పరిపాలన ఆర్థిక ఒత్తిడిని ఒక సాధనంగా ట్రంప్ ప్రయోగం
మీడియాతో మాట్లాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్
బీజింగ్: రష్యా ఆర్థిక భాగస్వాములు లక్ష్యంగా చేసుకున్న యూరప్ ఆంక్షల ప్రణాళికలను ఆ దేశ అధ్యక్షుడు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా భారత్, చైనాపై ఇలాంటి చర్యలు తీసుకోవడం కాలం చెల్లిన వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. ఈ చర్యలు చారిత్రక సున్నితత్వం కలిగిన దేశాల్లో రాజకీయ పరిణామాలకు దారి తీస్తాయని హెచ్చరించారు. అలాగే ఆసియాలోని రెండు అతిపెద్ద శక్తులను అణగదొక్కడానికి, ట్రంప్ సర్కార్ ఆర్థిక ఒత్తిడిని ఒక సాధనంగా ఉపయోగిస్తోందని ఆరోపించారు. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశం అనంతరం సైనిక కవాతులో పాల్గొన్న పుతిన్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
భారత్, చైనాలు భాగస్వాములని పుతిన్ అన్నారు. అమెరికా విధించే సుంకాలు ఇరుదేశాల నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నమని అభివర్ణించారు. 1.5 బిలియన్ల జనాభా కలిగిన భారత్, చైనా వంటి శక్తిమంతమైన దేశాలు బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే వీటికి ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు, దేశీయ చట్టాలు కలిగి ఉన్నాయని తెలిపారు. సుంకాల పేరుతో వారిని శిక్షించే ప్రయత్నాలు చేస్తే అవి ఆ దేశ నాయకులను ప్రమాదంలోకి నెట్టివేస్తాయన్నారు. వారి రాజకీయ ప్రవృత్తులపై చాలా భారం పడుతుందని తెలిపారు. ఈ క్రమంలో ఎవరైనా బలహీనపడితే అతని రాజకీయ జీవితం ముగిసిపోతుందని వ్యాఖ్యానించారు.
‘ఇరు దేశాల చరిత్రలో వలసవాదం వంటి కష్టతరమైన కాలం నడిచింది. చాలా కాలం పాటు వారి సార్వభౌమాధికారంపై పన్ను విధించారు. ఇప్పుడు ఆ యుగం ముగిసింది. ఇంకా వాటిని అణగదొక్కేలా మాట్లాడడం సరైనది కాదు. భాగస్వాములతో మాట్లాడేటపుడు సరైన పదాలు ఉపయోగించాలి’ అని పుతిన్ పేర్కొన్నారు. ఈ ఉద్రిక్తతలు త్వరలోనే ముగుస్తాయని, పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంకా పూర్తి స్థాయిలో ఆంక్షల మోత మోగించలేదు: ట్రంప్
అదనపు సుంకాలతో గత కొద్ది రోజులుగా భారత్.. అమెరికా మధ్య సంబంధాలు క్షీణించాయి. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోందని అమెరికా భారత్ పై అదనపు సుంకాలు విధించింది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు భారత్‌పై విధించిన సుంకాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై ఇంకా పూర్తి స్థాయిలో ఆంక్షల మోత మోగించలేదని అన్నారు. అవి సెకండరీ సుంకాలు మాత్రమేనని, ఆ దేశంపై రెండు, మూడు విడతలు చేపట్టలేదని స్పష్టం చేశారు.