Tuesday, July 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందశాబ్దం గడిచినా హామీల అమలు జాడలేదు

దశాబ్దం గడిచినా హామీల అమలు జాడలేదు

- Advertisement -

– విభజన చట్టంలో హామీలు అమలు చేయాలి
– ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా కల్పించాలి
– బనకచర్లపై గోడమీది పిల్లిలా కేంద్రం చర్యలు
– మిగులు జలాలు తేల్చాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌
– ఓటర్ల తొలగింపుపై పార్లమెంట్‌లో మోడీ మాట్లాడాలని డిమాండ్‌
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

రాష్ట్రం ఏర్పడి దశాబ్ధకాలం గడిచినా.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌ అన్నారు. నదీ జలాల పంపకాలు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, మెట్రోమార్గం పొడిగింపుపై ఎలాంటి కేంద్రీకరణ జరగలేదని.. గత సీఎంతో పాటు ప్రస్తుతం సీఎం పలుమార్లు విన్నవించినా మోడీ సర్కార్‌ బుట్టదాఖలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంరతం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా కల్పించకుండా రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డును మూడు సార్లు ప్రారంభించినా.. ఇప్పటి వరకు విధివిధానాలు ఖరారు చేయలేదని తెలిపారు. జిల్లాకు కొత్త రైల్వే లైన్లు, విమానాశ్రయ హామీలపై అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవన్నారు. ఎస్‌ఐఆర్‌ కింద ఓటర్ల మధ్యంతర సమీక్ష పేరుతో ఓటర్ల తొలగించడం దుర్మార్గమని.. ఈ అంశంపై మోడీ పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓటు హక్కు పోతే అన్ని హక్కులు పోతాయని అన్నారు. 1987 ప్రతిపాదికగా చెప్పి 11 రకాల ధ్రువపత్రాలను తీసుకురావాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రస్తుతం బీహార్‌లో కొనసాగుతుందని త్వరలో రాష్ట్రంలో సైతం చేపట్టే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్లపై మోడీ ప్రభుత్వం గోడమీది పిల్లిలా వ్యవహరిస్తున్నదని, మిగులు జలాలు తేల్చి కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు పారదర్శకంగా చేపట్టలేదని.. కాంగ్రెస్‌ పార్టీ నాయకులకే కేటాయించినట్టు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. రేషన్‌ కార్డులపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని, వాటిపై స్పష్టత ఇచ్చి ప్రతి పేద కుటుంబానికి రేషన్‌కార్డు అందజేయాలని డిమాండ్‌ చేశారు. వర్షాలు పడక రైతులకు నష్టం వాటిల్లుతుందని, నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని.. కరువు నివారణా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బి.ప్రసాద్‌, పార్టీ జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్దివెంకట్రాములు, నూర్జహాన్‌, పల్లపు వెంకటేశ్‌, శంకర్‌గౌడ్‌, జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్‌, నన్నేసాబ్‌, కొండ గంగాధర్‌, సుజాత, విఘ్నేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -