Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజసీతారాం పరిశోధనలో పర్యావరణ చింతన

సీతారాం పరిశోధనలో పర్యావరణ చింతన

- Advertisement -

మనిషి తన కాళ్ళకింద నేల ఊసర క్షేత్రంగా మారిపోతున్నా గుర్తించడం లేదు. కళ్ళముందు కొండలు, గుట్టలు కరిగిపోతున్నా పట్టించుకోవడం లేదు. భూతాపం పెరిగిపోయి అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నా నిర్లిప్తంగా వుంటున్నాడు. ప్రకతి సమతుల్యత దెబ్బతిని జీవావరణ వ్యవస్థకు వస్తున్న పెను విపత్తును నిర్లక్ష్యం చేస్తున్నాడు. రాబోయే కాలంలో భూమి నివాసయోగ్యత కోల్పోయే వ్యర్థగోళంగా మారిపోయే ప్రమాదకర స్థితి పొంచివుంది. ఇదిగో ఇక్కడే సీతారాంలోని పర్యావరణవేత్త మేల్కొన్నాడు. మానవాళికి రాబోయే పర్యావరణ పెను ప్రమాదాల పట్ల ఘాటైన హెచ్చరికలను చేయదలుచుకున్నాడు. ప్రకతి సకల ప్రాణుల నిమిత్తం ఉన్నదనే జ్ఞానాన్ని ఎరుకపరచడానికి పర్యావరణ అంశాన్ని తన పరిశోధనకు ఎన్నుకున్నాడు. లిఖిత, అలిఖిత సాహిత్యం లోని పర్యావరణ సంబంధిత విశేషాలు, ప్రబంధ రచనల్లో నేపథ్యమైన ప్రకతి వర్ణనలు, అలంకార గ్రంథాల్లోని లక్ష్య, లక్షణాల్లోని ప్రతిబింబాలను వివరిస్తూ పర్యావరణ అంశాల విస్తతిని తెలియజేస్తాడు. ఆధునిక కవిత్వంలో ప్రకతి చిత్రణ లక్ష్యం చర్చిస్తూ పర్యావరణ చైతన్య రాహిత్యాన్ని ప్రస్తావించాడు.
ఈ నేపథ్యంలో తెలుగులో సాహిత్య సజన చేసిన ప్రజా వాగ్గేయకారుల గేయ సాహిత్యాన్ని పర్యావరణ దష్టికోణంలో సీతారాం అధ్యయనం చేశాడు. వారి సాహిత్యంలో ప్రతిఫలించిన పర్యావరణ స్పూర్తి గల విభిన్న అంశాలను విశ్లేషించాడు. ”ఇటువంటి అధ్యయనాలలో తెలుగులో ఇదే మొదటిది. విశిష్టమైంది కూడా. ఇంతవరకు తెలుగు సాహిత్యంలో ఇటువంటి అధ్యయనం జరగలేదు” అని సీతారాం ప్రకటించడం తన పరిశోధన స్థాయిమీద వున్న ప్రగాఢ విశ్వాసానికి నిదర్శనం. ఈ గ్రంథం చదివిన వారు కూడా సీతారాం విశ్వాసంతో నిర్ద్వంద్వంగా ఏకీభవిస్తారు.
సీతారాం పర్యావరణ పరిశోధన ప్రామాణికమైన పరిశోధన పద్ధతులకు అనుగుణంగా నూతన ప్రతిపాదనలతో భావి పరిశోధనలకు మార్గదర్శక రీతిలో సాగింది. ఒక పరిశోధనా గ్రంథం ప్రామాణికత అధ్యాయాల విభజనతోనే మొదలవుతుంది. పరిశోధన సారాంశ విషయ క్రమం, లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుసరించిన ప్రణాళిక అధ్యాయ విభజనలో ప్రతిఫలిస్తుంది. సీతారాం నిర్దేశిత గమ్యానికి అనుగుణంగా ఆరు అధ్యాయాలను పటిష్టంగా నిర్మించుకున్నాడు. తన పరిశోధనలో భాగంగా విషయ సేకరణ కోసం దేశవ్యాప్తంగా సంచరించాడు. అలా అని తన దగ్గర సమాచారం వున్నది కదా! అని అనవసరపు సమాచారాన్ని కుప్పపోసిన అధ్యాయాలు ఇందులో లేవు. ఈ పరిశోధనలో మొత్తం ఐదు అధ్యాయాల ద్వారా ప్రకతి-మనిషి సంబంధాన్ని, సాహిత్య-పర్యావరణ అనుబంధాన్ని, ప్రజా వాగ్గేయ సాహిత్య విభాగాన్ని, పర్యావరణ ఉద్యమాల సామాజిక మూలాలను, పర్యావరణ తాత్విక-నైతిక దక్పథాలను విశ్లేషించారు.
మొదటి అధ్యాయం ప్రకతి, మానవ వ్యవస్థల పరస్పర ఆధారతను వివరించి, అవి అసమతుల్యంగా మారితే ఎదురయ్యే సమస్యలను శాస్త్రీయంగా చర్చిస్తుంది. ఇది యునెస్కో విద్యా లక్ష్యాలకు అనుగుణంగా ఉండి, గ్రీన్‌ పాలిటిక్స్‌, ఎకలాజికల్‌ ఎకనామిక్స్‌ వంటి భావాలకు మార్గం చూపుతుంది. రెండవ అధ్యాయం సాహిత్యం-పర్యావరణం మధ్య అంతస్సంబంధాన్ని స్పష్టం చేస్తూ, ఇంటర్‌ డిసిప్లినరీ దష్టితో సాహిత్యాన్ని పర్యావరణం దిశగా విస్తరిస్తుంది. మైఖేల్‌ కోహెన్‌ వంటి విమర్శకుల ప్రశ్నలకు సమాధానాల ద్వారా సాహిత్యాన్ని మానవ శాస్త్రాల్లో భాగంగా చూడాల్సిన అవసరాన్ని తెలిపింది.
మూడవ అధ్యాయంలో ప్రజా వాగ్గేయ సాహిత్యాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం, ప్రజా వాగ్గేయ కారుల భావజాలాలు, ఉద్యమ చైతన్యాలు, ప్రకతి ప్రేమ వంటి అంశాల విశ్లేషణ చోటు చేసుకుంది. గద్దర్‌ నుంచి గోరటి వెంకన్న దాకా వాగ్గేయకారుల గేయాల్లో పర్యావరణ భావాలను అన్వయించడమే విశిష్టత. నాల్గవ అధ్యాయం నూతన సామాజిక ఉద్యమాల్లో పర్యావరణ ఉద్యమ ప్రాముఖ్యతను చర్చిస్తుంది. వనరులపై ఆధిపత్యం, దానిపై స్థానిక సమూహాల వ్యతిరేకత ఎలా పర్యావరణ ఉద్యమంగా మారిందో వివరించబడింది. వందనా శివ, సుందర్‌ లాల్‌ బహుగుణ, మేధా పాట్కర్‌ వంటి ఉద్యమకారుల ఆలోచనలు చర్చించబడ్డాయి. ఐదవ అధ్యాయం పర్యావరణ శాస్త్ర, నైతిక, తాత్విక భావనలను విపులంగా చర్చిస్తుంది. పాశ్చాత్య పర్యావరణ తత్త్వవేత్తల ఆలోచనలతోపాటు ‘ఇకో క్రిటిసిజం’ అనే హరితవాద విమర్శా పద్ధతిని పరిచయం చేసి, సాహిత్య విమర్శను కొత్త దిశగా అభివద్ధి చేయడమే ఈ పరిశోధన ప్రత్యేకత.
‘ప్రజా వాగ్గేయ సాహిత్యం-పర్యావరణ తత్త్వ నిరూపణ’ అధ్యాయం ప్రజా కవుల పాటల్లో వ్యక్తమైన పర్యావరణ ప్రేమ, ఆవేదనను విపులంగా విశ్లేషిస్తుంది. గద్దర్‌, గోరటి వెంకన్న, పయిలం సంతోష్‌ తదితరుల గేయాల్లో ధరిత్రి పరిరక్షణ పట్ల బాధ్యతగల పౌర కవుల ధోరణి ప్రతిబింబించిందని సీతారాం వివరించాడు. వందలాది కవులను, వేల పాటలను పర్యావరణ కోణంలో అధ్యయనం చేసి, ప్రకతి విషాదాన్ని గంభీరంగా వ్యక్తీకరించారు. ప్రాంతీయ కవుల భావోద్వేగాలు గ్లోబల్‌ పరిణామం పొందిన తీరును చర్చించాడు. ప్రపంచీకరణ, అభివద్ధి పేరిట జరిగే పర్యావరణ నాశనాన్ని పాటల ద్వారా ఎలా హెచ్చరించారో స్పష్టంగా వివరించాడు. పాటల శిల్ప నిర్మాణాన్ని, తాత్వికతను విశ్లేషించి, పర్యావరణం భూమికి ఊపిరిగా ఉండాలన్న సందేశాన్ని సునిశితంగా ప్రదర్శించాడు. ఈ అధ్యాయం పాఠకుడిలో పర్యావరణ స్పహను మేల్కొలుపుతుంది.
