతంలో ఎగ్జిక్యూటివ్ ఆదేశం జారీ చేశారు. అయితే దీనిని అమెరికాలోని రెండు దిగువ కోర్టులో కొట్టివేశాయి. దీనిని సవాలు చేస్తూ న్యాయ శాఖ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ట్రంప్ ఈ ఆదేశంపై సంతకం చేశారు. తల్లిదండ్రులలో కనీసం ఒకరు అమెరికా పౌరుడు లేదా పౌరురాలు కాకపోయినా లేదా చట్టబద్ధంగా శాశ్వతంగా దేశంలో నివసించకపోయినా వారికి అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రభుత్వ సంస్థలను ట్రంప్ ఆదేశించారు.
దిగువ కోర్టులు ఇచ్చిన రూలింగ్ సరిహద్దు భద్రతను పట్టించుకోలేదని, అర్హత లేని వేలాది మందికి పౌరసత్వాన్ని పొడిగించిందని న్యాయ శాఖకు చెందిన న్యాయవాదులు తెలిపారు. కాగా ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలలో పలు కేసులు దాఖలయ్యాయి. ట్రంప్ ఆదేశం అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణను ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు వాదించారు. అమెరికా భూమిపై పుట్టిన ఎవరికైనా పౌరసత్వం కల్పించాలని ఆ సవరణ నిర్దేశిస్తోంది. పిటిషనర్ల వాదనతో అనేక రాష్ట్రాలలో ఫెడరల్ న్యాయమూర్తులు ఏకీభవించారు. ట్రంప్ ఆదేశాలు అమలు కాకుండా రూలింగ్ ఇచ్చారు. ట్రంప్ ఆదేశాన్ని సవాలు చేస్తూ వాషింగ్టన్ రాష్ట్రం, మరో ముగ్గురు, అలాగే న్యూ హాంప్‌షైర్‌లోని కొందరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లు ప్రస్తుతం హైకోర్టు ముందు ఉన్నాయి.