Friday, December 19, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమనువాద బంధనాల్ని చెరిపేస్తూ..మహిళా ఉద్యమాలను విస్తరిస్తూ…

మనువాద బంధనాల్ని చెరిపేస్తూ..మహిళా ఉద్యమాలను విస్తరిస్తూ…

- Advertisement -

మహిళా ఉద్యమాలు, పోరాటాలు, హక్కుల సాధనకు ప్రతీకగా నిలిచిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ మహాసభలు 2026 జనవరి 25-28 వరకు హైదరాబాదులో జరుగుతున్న సందర్భంగా ఇప్పటివరకు సాధించుకున్న హక్కులు, మహిళల నేటి పరిస్థితి సమీక్షించుకుని భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకోవాల్సిన సమయమిది. జాతీయ సంఘమైన ఐద్వా సమాజంలో మహిళగా, పౌరురాలిగా, వర్గ మహిళగా ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రీకరించి పనిచేస్తుంది. ఈ క్రమంలో మహిళలందరినీ చైతన్యపరిచి బాల్య వివాహాల నిషేధం, ఆస్తిహక్కు, పని ప్రదేశాల్లో శ్రామిక మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి చట్టం, గృహహింస నిరోధక చట్టం, పనిహక్కు, జాతీయ-రాష్ట్ర మహిళా కమిషన్లు, స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్లు తదితరాలపై మహాత్తరమైన పోరాటాలు చేసింది, సాధించుకుంది. ఆహార భద్రత, ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్టం, స్త్రీ స్వేచ్ఛ, సమాన హక్కులు తదితరాలపై మహిళలం దరినీ కూడగట్టి పోరాటాలు చేసింది.

అయితే, స్త్రీ-పురుష అసమానతలు, సమానవేతనం అమలులో లేకపోవడం, శ్రమదోపిడీ, వివక్షత, కొత్త రూపాలు సంతరించుకున్న హింస, ఉపాధి అవకాశాలు తగ్గడం, సామాజిక ఉత్పత్తి నుండి దూరం చేయడం, విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించకపోవడం తదితరాలన్నీ సమాజంలో స్త్రీ స్థానం దిగజారడానికి తోడ్పడుతున్నాయి. సంఘటితరంగంలో ఆరు శాతం మాత్రమే మహిళలు ఉంటే, అసంఘటిత రంగంలో 94 శాతం మంది ఉండి శ్రమకు తగిన వేతనాలు, ఇతర సౌకర్యాలు అమలు కాక, వెట్టిచాకిరికి గురవుతున్నారు. సనాతన ధర్మ రక్షణ పేరిట పితృస్వామిక సమాజాన్ని బలోపేతం చేస్తూ, కులాధిపత్యాన్ని పెంచి పోషిస్తూ, మనువాదాన్ని కీర్తిస్తూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాని అమలుకు పూనుకుంటూ స్త్రీని మళ్లీ నాలుగు గోడలకు పరిమితం చేస్తోంది. రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుష సమానత్వ సాధన లక్ష్యంగా కృషి చేయాల్సిన ప్రభుత్వం, అందుకు రాజ్యాంగంపై ప్రమాణం చేసిన పాలకులు మనువాద ధర్మాన్ని కొనసాగిస్తూ, మహిళాభివృద్ధికి అడ్డుపడుతున్నారు.

ఈ దశాబ్ద కాలంలో దిగజారిన మహిళల భద్రత, ఆర్థిక పరిస్థితి, కుటుంబాల జీవన స్థితిగతులు మోడీ ప్రభుత్వ వాగ్దానాల డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం అత్యంత అధమస్థానంలో ఉంది. లింగ అసమానతలు పెరిగాయి. మహిళల నిరుద్యోగం పెరిగింది. చేస్తున్న ఉద్యోగాలు పోయి, స్త్రీలు ఇంటికే పరిమితమవుతున్న పరిస్థితి దాపురించింది. పెద్దనోట్ల రద్దు సమయంలో కోటి మంది ఉద్యోగాలు కోల్పోగా, అందులో 88 లక్షల మంది మహిళలే ఉన్నారు. నిరుద్యోగులను ఆదుకునే ఆలోచన చేసే బదులు బీజేపీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి, లేబర్‌కోడ్‌ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించి వారికి ఉద్యోగ భద్రత లేకుండా చేసింది. స్కీం వర్కర్ల కనీస వేతన డిమాండ్‌ రూ. 26వేలును తోసిపుచ్చింది. అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు యాభై శాతం పెంచుతామని ఎన్నికల ముందు చేసిన వాగ్ధానం అటకెక్కింది. వారిని ఉద్యోగులుగా గుర్తించాలనే చిరకాల డిమాండ్‌ పట్టించుకోవడమే లేదు.

వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. అత్యధిక మంది మహిళలు ఈ రంగంలో పనిచేస్తున్నారు. మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాదానికి సాగిలపడుతూ, రైతురంగాన్ని దీవాళా తీయిస్తోంది. వారిని ఆదుకునే దిశగా చర్యలు తీసుకోకపోవడంతో పాటు, నష్టపరిహారం అందించడంలో పూర్తిగా విఫలమైంది. బీజేపీ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 42శాతం మంది మహిళలు ఉన్నారు. మహిళా రైతులను గుర్తించ నిరాకరించడంతో పాటు, వారికి భూమిపైన హక్కు దక్కడం లేదు. అటవీ భూములను పెద్దపెద్ద ప్రాజెక్టులకు అప్పజెప్పడంతో ఆదివాసీ మహిళలు భూమినుండి తరలి వేయబడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం మహిళలు నిర్వాసితులుగా, అనాధలుగా మారుతున్న పరిస్థితి నెలకొంది. ఉజ్వల స్కీం ద్వారా మహిళలందరికీ ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తామని, ఒకేరోజు 2.98 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. 2014లో సిలిండర్‌ ధర రూ. 412లు ఉండగా, నేడు అది రూ.905కు చేరింది. దాంతో ఉజ్వల కనెక్షన్లు పొందిన మహిళలు పెరిగిన సిలిండర్‌ ధర భరించలేక దాన్ని అటకెక్కించారు. నిరుపేద మహిళలకు మళ్లీ కట్టెల పొయ్యే గతైంది.

విద్యా, వైద్యం అంగట్లో సరుకుగా మారింది. మహిళా శిశు ఆరోగ్యాన్ని మోడీ ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. మాతృ ప్రయోజన నిధుల్లో ముప్ఫయి శాతం కోత విధించింది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కూడా బీమా సంస్థలకు లాభం చేకూర్చేదిగా మారింది. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) పేరుతో 2020 నుండి విద్యా ప్రయివేటీకరించబడుతోంది. దేశ వ్యాపితంగా రెండు లక్షల పాఠశాలలు మూతపడడంతో మూడవ వంతు బాలికలు బడుల్లో చేరలేకపోతున్నారు. పాఠాలన్నీ మత తత్వంతో నింపబడుతున్నాయి. హిజాబ్‌ పేరుతో ముస్లిం విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల స్వేచ్ఛ, సమానత అంశాలు, దళితులు, మైనారిటీల అనుకూల పోరాటాలను పాఠ్యాంశాల నుండి తొలగించారు. నేషనల్‌ క్రైం బ్యూరో లెక్కల ప్రకారం మోడీ పాలనలో మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు 94.47 శాతం (2017తో పోల్చితే) పెరిగాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండగా, రాజస్థాన్‌ది రెండవ స్థానం. లైంగిక నేరాలు చేసిన వారిలో అనేక సందర్భాల్లో బీజేపీకి చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు ఉన్నారు. హత్యారోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. దళిత, గిరిజన, మైనార్టీ మహిళలపై దాడులు పెరిగాయి.

బీజేపీ, ఆరెస్సెస్‌ల రాజకీయ మూలాలు బలపడడానికి కారణం మతతత్వం. ఇది మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి ఐక్యతను దెబ్బతీస్తోంది. మైనారీటీ మహిళలను సర్వనాశనం చేస్తోంది. మణిపూర్‌లో మైనార్టీ తెగలకు చెందిన మహిళలపై సామూహిక లైంగిక దాడులకు పాల్పడి, వారిని నగ్నంగా ఊరేగించిన ఘటన బీజేపీ మత ప్రాతిపదికన మహిళలను ఎలా విడదీస్తోందో… హింసిస్తున్నదో తెలియజేయడానికి ఒక మచ్చుతునక. గుజరాత్‌లో గర్భిణీ స్త్రీ అయిన ‘బిల్కీస్‌ బానో’ అనే మహిళపై సామూహిక లైంగికదాడి చేసి, కన్నబిడ్డను ఆమె కండ్లముందే చంపేసి, కుటుంబ సభ్యులందరిపై లైంగిదకాడి చేసి వారిని మట్టుబెట్టిన ఘటనలో పదకొండు మంది నేరస్తులను గుజరాత్‌ ప్రభుత్వం క్షమాభిక్ష పేరుతో విడుదల చేసి పూలదండలు, మిఠాయీలు, ఊరేగింపులతో సత్కరించడం చూసి యావత్‌ ప్రపంచం నివ్వెరపోయింది. బిల్కీస్‌బానోతో పాటు సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, ఇతర స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసి, ఆందోళనలకు పూనుకోవడంతో నేరస్తులు మళ్లీ జైలుకు వెళ్లారు.