ఈ క్రమంలో సీతారాం, ‘తెలుగు సాహిత్యంలో వస్తున్న పరిణామాలను, సాహిత్యాన్ని విశ్లేషించడానికి కొత్త విమర్శా దక్పథాలు కూడా రూపొందాల్సిన అవసరాన్ని సాహిత్యకులు గమనించాల్సి ఉంద’ని సూచిస్తాడు. పర్యావరణ నిరాక్షరాస్యత ఆవరించిన లోకానికి ఓనమాలు నేర్పించడానికి సమాయత్తమయ్యాడు. ఈ పరిశోధన సమకాలీన అంతర్జాతీయ సాహిత్యంలో పర్యావరణంపై జరుగుతున్న చర్చల నేపథ్యానికి అనుగుణంగా, స్థానికతకు అన్వయించుకుని విలువైన విషయ పరిజ్ఞానాన్ని, మానవీయ ఆలోచనలను అందించింది. పాశ్చాత్య హరితవాద విమర్శా ధోరణుల ఆధారంగా కాక, భారతీయ దక్పథంతో, ప్రజల అనుభవాల ఆధారంగా పర్యావరణంపై ప్రజావాగ్గేయకారులు వ్యక్తీకరించిన భావనలను ఈ పరిశోధన వెలుగులోకి తెచ్చింది. పెట్టుబడిదారీ విధానాల కారణంగా ప్రకతిపై జరుగుతున్న ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యాన్ని కలిగించే గేయ సాహిత్యాన్ని సీతారాం జీవప్రాంతీయ కథనాలుగా విశ్లేషించడం గమనార్హం. అంతర్జాతీయంగా పర్యావరణ సిద్ధాంతాల పరిణామం వాతావరణ సంక్షోభాలపై నివారణాత్మక చర్చలను ప్రేరేపించింది. తెలుగు ప్రాంతీయ వాగ్గేయ సాహిత్యం కూడా అదే దిశలో ప్రయత్నించిందనేది ఈ పరిశోధనలో తేలిన సత్యం. ప్రాంతీయ భిన్నత్వాలను, సామాజిక అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ప్రజావాగ్గేయకారుల చైతన్యాన్ని గుర్తించిన పరిశోధకుడు, భవిష్యత్తులో సాహిత్య విమర్శకు పర్యావరణ దష్టికోణం అనివార్యమనే దిశగా దారిని ఏర్పరిచాడు. అనుశాసనాత్మకంగా ఇంటర్‌ డిసిప్లినరీ అధ్యయనాలకు ఇది ప్రేరణాత్మకంగా నిలుస్తుంది.
‘ప్రజా వాగ్గేయ సాహిత్యం- పర్యావరణం’ అనే కొండంత విషయాన్ని ఒక చిన్న గులకరాయిగా మార్చి మన అరచేతుల్లో పెట్టాడు.
పరిశోధనలో ‘పాదసూచిక’ ఎంత విలువైనదో తెలిసిన అనుభవశాలి సీతారాం. ఈ గ్రంథంలోని ప్రతి పాదసూచిక పరిశోధకుడి వినియోగ నైపుణ్యానికి, ఔచిత్యానికి ప్రతీక. ఉపయుక్త గ్రంథ సూచిక చూడండి. సీతారాం ఎంత లోతుగా ధరిత్రి ఎదలోపలికి వేళ్ళలాగా చొచ్చుకొనిపోయాదో అతడి అధ్యయనం చూస్తే అర్థమవుతుంది. పదోన్నతి ప్రయోజనాలు, లేదా బయోడేటా బలోపేతం కోసం చేసిన మేజర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ కాదు ఇది. ‘ఈ ధరణి మీద ప్రథమ పౌరులు వక్షాలే’ అని నమ్మిన సీతారాం ఒక అద్వితీయ పౌరుడిగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు. ఈ పరిశోధన ద్వారా ధరిత్రి మీద ఎక్కడైనా పర్యావరణ సదస్సు జరిగితే, కీలకోపన్యాసం (ఖవyఅశ్‌ీవ aససతీవరర) ఇవ్వగల సాధికారిక జ్ఞానవంతుడిగా సీతారాం నిలబడతాడు. పర్యావరణ ప్రేమికులారా! గమనించండి, చిప్కో ఉద్యమంలో చెట్లను కౌగిలించుకోలేనివారు సీతారాంను హత్తుకోండి. అతడు అందుబాటులో లేకుంటే ఈ గ్రంథాన్ని స్పర్శించండి. ఈ గ్రంథంతో సీతారాం, లోకానికి ఆకుపచ్చ కళ్ళజోడును తొడిగాడు.
(డా.రావులపాటి సీతారామారావు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, తెలుగు శాఖ, ఎస్‌ ఆర్‌ బిజిఎన్‌ఆర్‌ ఆర్ట్స్‌ డ సైన్స్‌ కళాశాల, ఖమ్మంలో 30 జూన్‌ 2025న పదవీ విరమణ సందర్భంగా)
– డా.ఎస్‌.రఘు
919848208533

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img