Tuesday, December 2, 2025
E-PAPER
Homeజాతీయంఇక చాలు

ఇక చాలు

- Advertisement -

డిజిటల్‌ అరెస్టు స్కామర్లను అణచివేయండి
ఇంటర్‌పోల్‌తో సమన్వయం చేసుకోండి
అసాధారణ రీతిలో సీబీఐని ఆదేశించిన సుప్రీం

న్యూఢిల్లీ : డిజిటల్‌ అరెస్టుకు పాల్పడుతున్న స్కామర్లపై, వారికి సహకరించే వారిపై అణిచివేత చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు సోమవారం సీబీఐని ఆదేశించింది. సైబర్‌ నేరాలతో మ్యూల్‌ ఖాతా (అక్రమ నిధుల లావాదేవీల కోసం నేరస్తులు ఉపయోగించే ఖాతాలు) లకు గల సంబంధాల్లో బ్యాంకుల పాత్రపై అవినీతి నిరోధక దర్యాప్తు చేపట్టేందుకు అవసరమైన చర్యలు స్వేచ్ఛగా చేపట్టవచ్చని పేర్కొంది. ”జరిగింది ఇక చాలు”, డిజిటల్‌ అరెస్టు కుంభకోణాలపై సీబీఐ అత్యవసరంగా దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోమాల్యా బగ్చిలతో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది. బాధితుల నుంచి ఇప్పటివరకు మోసగాళ్ళు డిజిటల్‌ అరెస్టుల ద్వారా దోచుకున్న మొత్తం మూడువేల కోట్లపైనే వుందని న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం అందచేసిన నోట్‌ పేర్కొంది. ఇందులో బాధితులు ప్రధానంగా వృద్ధులే కావడం గమనార్హమని పేర్కొంది.

స్కామర్లను వేటాడి పట్టుకోవడానికి దేశవ్యాప్తంగా దర్యాప్తు చేపట్టాలని నేరుగా సీబీఐనే ఆదేశిస్తూ సుప్రీం అసాధారణ చర్య తీసుకుంది. ఇందుకు గానూ ముందుగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న అంశాన్ని కూడా పక్కనబెట్టింది. కొన్ని ప్రత్యేక, అసాధారణ పరిస్థితులు తలెత్తినపుడు మాత్రమే న్యాయస్థానం నేరుగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించగలుగుతుంది. రాష్ట్రాల్లో ఆయా పరిధుల్లో దర్యాప్తు కోసం ఢిల్లీ స్పెషల్‌ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 6 కింద సీబీఐకి అనుమతిని మంజూరు చేయాల్సిందిగా బీహార్‌, తమిళనాడు, కర్నాటక, కేరళ, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్తాన్‌, పంజాబ్‌, తెలంగాణ తదితర రాష్ట్రాలను ఆదేశించింది. ”దేశవ్యాప్తంగా సమగ్ర దర్యాప్తును సీబీఐ చేపట్టాలని మేం భావిస్తున్నాం.” అని చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. డిజిటల్‌ అరెస్టు కుంభకోణాల తీవ్రత, వాటి లోతైన మూలాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు, సైబర్‌ నేరాలకు స్వర్గధామాలుగా వున్న విదేశాలను గుర్తించడానికి ఇంటర్‌పోల్‌తో సమన్వయం చేసుకుని భారత్‌లో వారి కార్యకలాపాలను అణచివేయాల్సిందిగా ఆదేశించింది.

ఏఐని ఉపయోగించాలి
ఈ నేరస్తులను పట్టుకోవడానికి కృత్రిమ మేథస్సు (ఏఐ)ని, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీని ఉపయోగించడంపై స్పందించాల్సిందిగా కోరుతూ రిజర్వ్‌ బ్యాంక్‌కి నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కార్యకలాపాలు చేపట్టడంలో సీబీఐకి అవసరమైనపుడు సహకరించాల్సిందిగా రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి, కేంద్ర, రాష్ట్రాల డొమైన్‌ నిపుణులకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సైబర్‌ నేరాలకు సంబంధించిన డేటాను సేకరించడానికి, ముందస్తు నివారణ చర్యలు చేపట్టడానికి గానూ సైబర్‌ క్రైమ్‌ సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేసి, పనులు చేపట్టాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

సిమ్‌ కార్డుల జారీలో నిర్లక్ష్యం
సిమ్‌ కార్డుల జారీలో టెలికం ఆపరేటర్లు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోర్టు పేర్కొంది. ఈ న్యాయస్థానం ముందుంచిన రికార్డులను పరిశీలిస్తే, సిమ్‌ల జారీలో టెలికం ఆపరేటర్ల ప్రమాదకరమైన, నిర్లక్ష్య ధోరణితో కూడిన, బాధ్యతారాహిత్యమైన ధోరణి వెల్లడవుతోందని చీఫ్‌ జస్టిస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సిమ్‌ల దుర్వినియోగాన్ని నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఒక ప్రతిపాదనను అందచేయాల్సిందిగా టెలికం శాఖను ఆదేశించింది. ఈ కేసులో అమికస్‌ క్యూరీ అయిన అడ్వకేట్‌ ఎన్‌.ఎస్‌.నప్పినాయి డిజిటల్‌ అరెస్టులు మోసపూరితమైన పెట్టుబడులు, పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలిస్తామన్న హామీలు అంటూ సైబర్‌ నేరాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఇవన్నీ కూడా అమాయకులైన బాధితులను ముఖ్యంగా వృద్ధులను మోసం చేయడానికి ఉద్దేశించినవే. కేటగిరీ ఏదైనా వాటిని అరికట్టాల్సిన బాధ్యత, అవసరం మనపై వుందని చీఫ్‌ జస్టిస్‌ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -