Monday, December 1, 2025
E-PAPER
Homeమానవికదలలేకున్నా విభిన్న కళల్లో...

కదలలేకున్నా విభిన్న కళల్లో…

- Advertisement -

శ్రద్ధేష్‌ పేరు ఎంత బాగుందో కదూ? ఆమె పూర్వీకులు ఎన్నో తరాల కిందట యు.పి. నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఇంట్లో హిందీ మాట్లాడుతారు. తెలుగు, ఆంగ్లం కూడా అనర్గళంగా మాట్లాడతారు. అంతే కాదు రకరకాల చేతిపనుల్లో ఆమె నిష్ణాతురాలు.

సరదాగా వుండే ఆమె
శ్రద్దేష్‌ అమ్మ నాన్నలు శిరోమణి శ్రీవాస్తవ ఎస్‌.ఎస్‌.కరణ్‌. అక్క డాక్టర్‌ దుర్గేష్‌ నందిని..చెల్లి అవదేష్‌. రకరకాల పూసలతో అలంకరణ సామాగ్రి తయారు చేయడం, పూసలల్లటం, కవితలు, వ్యాసాలు రాయడం ఆమె హాబీలు. నిత్యం ఎంతో ఉత్సాహంతో ఉంటూ తన బాధను మర్చిపోయి ఇతరులతో సరదాగా నవ్వుతూ తుళ్లుతూ గలగల మాట్లాడే శ్రద్దేష్‌ జీవతంలో ఓ విషాధ సంఘటన వుంది.

విషాద సంఘటన
”నాకు నాలుగు నెలల వయసులో మాఅక్క దుర్గేష్‌ (దాదాపు ఒకటిన్నర రెండేళ్ల వయసులో)కు పోలియో డ్రాప్స్‌ డి.పి.టి.ఇంజక్షన్‌ ఇప్పించారు. వాటి రియాక్షన్‌ తో మా అక్కకి ఎడమకాలు, నాకు శరీరమంతా చచ్చుబడింది. మానాన్న ఆర్మీలో సుబేదారుగా ఉంటూ మేజర్‌గా చేశారు. మాకు ఇది జరిగినప్పుడు ఆయన యుద్ధ భూమిలో ఉన్నారు. అయినా మాకోసం అమ్మ నాన్నలు పడిన తిప్పలు అంతా ఇంతా కాదు. చూపని డాక్టర్లు, చేయని వైద్యం లేదు. పూణే, బెంగుళూర్‌ ఇలా ఎవరు ఏసలహా ఇస్తే అక్కడికి మమ్మల్ని తిప్పారు. చివరకు ఆయుర్వేదం, హౌమియో చికిత్సలకు కూడా నేను కోలుకోలేకపోయాను. అయితే మా అక్కకి దాదాపు నయమై ఆమె మామూలు మనిషి కావటం మా అమ్మనాన్నలకు కాస్త ఊరట కలిగించింది. మహావీర్‌ హాస్పిటల్లో సర్జరీ చేశారు. హిమాయత్‌ నగర్లో ఒక ప్రైవేట్‌ నర్సింగ్‌ హౌంలో నన్ను ఉంచారు. రోజూ ఇంటి నుంచి నన్ను తీసుకువెళ్లటం కష్టమని. అక్కడ నాకు కేర్‌ టేకర్‌ను పెట్టారు. కానీ అక్కడ భయంకర నరకం అనుభవించాను. ఎవరితో చెప్పుకోవాలో అర్థం అయ్యేది కాదు. ఇప్పటికీ తల్చుకుంటే నాగుండె ఝల్లు మంటుంది” అంటూ గుర్తు చేసుకున్నారు.