ఉత్తరప్రదేశ్‌ వున్నావ్‌ ఘటనలో నిందితుడైన ఎంపీ కులదీప్‌కు కశ్మిర్‌లోని కతువాలో చిన్నారిని చిదిమేసిన నేరగాడికి కేంద్రం అండతో అక్కడి ప్రభుత్వాలు రక్షించే పనికి పూనుకోవడం దేశవ్యాపితంగా సంచలనం గావించబడ్డాయి.దేశ ప్రతిష్ట ప్రపంచ నలుమూలలు చాటి పతకాలు తెచ్చిన రెజ్లర్లపై జాతీయ రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ లైంగికంగా వేధించడం, కేంద్ర ప్రభుత్వం అతనికి అండగా నిలబడ్డ తీరును చూసి ఏలికలు ఎవరిపక్షమో దేశమంతా గమనించింది. ఢిల్లీ నడివీధుల్లో మూడు నెలల పాటు వారు చేసిన పోరాటానికి ఫలితం దక్కకపోవడంతో చివరకు వారు ప్రాణంగా ప్రేమించే ఆట నుండే నిష్క్రమించాల్సిన పరిస్థితి. దేశ మహిళల ఆకాంక్షలకు ప్రతిబింబమైన మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాతికేండ్లుగా పార్లమెంట్‌ గోడలకు వేలాడబడింది. 2024 ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సమావేశాలు పెట్టి ఆగమేఘాలతో కేంద్రం చట్టం చేసింది. అయితే, ఈ చట్టం జనగణనతో పాటు, నియోజకవర్గాల పునర్‌ విభజన జరిగిన తర్వాత అమలులోకి వస్తుందట! దీనికి నిర్ధిష్టమైన కాలపరిమితి విధించలేదు.

ఎప్పటికో అమలయ్యే చట్టం పట్ల మరి ఇంత హడావుడి ఎందుకు చేసినట్టు? ఏ చట్టం అమలుకు లేని అడ్డంకులు మహిళా రిజర్వేషన్‌ చట్టం అమలుకు ఎందుకు? దీని వెనకాల ఉన్న మోసాన్ని మహిళలు గ్రహించాలి. ప్రజలను దోపిడీ చేసి, కార్పొరేట్లకు కట్టబెట్టడం, మతాన్ని, కులాన్ని వాడుకుని సమీకరణలు చేయడం, దేశ స్వరూప స్వభావాలను ధ్వంసం చేసి, రాజకీయ లబ్ధి పొందడం బీజేపీ ఎజెండా. పురుషాధిపత్యాన్ని, కులాధిపత్యాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ మన రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మత, కుల ఉన్మాద భావనలు రెచ్చగొడుతున్నారు. కులాంతర వివాహాలు చేసుకుంటున్న యువతీ, యువకులు దురహంకార హత్యలకు గురికాబడుతున్నారు. సనాతన ధర్మ రక్షణ పేరిట మూఢాచారాలను ప్రోత్సహిస్తున్నారు. స్త్రీని ఇంటికి పరిమితం చేసే కుట్ర జరుగుతున్నది. ప్రజాస్వామ్యాన్ని, మేధోవికాసాన్ని మనువాదం సహించలేకపోతున్నది. స్త్రీలు స్వేచ్ఛగా ఉండకూడదని, బానిసలుగా బతకాలని శాసిస్తుంది. మనుధర్మాన్ని నమ్ముతూ, ఆచరణలో అనుసరిస్తున్న ఆరెస్సెస్‌, బీజేపీ పాలన కేంద్రంతో పాటు, అనేక రాష్ట్రాల్లో నడుస్తోంది. పోరాడి సాధించుకున్న హక్కులు కనుమరుగవుతున్నాయి. ప్రగతి తిరోగమన బాటపట్టింది. మోడీ ప్రభుత్వ ”మాటల్లో ఆర్భాటం – చేతల్లో అణచివేత”ను తిప్పికొడదాం. మనకోసం, మన బిడ్డల మనుగడ కోసం, కుటుంబాల రక్షణ కోసం ఐక్యంగా కదులుదాం.

టి.జ్యోతి
9490300918

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -