నవతెలంగాణ – ఉప్పునుంతల
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్ద బోయపల్లి గ్రామానికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు (35), పిల్లలు మోక్షిత (8), వర్షిణి (6), శివధర్మ (4) మృతదేహాలు నాగర్‌కర్నూల్ జిల్లాలో బయటపడటంతో కలకలం రేగింది.
మిస్సింగ్ కేసు నుంచి హృదయ విదారక మలుపు..
వారం క్రితం భార్య దీపిక ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఆ గాలింపులోనే వెల్దండ సమీపంలో వెంకటేశ్వర్ల శవం, జాతీయ రహదారి 765 పరిధిలో పిల్లల మృతదేహాలు లభించాయి.
చెల్లాచెదురుగా మృతదేహాలు – ప్రజల ఆవేదన..
తాండ్ర గేట్ దగ్గర పొదల్లో ఒక చిన్నారి శవం, సూర్య తండా పంచాయతీ పరిధిలో మరో ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. “ఏం పాపం చేశారు పసిపిల్లలు?” అని ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
పోలీసుల అనుమానం – తండ్రి పాత్రేనా?.
ప్రాథమిక దర్యాప్తులో తండ్రే పెట్రోల్ పోసి పిల్లలను కాల్చి చంపి, ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. అయితే కుటుంబ కలహాల కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
ముమ్మర గాలింపు – పోలీసుల కసరత్తు
ఈ గాలింపులో అచ్చంపేట సీఐ నాగరాజు, ఉప్పునుంతల ఎస్సై వెంకట్‌రెడ్డి, ఏఎస్ఐ రెడ్యానాయక్, పోలీసు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాల పుటేజీ సాయంతో శవాల ఆచూకీ తెలిసింది.