చిత్ర హింసలు అనుభవించి
శ్రద్ధేష్‌ 8, 9 ఏండ్ల పాపగా ఉన్నప్పుడు హిమాయత్‌ నగర్‌ లో ఒక డాక్టర్‌ ఇంట్లో ట్రీట్మెంట్‌ కోసం ఉంచారు. అయితే అక్కడ ఆమెకు సరిగా తిండి పెట్టే వాళ్లు కాదు. పైగా కొట్టి తిట్టి హింసించేవారు. ఆయాతో సహా ఇలాగే ప్రవర్తించేవారు. కానీ శ్రద్ధేష్‌ తల్లి, బంధువులొచ్చినపుడు మాత్రం ఎక్కడ లేని ప్రేమ ఒలకబోసేవారు. అలా అక్కడ ఏడెనిమిది నెలలు చిత్ర హింసలు అనుభవించిన ఆపాప ”ఈ హింస అనుభవించేకన్నా వికలాంగురాలిగా బతకడమే నయం” అనుకునేది. ఇప్పటికీ ఆ పాత జ్ఞాపకాలు ఆమెను తొలిచేస్తుంటాయి.

చెల్లెలి సాయంతో
శ్రద్ధేష్‌ కి ఇంట్లోనే అమ్మ అమ్మమ్మ చదువుచెప్పారు. పరీక్షలు రాయడానికి మాత్రమే బడికివెళ్లేది. ఎస్‌.ఎస్‌.సి పరీక్షలను ప్రిన్సిపాల్‌ రూంలో కూర్చుని రాసిందామె. స్పీడ్‌ గా రాయడం కష్టమై అన్ని ప్రశ్నలకు జవాబులు రాయలేకపోయినా థర్డ్‌ డివిజన్‌ లో పాసయ్యింది. ఇంటర్‌ హిందీ మీడియంలో చదవడం ఓకొత్త అనుభవం అంటారు ఆమె. తల్లి ఆమెను రోజూ థర్డ్‌ ఫ్లోర్‌ లో ఉండే క్లాసులో దింపేది. నోట్సులు కూడా ఆమె రాసి ఇచ్చేది. సాయంత్రం రిక్షా అతను ఇంటికి తీసుకు వచ్చేవాడు. క్లాస్‌ పిల్లలు, టీచర్లు ఎంతో ప్రోత్సాహించేవారు. గ్రాడ్యుయేషన్‌ ఇంగ్లీష్‌ మీడియంలో చేశారు. ఇక్కడ తన చెల్లెలు ఆమెకు ఇచ్చిన చేయూత మాటల్లో చెప్పలేము. ఉదయం కాలేజీలో దింపి సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లేది. విద్యార్థిగా వ్యాస రచన, వక్తత్వం ఇలా అన్నిపోటీల్లో శ్రద్ధేష్‌ కి బహుమతులు రావటం ఆమె పట్టుదలకి నిదర్శనం.

అవార్డులు-రివార్డులు
ఉస్మానియా యూనివర్శిటీలో పి.జి.చేశారామె. పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు చెల్లి ఆమెతోనే ఉండేది. సాయంత్రం ఫిజియోథెరపీ తర్వాత కె.జి.నుంచి పి.జి.దాకా ఆన్లైన్‌ క్లాసులు తీసుకుంటారు. ఇంట్లో అమ్మ ఇద్దరు తమ్ముళ్లు మరదలు హెల్ప్‌ చేస్తారు. ఎక్కడికైనా వెళ్లాలంటే అక్కకొడుకు చేతులపై మోసుకొని వెళతాడు. ఆర్టీసీ ఉద్యోగి అయిన తండ్రి స్నేహితుడు సయ్యద్‌ అమీన్‌ సాయం మరువలేనిది అంటారు. శ్రద్దేష్‌కు వచ్చిన రివార్డులు అవార్డులు లెక్క లేనన్ని. సూపర్‌ ఉమన్‌, నారీసమ్మేళన్‌ గోల్డెన్‌ నంది, హిందీశిరోమణి, అబ్దుల్‌ కలాం, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఆర్ట్‌ ఆఫ్‌ లెర్నింగ్‌, శక్తిసమ్మాన్‌ ఇలా ఎన్నో ఎన్నెన్నో.

  • అచ్యుతుని రాజ్యశ్రీ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -