– ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే
– డిప్యూటీ స్పీకర్ లేకపోవడం రాజ్యాంగ శూన్యత కాదా?
– రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమాధానం చెప్పాలి : మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొప్ప నీతులు చెప్తూ రాష్ట్రంలో మాత్రం అదే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కుతున్నదని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో అడ్డగోలుగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరడం, అగౌరవపరచడంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పోస్టును ఏడేండ్లుగా ఖాళీగా ఉంచడాన్ని రాజ్యాంగ శూన్యత అని పీఏసీ చైర్మెన్ కేసీ వేణుగోపాల్ అనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఆయన చెప్పిన మాటలు నిజమే కావచ్చనీ, కానీ అదే సూత్రం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్తించదా?అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేండ్లు కావస్తున్నా అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పోస్టును ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొంతు చించుకునే కేసీ వేణుగోపాల్, రాహుల్‌గాంధీలు తెలంగాణలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనపై ఏం సమాధానం చెప్తారనీ, ఇది రాజ్యాంగ శూన్యత కాదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాజ్యాంగ విలువల గురించి ఢిల్లీలో నీతులు చెప్పే కాంగ్రెస్, తన రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాల్లో వ్యవస్థలను ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలనే కాంగ్రెస్ కూడా తెలంగాణలో పాటిస్తోందని తెలిపారు. ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడంలో పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, రాజ్యాంగబద్ధమైన పదవులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఢిల్లీలో నీతులు… రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



