Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుమూల్యాంకనం లేదా మెయిన్స్‌ పరీక్ష

మూల్యాంకనం లేదా మెయిన్స్‌ పరీక్ష

- Advertisement -

గ్రూప్‌-1పై హైకోర్టు తీర్పు
ఫైనల్‌ మార్కుల లిస్టు, జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టులు రద్దు
తీర్పు చెప్పిన న్యాయమూర్తి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం కీలక తీర్పు చెప్పింది. మెయిన్స్‌ పరీక్ష పేపర్లను పున్ణమూల్యాంకనం చేయాలని టీజీపీఎస్‌సీని ఆదేశించింది. ఇప్పటికే ప్రకటించిన తుది మార్కుల జాబితా, జనరల్‌ ర్యాకింగ్‌ జాబితాలను రద్దు చేసింది. మెయిన్స్‌ అభ్యర్థుల పేపర్లు పున్ణమూల్యానం చేసి అర్హుల జాబితాను ప్రకటించాలని ఆదేశించింది. ఆ తరువాత నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. సుప్రీం కోర్టు సంజరు సింగ్‌ వర్సెస్‌ యూపీఎస్సీ కేసు తీర్పులోని గైడ్‌లైన్స్‌ మేరకు మోడరేషన్‌ విధానంలో పున్ణమూల్యాంకాన్ని మాన్యువల్‌ పద్ధతిలో చేయాలని సూచించింది. పున్ణమూల్యాంకనం చేయలేకపోతే తిరిగి గ్రూప్‌-1 పరీక్షను నిర్వహించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తం ఎనిమిది నెలల్లోగా పూర్తి చేయాలని నిర్దేశించింది. గ్రూప్‌-1 మూల్యాంకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై రెండు ఆప్షన్స్‌తో కూడిన కీలక తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు మంగళవారం వెలువరించారు. గ్రూప్‌-1 మూల్యాంకనం తిరిగి నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కొందరు అభ్యర్థులు, ఉద్యోగ ఎంపిక ప్రక్రియ మొదలయ్యే దశలో కోర్టు జోక్యం చేసుకోరాదని మరికొందరు అభ్యర్థులు దాఖలు చేసిన సుమారు 20 పిటిషన్లపై న్యాయమూర్తి సుదీర్ఘంగా వాదనలు విన్నాక తీర్పును గత జులై 7న వాయిదా వేశారు. మంగళవారం 222 పేజీల తీర్పును వెలువరించారు.

సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణలో అనేక లోపాలకు పాల్పడిందన్నారు. ఆచరణలో అనేక అవకతవకలు జరిగాయని గుర్తించినట్టు తీర్పులో పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు, వాళ్లు సమర్పించిన పత్రాల పరిశీలన, విశ్లేషణ తరువాత గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను కమిషన్‌ పారదర్శకంగా నిర్వహించలేదని తేలిందన్నారు. కమిషన్‌ పారదర్శకత, సమగ్రతను కొనసాగించలేదనీ, పక్షపాతంతో వ్యవహరించిందని తప్పుపట్టారు. కమిషన్‌ ఉద్యోగ నియామక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. నిర్లక్ష్యం, అసమర్థత కనబడ్డాయన్నారు. నిరుద్యోగ యువత ఎంతో శ్రమించి గ్రూప్‌ -1 ఉద్యోగం సాధించాలనే ప్రయత్నాలకు అవరోధం కల్పించిందన్నారు. నిత్యం పది గంటలకుపైగా చదువుకోవడం, కోచింగ్‌ సెంటర్స్‌కు వెచ్చించడం, ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి చదివిన అభ్యర్థులకు నిరాశ చేకూర్చిందన్నారు. మూల్యాంకన వ్యవహారంతోపా టు విధానపరంగా కూడా కమిషన్‌ లోపాలకు పాల్పడిందన్నారు. గతంలో రెండుసార్లు గ్రూప్‌-1 పరీక్ష రద్దు అయ్యాయనీ, ఈ మేరకు హైకోర్టు వెలువరించిన తీర్పుల తర్వాత కమిషన్‌లో మార్పులు రాలేదన్నారు. గత మార్చి 10వ తేదీన వెలువరించిన తుది మార్కుల జాబితాను, 30వ తేదీ నాటి జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సంజరు సింగ్‌-యు.పి. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కేసులో సుప్రీం కోర్టు తీర్పులోని సూచనల మేరకు మోడరేషన్‌ పద్ధతిలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల సమాధాన పత్రాలను మాన్యువల్‌గా తిరిగి మూల్యాంకనం చేయాలని కమిషన్‌ను ఆదేశించారు. ఇలా చేశాకే ఫలితాలను వెల్లడించి నోటిఫికేషన్‌కు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఒకవేళ పున్ణ మూల్యాంకనం చేయలేకపోతే, గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేయాలనీ, ప్రిలిమ్స్‌ పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులకు తిరిగి మెయిన్స్‌ పరీక్ష జరపాలన్నారు.

గత ఏడాది ఫిబ్రవరి 19వ వెలువడిన ఉద్యోగ నోటిఫికేషన్‌ (నెం.02/2024) మేరకు పరీక్షలను నిర్వహించాలన్నారు. ఈ ప్రక్రియ 8 నెలల్లోగా పూర్తి చేయాలన్నారు. జనరల్‌ ర్యాకింగ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తమ తీర్పుకు అనుగుణంగా మళ్లీ మూల్యాంకనం చేయాలని, పున్ణ మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్‌ నిర్వహించాలన్నారు. 2024 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన 563 గ్రూప్‌ -1 పోస్టుల భర్తీకి సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌కు అనుగుణంగానే తిరిగి పోస్టుల భర్తీ ఉండాలన్నారు. అదే ఏడాది మే/జూన్‌ నెలల్లో ప్రిలిమ్స్‌, అక్టోబర్‌లో మెయిన్స్‌ పరీక్షలు జరిగాయనీ, ఈ ఏడాది మార్చిలో మెయిన్స్‌ ఫలితాలు వెలువడ్డాయనీ, గత ఏప్రిల్‌లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తైందని తీర్పులో ప్రస్తావించారు. అర్హత సాధించిన పలువురు అభ్యర్థులు పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అవకతవకలు, అక్రమాలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు, న్యాయమూర్తి టీజీపీఎస్సీకి రెండు సూచనలు చేశారు. మెయిన్స్‌ అభ్యర్థుల పేపర్లు పున్ణ మూల్యాంకనం చేయాలని, పున్ణ మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్‌ నిర్వహించాలని కమిషన్‌ను ఆదేశించారు. ఇదిలా ఉండగా, సింగిల్‌ జడ్జి తీర్పుపై ద్విసభ్య ధర్మాసనం ఎదుట అప్పీల్‌ దాఖలు చేయాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad